సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దాదాపు రూ.25వేల కోట్ల ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనుల్లో సుమారు రూ.4,400 కోట్ల విలువైన వాటికి బ్రేక్ పడింది. అటు ప్రభుత్వం, ఇటు జీహెచ్‌ఎంసీ వద్ద నిధులు లేకపోవడం.. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం తదితర పరిణామాలతో ప్రారంభించని పనులతో పాటు 90శాతం భూసేకరణ పూర్తవ్వని ప్రాజెక్టుల జోలికి వెళ్లొద్దని జీహెచ్‌ఎంసీకి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలిసింది. వీటితో పాటుపురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా జీహెచ్‌ఎంసీ దాదాపు రూ.25వేల కోట్ల పనులకు ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. వీటిని వివిధ దశల్లో చేపట్టాల్సి ఉండగా.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం కొన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ పనుల కోసం బల్దియా రూ.495 కోట్లను బాండ్ల ద్వారా సేకరించింది. వీటి చెల్లింపులతో పాటు వివిధ నిర్వహణ పనులు, ఇతరత్రాలకు నిధులు లేవు. ప్రతినెల వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు పొంతన కుదరడం లేదు. సిబ్బంది జీతాల చెల్లింపులకే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన నిధులు అందజేయగలదన్న ఆశలు కూడా అడుగంటాయి. మరోవైపు ఇంకా ప్రారంభం కాని, టెండర్ల ప్రక్రియ పూర్తికాని ప్రాజెక్టులు చేపట్టరాదన్న సంకేతాలతో పలు పనులకు బ్రేకులు పడ్డాయి.
పురోగతిలో ఉన్న పనులు సైతం...
సాధారణ ఫ్లైఓవర్ల కంటే స్టీల్ బ్రిడ్జీలను తక్కువ భూసేకరణతోనే చేపట్టే వీలుండడంతో రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ టెండర్ల వరకు వచ్చినప్పటికీ... పూర్తికాకపోవడంతో నిలిపేయాల్సి వచ్చింది. మరోవైపు వివిధ దశల్లో పురోగతిలో ఉన్న రూ.2వేల కోట్లకు పైగా పనుల పరిస్థితి డోలాయమానంలో పడింది. వాటిలో కామినేని–బైరామల్‌గూడ అండర్‌పాస్, నాగోల్ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45–దుర్గం చెరువు, షేక్‌పేట–విస్పర్‌వ్యాలీ, బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ ఫ్లైఓవర్లు
తదితర ఉన్నాయి.
ఇతర ప్రాజెక్టులు
♦ రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ అంచనా వ్యయం రూ.636.80 కోట్లు
♦ ఎన్‌ఎఫ్‌సీఎల్–మెహదీపట్నం ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.1200 కోట్లు
♦ ఆరాంఘర్–జూపార్కు ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.320 కోట్లు
♦ ఇవి కాకుండా మరో రూ.1,000 కోట్లకు పైగా ప్రాజెక్టులు ఆగిపోయాయి.
వీటికే బ్రేకులు
♦ నల్లగొండ క్రాస్ రోడ్ – ఒవైసీ జంక్షన్
♦ ఇందిరాపార్కు–వీఎస్‌టీ జంక్షన్
♦ రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్
♦ ఎన్‌ఎఫ్‌సీఎల్–మెహదీపట్నం ఫ్లైఓవర్
♦ ఆరాంఘర్–జూపార్కు ఫ్లైఓవర్
♦ ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి.
ఈ ప్రాజెక్టులకే బ్రేకులు
♦ నల్లగొండ క్రాస్ రోడ్ – ఒవైసీ జంక్షన్
♦ నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్
♦ పొడవు 4 కిలోమీటర్లు
♦ అంచనా వ్యయం రూ.523.37 కోట్లు
♦ రద్దీ సమయంలో వాహనాలు:70,576 ( 2015లో)
♦ 2035 నాటికి వాహనాలు: 1,93,632
నల్లగొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్‌ల మీదుగా ఒవైసీ జంక్షన్ వైపు దాదాపు 4కి.మీ మేర ఈ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మిథాని, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి చాదర్‌ఘాట్, కోఠిల మీదుగా న్యూసిటీలోకి వచ్చేవారు.. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మార్గంలో పలు ప్రార్థనా మందిరాలు ,ఆస్పత్రులతో పాటు పోలీస్ స్టేషన్, శ్మశానవాటికలు ఉండడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది.
ఇందిరాపార్కు–వీఎస్‌టీ జంక్షన్
దీన్ని రెండు భాగాలుగా చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించి టెండర్లు ఆహ్వానించారు. ఇందిరాపార్కు– వీఎస్‌టీ జంక్షన్ 2.6 కిలోమీటర్లు, రామ్‌నగర్–బాగ్‌లింగంపల్లి 0.84 కిలోమీటర్ల మార్గంలో నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఈ రెండింటి అంచనా వ్యయం రూ.426 కోట్లు.
♦ రామంతాపూర్, హిందీ మహావిద్యాలయ, విద్యానగర్, రామ్‌నగర్, వీఎస్టీల నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా సచివాలయం, లక్డీకాపూల్ తదితర ప్రాంతాలకు ప్రయాణించే వారికి... రామ్‌నగర్ నుంచి బాగ్‌లింగంపల్లి మీదుగా హిమాయత్‌నగర్, లిబర్టీ, సచివాలయం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి వీటి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని టెండర్లు పిలిచారు.
♦ వీటికి టెండర్లు ఆహ్వానించినప్పటికీ మొత్తం ప్రక్రియ పూర్తి కాకపోవడం, భూసేకరణలో భాగంగా పలు ఆస్తులు సేకరించాల్సి ఉండడం తదితర కారణాలతో ఈ స్టీల్ బ్రిడ్జీలకు బ్రేక్‌లు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment