నిధులున్నా.. మరమ్మతు జాడేది?
జగిత్యాల రూరల్ : ‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ప్రభుత్వం పాఠశాలల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసినా అధికారుల మధ్య సమన్వయం లేక పనులు ముందుకు కదలడం లేదు. దీంతో ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లోనే నిధులు మూలుగుతున్నాయి. వంట గదుల నిర్మాణానికి మంజూరైన నిధులను డిజైన్ లేదనే సాకుతో మురగబెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 218 ప్రభుత్వ పాఠశాలల మరమ్మతు కోసం ఆర్వీఎంఎస్ ద్వారా ఒక్కో పాఠశాలకు రూ.2 లక్షల చొప్పున రూ.4.36 కోట్లను ప్రధానోపాధ్యాయుల ఖాతాలో తొమ్మిది నెలల క్రితం జమ చేసింది. పనులు ప్రారంభించాలని డీఈవో పంచాయతీ రాజ్ శాఖ ఎస్‌ఈకి ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ని ధులు ఆ శాఖ ఆధీనంలో లేవంటూ పనులు చేపట్టేం దుకు ముందుకు రాలేదు. మండలస్థాయిలో ఒకరికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ అప్పగిస్తామని చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం పడితే ఊరుస్తున్నాయి. ఎప్పుడు కూలుతాయో ఎవరికీ తెలియడం లేదు. నిధులు మంజూరై.. ఖాతాల్లో మూలుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం సంభవించి.. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే పాఠశాలలకు మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.
వంట గదులదీ అదే పరిస్థితి
జిల్లా వ్యాప్తంగా వంట గదులు నిర్మించాలని ప్రభుత్వం 874 పాఠశాలలకు రూ.13.11 కోట్లు విడుదల చేసింది. వాటిని సీసీవో ఖాతాలో జమచేసింది. అయితే వంట గదుల డిజైన్ లేకపోవడంతో నిర్మాణం ఎలా చేయాలో ఆదేశాలు రాకపోవడంతో ఆ డబ్బులు నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో ఆరుబయటనే వంటలు చేస్తూ వర్షం పడిన రోజు నిర్వాహకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.