రాహుల్‌గాంధీతో గద్దర్, ఆయన కుమారుడు సూర్యకిరణ్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ తనయుడు సూర్యకిరణ్ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిన సూర్యకిరణ్ బెల్లంపల్లి స్థానం నుంచి పోటీ చేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌నియోజకవర్గం పరిధిలో నివసించే సూర్యకిరణ్ అక్కడి నుంచి పోటీ చేయడం కన్నా, కమ్యూనిస్టుల భావజాలం అధికంగా ఉండే బెల్లంపల్లి నుంచి ఎన్నికల బరిలో దిగడమే ఉత్తమమని భావిస్తున్నారు.
గద్దర్ తనయుడిగా తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తన తండ్రి గద్దర్ ఇటీవల కాంగ్రెస్ రథసారథులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలిసినప్పుడు సూర్యకిరణ్ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరకపోయినా, ఆ పార్టీ సానుభూతిపరుడిగా, మహాకూటమి ప్రచారకర్తగా గద్దర్ ఈ ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకిరణ్ బెల్లంపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
బెల్లంపల్లిలో పోటీకి సీపీఐ అనాసక్తత
మహాకూటమి పొత్తులో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని సీపీఐకి ఇస్తారని భావించారు. సీపీఐ పోటీ చేసే సీట్ల జాబితాలో బెల్లంపల్లి కూడా ఉంది. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, 2009లో బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటైన తరువాత ఇక్కడి నుంచి గెలుపొందిన గుండా మల్లేష్ ఈసారి పోటీకి సుముఖంగా లేరు. సీపీఐ నుంచి పోటీకి ఆశావహులు ఉన్నా, తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సీపీఐ బెల్లంపల్లికి బదులుగా మంచిర్యాల కోరుతోంది.
మంచిర్యాల జిల్లా పార్టీ కార్యదర్శి కలవెణ శంకర్ మంచిర్యాల నుంచి పోటీకి పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలతో సీపీఐ బెల్లంపల్లిని వదులుకున్నట్టే. కాంగ్రెస్ నుంచి పోటీకి బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతోంది. ఇక్కడ నుంచి గతంలో పోటీ చేసిన చిలుముల శంకర్ మరోసారి ఆసక్తి చూపుతున్నప్పటికీ, చిన్నయ్యను ఢీకొట్టాలంటే గద్దర్ తనయుడు సూర్యనే సరైన వ్యక్తిగా భావిస్తోంది. గత మేలో మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో కూడా సూర్యకిరణ్ పాల్గొని, తాను బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తాననే సంకేతాలు ఇచ్చారు.
ఒకవేళ గద్దర్ పోటీ చేస్తే...
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన గద్దర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లో చేరలేదని, మర్యాద పూర్వకంగానే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలిసినట్లు చెప్పారు. మహాకూటమి తరఫున అవకాశమిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌పై బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ తరఫున గద్దర్ పోటీ చేస్తారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఇప్పుడు ఆయన మహాకూటమికి మద్దతు తెలపడంతో బీఎల్‌ఎఫ్ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు.
ఒకవేళ కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంటేరు ప్రతాపరెడ్డిని బరిలోకి దింపితే గద్దర్ వేరే నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కాబట్టి ఒకవేళ పోటీ చేసే పరిస్థితి వస్తే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి మహాకూటమి మద్దతు కూడగట్టుకుంటారు. తద్వారా సూర్యకిరణ్ కాంగ్రెస్ నుంచి పోటీకి అడ్డంకులు తొలుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయకూడదని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిబంధన ఇండిపెండెంట్‌గా పోటీ చేసే గద్దర్, కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఆయన తనయుడికి వర్తించకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment