'ఇది ఓ కుంభకోణం కాబోతోంది' | Digvijay singh comments on trs party | Sakshi
Sakshi News home page

'ఇది ఓ కుంభకోణం కాబోతోంది'

Published Thu, Apr 2 2015 2:34 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'ఇది ఓ కుంభకోణం కాబోతోంది' - Sakshi

'ఇది ఓ కుంభకోణం కాబోతోంది'

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. గురువారం హైదరాబాద్ గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ... వాటర్ గ్రిడ్ స్కీమ్తో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. కేవలం పైప్ కంపెనీలకు మేలు చేసేందుకే ఈ ప్రాజెక్ట్ను చేపడుతున్నారని విమర్శించారు. ఇది ఓ కుంభకోణం కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు.

ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివి విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలని... అవి అమలు కావడం లేదన్నారు. అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏపీలో కూడా అమలు కావడం లేదని చెప్పారు. విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ దాదాపు 50 లక్షల సంతాకాలను ఏపీపీసీసీ సేకరించిందని ఆయన గుర్తు చేశారు.  

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది తామేనని దిగ్విజయ్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారన్నారు. ఆడంబరాలు, ఆర్భాటాలపై సీఎం కేసీఆర్కు ఉన్న ఆసక్తి... దళితులు, పేదలు, గిరిజనలు, మైనార్టీల సంక్షేమంపై లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగ్గా ముందుకు వెళ్లలేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భూసేకరణ చట్టంపై అన్ని పార్టీలతో చర్చిస్తామంటున్న కేంద్రం... ఆర్డినెన్స్ జారీ చేసే ముందు ఎందుకు చర్చించ లేదని దిగ్విజయ్ సింగ్... కేంద్రాన్ని ప్రశ్నించారు. 2013లో భూసేకరణ  చట్టం పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. వాటిని సవరించాల్సిన అవసరం లేదని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఏప్రిల్ 19న ఢిల్లీలో జరిగే ర్యాలీలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొంటారని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement