సమస్యల గళం | General Body meeting of the Zilla Parishad over after three years | Sakshi
Sakshi News home page

సమస్యల గళం

Published Tue, Sep 30 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

General Body meeting of the Zilla Parishad over after three years

 సాక్షి, ఖమ్మం: సుమారుగా మూడున్నరేళ్ల తర్వాత కొలువుదీరిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. జిల్లాలోని పలు సమస్యలపై సభ్యులు జెడ్పీ వేదికగా గళం విప్పారు. మారిన రాజకీయ సమీకరణలతో స్థాయి సంఘాల కమిటీల ఎన్నిక ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ప్రధానంగా జిల్లాను వణికిస్తున్న విషజ్వరాలు, వైద్యల నిర్లక్ష్యంపై సమావేశంలో సభ్యులందరూ ముక్తకంఠంతో ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రశాంతంగా మొదలై..మిన్నంటిన నిరసనలు...
 షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కావల్సి ఉండగా ఏజెన్సీ మండలాల సభ్యులు ఆలస్యంగా వచ్చారు. 10.50 గంటలకు అధ్యక్షత స్థానంలో ఉన్న చైర్‌పర్సన్ గడిపల్లి కవిత సమావేశాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతుండగానే ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు జోక్యం చేసుకున్నారు. ‘సైకిల్ గుర్తుపై గెలిచి, నైతిక విలువలను తుంగలో తొక్కి పార్టీ మారారని.. రాజీనామా చేసి మారిన పార్టీ గుర్తుపై మళ్లీ పోటీ చేయాలి’ అని ప్రస్తావించడంతో సమావేశంలో ఒక్కసారిగా టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

ఇది రాజకీయాలకు వేదిక కాదని చైర్‌పర్సన్ చెప్పుకొచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు నివాళి ఆర్పించాలని సభ్యులను కోరడంతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత పోట్ల మాట్లాడిన తీరుపై ఎమ్మెల్సీ బాలసాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో ఇరువురు మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్  మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడి వెళ్లిన తమ పార్టీ సభ్యులూ రాజీనామా చేయాలన్నారు. ఈ క్రమంలోనే స్థాయి సంఘాలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చైర్‌పర్సన్ ప్రకటించడంతో మళ్లీ సమావేశంలో ప్రశాంతత నెలకొంది.

 స్థాయీ సంఘాల కమిటీపై నిరసన..
 ఏడు స్థాయీ సంఘాలకు సభ్యులను ఎన్నుకుంటున్నట్లు చైర్‌పర్సన్ ప్రకటించగానే.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాన్ని తీసుకోవాలి, అన్ని పార్టీలకూ ప్రాతినిధ్యం కల్పించాలని ప్రజాప్రతినిధులు, పార్టీల సభ్యులు పట్టుబ ట్టారు. ఈ సూచనలతో తన చాంబర్‌లో పార్టీ ఫ్లోర్‌లీడర్లతో చైర్‌పర్సన్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చి కమిటీల ఎన్నికకు అన్ని పార్టీలూ అంగీకరించా యి. చైర్‌పర్సన్ సమావేశానికి వచ్చి ఒక్కో కమిటీలో సభ్యుల పేర్లు చదివి వినిపిస్తుండగా.. వారిని ఆయా పా ర్టీల సభ్యులు ప్రతిపాదించడంతో పాటు బలపరిచారు.

అయితే అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆర్థిక, ప్రణాళిక కమిటీ లో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీలకు చోటు క ల్పించరా..? అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తోపాటు ఎ మ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావులు సమావేశంలో నిరసన తె లిపారు. అప్రాధాన్య కమిటీలో తమ పార్టీల సభ్యులను వేస్తారా..? అంటూ ఆందోళన తెలపడంతో ఉద్రిక్తతకు నెల కొంది. పువ్వాడ, పోట్లలు.. ఎమ్మెల్సీ బాలసానితో వాగ్వాదానికి దిగారు. ‘అంతా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే మేమెందుకు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఎజెండా అంశాలపై చర్చ సాగుతుండగా కూడా ఇదే విషయమై మళ్లీ సమావేశంలో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది.

 వైద్యం రంగంపై గంటకు పైగా చర్చ..
 జిల్లాలో వైద్యరంగం అధ్వానంగా ఉందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పువ్వాడ అజయ్‌కుమార్‌లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఈ రంగాన్ని మెరుగు పరచకుంటే ఏజెన్సీ గిరిజనుల ప్రాణాలు పిట్టల్లా రాలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పీహెచ్‌సీల్లో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్‌లో యూరియా కొరత తీవ్రంగా ఉందని, బ్లాక్‌లో అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ఏజెండాలో పొందుపరిచిన అంశాల్లో గంటకు పైగా వైద్య రంగంపైనే చర్చ జరిగింది.

 కాంగ్రెస్‌కు తోడుగా టీడీపీ..
 గత జెడ్పీ సమావేశంలో శత్రువుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ నేతలు.. ఇప్పుడు జెడ్పీ వేదికగా మిత్రులయ్యారు. కొంతమంది టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఉన్న కొద్దిమంది టీడీపీ జెడ్పీటీసీలు.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసే నిరసనకు సమావేశంలో మద్దతు తెలిపారు. సమావేశంలో స్థాయి సంఘాల ఎన్నిక విషయంలో పువ్వాడ, పోట్ల లు ఇద్దరూ.. ఎమ్మెల్సీ బాలసానితో వాగ్వాదానికి దిగారు. ఆయా పార్టీల సభ్యులు కూడా ఇదే రీతిలో పోడియం ముందుకు వచ్చి టీఆర్‌ఎస్ సభ్యులపై విమర్శలు చేశారు. అయితే టీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో కొంతమంది టీడీపీ సభ్యులు మాత్రం మాకెందుకులే అన్నట్లు ఉన్నారు.

 కరువుపై తీర్మానం..
 మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన సర్వ సభ్య సమావేశం రాత్రి 9 గంటలకు వరకు కొనసాగింది. వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, తాగునీరు అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో కరువు నెలకొందని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, రైతుల రుణమాఫీ ఒకేసారి లక్ష వరకు వర్తింపజేయాలని సభ్యులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ విషయమై చైర్‌పర్సన్ స్పందిస్తూ ఈ మూడు అంశాలను తీర్మానం చేస్తున్నట్లు సమావేశంలో ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ తీర్మానాల నివేదికను పంపనున్నట్లు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement