అఖిలభారత యాదవ సేవా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అజయ్‌కుమార్ యాదవ్
శంషాబాద్ రూరల్: రిజర్వేషన్ల సాధన కోసం యాదవులు ఉద్యమించాలని అఖిల భారత యాదవ సేవా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని నర్కూడలో యాదవ సేవా సంఘం మండల సమావేశాన్ని మండల అధ్యక్షుడు ఎన్.అంజయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కోటి జనాభా కలిగిన యాదవ్‌లు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. యాదవులు అభివృద్ధి చెందాలంటే పదిహేను శాతం రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదవులు పాడి పోషణ, జీవాల పెంపకంతో ఉపాధి పొందుతున్నారని, గొర్రెల కాపరులు వలస వెళ్లకుండా ప్రతి గ్రామంలో వంద ఎకరాల భూమిని కేటాయించి జీవాల గ్రాసానికి కొరత లేకుండా చూడాలన్నారు.
ఆదర్శ పాఠశాలల్లో యాదవుల కుటుంబాల విద్యార్థులకు పదిహేను శాతం రిజర్వేషన్లు, షీప్ ఫెడరేషన్‌కు పూర్తి స్థాయిలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లను కేటాయించి వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలన్నారు. యాభై సంవత్సరాలు పైబడిన గొర్రెల కాపరులకు వెయ్యి రూపాయల పింఛన్ ఇవ్వాలని అన్నారు.
హయత్‌నగర్‌లో ఈ నెల 18న జరగనున్న జిల్లా యాదవ చైతన్య సదస్సు పోస్టరును ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి.అనిల్ యాదవ్, జిల్లా నాయకులు జి. లక్ష్మయ్య యాదవ్, మండల నాయకులు క్రిష్ణయ్య యాదవ్, ప్రతాప్ యాదవ్, మహేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, చెన్నయ్య యాదవ్, నవీన్ యాదవ్ పాల్గొన్నారు.
రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి
Published Thu, Jan 15 2015 4:41 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement