‘లంక’లో జూదం! | Gambling in Lanka! | Sakshi
Sakshi News home page

‘లంక’లో జూదం!

Published Fri, Jul 17 2015 1:43 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

‘లంక’లో జూదం! - Sakshi

‘లంక’లో జూదం!

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఈ గుట్ట ప్రాంతంలో ఓ పేకాట బ్యాచ్ మద్యం సేవిస్తూ ఆట ఆడుతోంది.. మద్యలో మద్యం అయిపోయింది. మోటార్ సైకిల్ ఇచ్చి ఓ వ్యక్తిని మందు తెమ్మని ఊర్లోకి పంపించారు. అతను వెళ్లింది మొదలు...‘తొందరగా రారా... అబ్బా..ఇంకెంత సేపురా’ అంటూ ఫోన్ల మీద ఫోన్లు కొట్టారు. మందు సీసాలతో వేగంగా తిరిగొస్తున్న వ్యక్తి ఓ మూల మలుపు వద్ద లారీకి ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచాడు. పోలీసుస్టేషన్‌కు పోవద్దనుకున్నారు. పంచాయితీ గ్రామ పెద్ద మనుషుల వద్దకొచ్చింది. పేకాట ఆడిన వాళ్లలో ఓ గ్రామ మాజీ సర్పంచ్ కొడుకు, ముగ్గురు చిన్నకారు రైతుల కుమారులు ఉన్నారు.

వాళ్లకు రూ. 2 లక్షలు జరిమానా వేశారు. రెండు నెలల్లో బాధితుని తల్లిదండ్రులకు ఇవ్వాలని తీర్పు చెప్పారు. కాలం గిర్రున తిరిగింది. పెట్టిన 2 నెలల గడువు రానే వచ్చింది. భార్య తాళిబొట్టు తాకట్టు పెట్టి జరిమానా కట్టేందుకు ఓ చిన్నకారు రైతు కొడుకు సిద్ధమయ్యాడు. దాన్ని ఇచ్చేందుకు భార్య నిరాకరించింది. మరో వైపు డబ్బు ఇవ్వాలంటూ పెద్దమనుషుల నుంచి ఒత్తిడి పెరిగింది. తట్టుకొలేక ఆ యువకుడు అదే లంకలగుట్టలోని ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు.

నెల తరువాత పంచాయితీ మళ్లీ పెద్ద మనుషుల మధ్యకు వచ్చింది. ‘సచ్చినోడు ఎలాగు పోయిండు.. ఉన్నవాళ్లు దండగ కట్టాల్సిందే అని, ఆర్థికంగా కొంత బలంగా ఉన్న మాజీ సర్పంచ్ కుమారుడు కొంత ఎక్కువ మొత్తం భరించాలి’ అంటూ పెద్ద మనుషులు మరో తీర్పు చెప్పారు. రెండుసార్లు పెద్దమనుషుల ముందు నిలబడటం, ఊరు జనం సూటిపోటి మాటలు తిట్టడంతో అవమానంగా భావించిన సదరు వ్యక్తి ఈ మధ్యకాలంలోనే పురుగు ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ఇంకా పంచాయితీ తెగలేదు. ఇదేకాదు.. ఇంకా వెలుగుచూడని సంఘటనలు ఎన్నో.. విచిత్రమేమిటంటే ఈ గుట్ట ప్రాంతం ఎవరి పరిధిలోకి వస్తుందో తెలియక రెండు జిల్లాల పోలీసుల్లో గందరగోళం నెలకొంది.

 సరిహద్దుల్లో పేకాట అడ్డాలు..
 ముఖ్యమంత్రి కేసీఆర్.. జూదం మీద ఉక్కుపాదం మోపిన తరువాత జూదగాళ్లు హైదరాబాద్ సమీపంలోని జిల్లాల సరిహద్దు ప్రాంతాలను పేకాట అడ్డాలుగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వేల్  ప్రాంతంలో పేకాట స్థావరాలు పుట్టగొడుగుల్లా వెలిసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, మెదక్ సరిహద్దులోని జగదేవ్‌పూర్ మండలం, రంగారెడ్డి సరిహద్దులోని ములుగు, వర్గల్ మండలాల్లో పేకాట క్లబ్‌లు భారీగా వెలిసినట్టు సాక్షాత్తు పోలీసు ఇంటెలిజెన్సి వర్గాలే ధ్రువీకరించినట్టు తెలిసింది. జూదం రోజుకు రూ. కోట్లలో సాగుతోందని, ప్రైవేట్ ఫాంహౌస్‌లో ప్రతి శని, ఆదివారాల్లో  హైదరాబాద్ నుంచి ‘బిగ్‌షాట్స్’ ఖరీదైన కార్లలో వచ్చి పేకాట ఆడుతున్నట్లు సమాచారం సేకరించి నేరుగా సీఎంకే చేరవేసినట్లు తెలిసింది. గజ్వేల్, తూప్రాన్, కొండపాక మండలాల్లో ఈ వ్యవహారం సాగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

 రిక్రియేషన్ క్లబ్ యాజమాన్యమే....
 రమ్మీ, బ్లాక్‌జాక్, త్రీకార్డ్స్, రొటేట్, అందర్ బహర్ లాంటి ఆటలతో పాటు మరో ఐదు రకాల ఆటలను ఆడుతున్నారు. రూ. 500 నుంచి రూ. 5 లక్షల వరకు పందెం కాస్తున్నారు. గతంలో రిక్రియేషన్ క్లబ్‌లు నడిపిన యాజమాన్యమే తాజాగా ఫాం హౌస్‌లను అద్దెకు తీసుకొని అనధికారిక క్లబ్బులుగా మార్చి వేసినట్టు వినికిడి. ఒక్కొక్క ఫాం హౌస్‌కు నెలకు రూ. లక్ష నుంచి 3 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. కాగా అక్కడే మినీ బార్ ఏర్పాటు చేసి మద్యం, మాంస అందుబాటులో ఉంచుతున్నారు.

తూప్రాన్ మండలంలో పేకాటరాయుళ్లు పాడుబడిన ఇళ్లు, వెంచర్లలోని ఫాంహౌస్‌లను అడ్డాగా చేసుకుని నిత్యం పేకాట ఆడుతున్నారు. వీరిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో వారి అడ్డాలను తరచూ మారుస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన సంఘటనలు ఉన్నాయి. వారం రోజుల క్రితం పట్టణలంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పేకాట ఆడుతున్న యువకులను ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇలా నిత్యం ఏదో ఒకచోట  పేకాట ఆడుతునే ఉన్నారు. ముఖ్యంగా చెరువు గట్ల వెంట, జీడీపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన స్థావరాల్లో పేకాట జోరుగా సాగుతున్నట్టు సమాచారం. శని, ఆదివారాల్లో రూ. కోట్లలో జూదం సాగుతున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement