సంస్కరణలకు ఆద్యుడు పీవీ | Gandhi Bhavan in PV 94 th birthday celebrations | Sakshi
Sakshi News home page

సంస్కరణలకు ఆద్యుడు పీవీ

Published Mon, Jun 29 2015 3:34 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

సంస్కరణలకు ఆద్యుడు పీవీ - Sakshi

సంస్కరణలకు ఆద్యుడు పీవీ

దేశాన్ని సంక్షోభాల నుంచి గట్టెక్కించారు: దిగ్విజయ్ సింగ్
* మేధోవలసలను నియంత్రించారు
* ఏఐసీసీలో ఏ తీర్మానమైనా ఆయన కలం నుంచే వచ్చేదని ప్రశంస
* గాంధీభవన్‌లో పీవీ 94వ జయంతి వేడుకలు

సాక్షి, హైదరాబాద్: భారత్‌ను ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నుంచి కాపాడి ప్రపంచదేశాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత పీవీ నరసింహారావుదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కొనియాడారు.

దేశంలో సంస్కరణలకు ఆద్యుడు పీవీనే అని కీర్తించారు. ఆది వారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీవీ 94వ జయంతి వేడుకల్లో దిగ్విజయ్ మాట్లాడారు. పార్టీ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీలో ఏ తీర్మానమైనా, సవరణ చేయాల్సి వచ్చినా అది పీవీ కలం నుంచే జాలువారేదన్నారు. విదేశీ మారకం కోసం, చమురు కొనుగోలు కోసం బంగారు నిల్వలు తాకట్టుపెట్టాల్సిన సంక్షోభ సమయంలో, మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని మేటిగా నిలబెట్టాయని కీర్తిం చారు.ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టి, మేధోవలసలను అరికట్టడంలో సఫలీకృతుడయ్యారన్నారు.

ఇప్పుడు దేశం ముందు రెండు అంశాలున్నాయని.. పేదలకు, అట్టడుగువర్గాలకు ప్రభుత్వ సాయమందించడం మొదటిది అయితే; రెండోది గుజరాత్ తరహాలో కేవలం 20 శాతం మంది సంపన్నులను మరింత సంపన్నులుగా చేసే విధానమన్నారు. గుజరాత్ మోడల్‌ను దేశమంతా అమలుచేయడానికి ప్రధాని మోదీ కుట్రపన్నారని మండిపడ్డారు. మోదీ పాలనలో ఈ ఆరునెలల్లో ఎగుమతులు, వృద్ధి తగ్గిపోయి నిరుద్యోగం పెరిగిందని దిగ్విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, ఆర్థిక వ్యవస్థ గాడిన పడలేదని, నల్లధనం వెనక్కి రాలేదని విమర్శించారు.

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు గొడవలు పెట్టుకుంటూ కాలం గడుపుతున్న ఈ సమయంలో బలమైన ప్రతిపక్షం రెండు రాష్ట్రాల్లోనూ కావాలన్నారు. ఏపీలో ప్రజాప్రతినిధులు లేకున్నా, కఠిన సమయంలోనూ ప్రభుత్వంపై పోరాడటంలో ఏపీసీసీ ముందున్నదని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి కీలకోపన్యాసం చేసిన ఈ సమావేశంలో మాజీ మంత్రి కేశవులు, హెచ్‌సీయూ చాన్స్‌లర్ సి.హెచ్.హనుమంతరావు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, కె.ఆర్.సురేశ్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి పీవీ కుటుంబ సభ్యులను ఆహ్వానించినా వారు హాజరుకాలేదు.
 
దేశానికి దార్శనికుడు..
* దివంగత ప్రధానిని స్మరించుకున్న నేతలు   
* జ్ఞానభూమి వద్ద నివాళులు

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు సంస్కరణలకు ఆద్యుడని, దేశ ఆర్థిక ప్రగతి వాటి పుణ్యమేనని పలు పార్టీల నాయకులు కొనియాడారు. పీవీ94వ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదివారం అధికారి కంగా నిర్వహించింది.నెక్లెస్‌రోడ్‌లో ఆయన సమాధి వద్ద పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.

కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, స్పీకర్ మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రులు కడియం, మహమూద్‌అలీ, మంత్రులు నాయిని, తుమ్మల, హరీశ్‌రావు,  కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి, జానారెడ్డి,   పొన్నాల, రఘువీరారెడ్డి తదితరులు పీవీ చిత్రపటానికి నివాళులర్పించారు. కాగా, పీవీ కుమార్తె సురభి వాణీ దేవి వేసిన పెయింటింగ్‌లతో కూడిన ‘కళాసుధ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీవీకి ఇప్పటికైనా భారతరత్న ఇవ్వాలని సిఫార్సు చేయాలని ఆయన తనయుడు పీవీ రాజేశ్వరరావు కాంగ్రెస్‌ను కోరారు.
 
మోదీ కనుసన్నల్లోనే లలిత్ వ్యవహారం
* దిగ్విజయ్ మండిపాటు

ప్రధాని నరేంద్రమోదీ కనుసన్నల్లోనే ఐపీఎల్ మాజీ అధిపతి లలిత్‌మోదీ వ్యవహారం నడుస్తోందని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్ ఆరోపించారు. ఆదివా రం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ,  లలిత్‌మోదీని విదేశాలకు పంపే విషయంలో జరిగిన అక్రమాలన్నీ ప్రధానికి పూర్తిగా తెలుసునన్నారు. అందుకే  సుష్మాస్వరాజ్, వసుంధర రాజేలను ప్రధాని కాపాడుతున్నారని దుయ్యబట్టారు. అవినీతిరహిత పాలన, సుపరిపాలన అంటూ గొప్పలు చెప్పుకునే మోదీ పాలన ఏడాదిలోనే నలుగురి అవినీతి బాగోతాలు బయటపడ్డాయన్నారు.
 
ఓటుకు కోట్లుపై సీబీఐ విచారణ జరపాలి
ఓటుకు కోట్లు వ్యవహారంలో ప్రమేయమున్న వారందరిపై కేసులు నమోదు చేయాలని దిగ్విజయ్ డిమాండ్ చేశారు. ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లకు నిజాయితీ ఉంటే   సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement