సాక్షి, హైదరాబాద్ : రాబోయే కాలంలో బీసీలకు రాజకీయ అవకాశాలు ఎక్కువగా వచ్చేలా చూస్తామని, అందులో యాదవులకు సముచిత న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. గొర్రెల కాపరులను ఆర్థికంగా పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన గొర్రెల పంçపిణీ కార్యక్రమం విజయవంతమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 7.60 లక్షల యాదవ కుటుంబాలన్నింటికీ గొర్రెల పంపిణీ చేస్తామని పునరుద్ఘాటించారు. గొల్ల– కురుమలకు హైదరాబాద్‌లో పదెకరాల స్థలంలో రూ. 10 కోట్ల వ్యయం తో యాదవ భవన్ నిర్మిస్తామన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రిని అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి యాదవ, కురమ సంఘాల ప్రతినిధులు మంగళవారం ప్రగతి భవన్ వచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారినుద్దే శించి మాట్లాడారు. ‘‘గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కొంత మంది అవమానించారు. ఇప్పు డు ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పటికి లక్షన్నర కుటుంబాలకు 30 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. పంపిణీ చేసిన గొర్రెలకు 12 లక్షల పిల్లలు పుట్టాయి. తెలంగాణలో ఇప్పుడు 42 లక్షల అదనపు గొర్రెలున్నాయి. దీంతో యాద వ సోదరులు పెద్ద ఎత్తున బాగుపడటం ఎంతో సంతోషంగా ఉంది. తొలుత రాష్ట్రవ్యాప్తంగా 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తే సరిపోతుందనుకున్నాం. కానీ 7.60 లక్షల కుటుంబాలకు కోటిన్నరకుపైగా గొర్రెల పంపిణీ చేయాల్సి వస్తుంది. అందరికీ గొర్రెలు పంచుతాం. దేశంలో ధనవంతులైన యాదవులు ఎక్కుడున్నారంటే, ఎక్కువ మాంసం ఎగు మతి చేసే రాష్ట్రం ఏదంటే తెలంగాణ అనే సమాధానం రా వాలి. ఇదే నా లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో యాదవులు గొ ర్రెలు పెంచితే, పట్టణ ప్రాంతాల్లోని యాదవుల కోసం మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి. ఇందుకోసం ప్రభుత్వం సాయం చేస్తుంది. వచ్చే ఏడాది నుంచే పట్టణ ప్రాంతాల్లో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం’’అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఏడాదిలోగా యాదవ భవన్...
యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రేరణ ఇవ్వడానికి, అందుకు వేదిక కల్పించడానికి హైదరాబాద్‌లో యాదవ భవన్ నిర్మిస్తాం. ఏడాదిలోగానే దీని నిర్మాణం పూర్తి చేస్తాం. అందులో పేద యాదవుల పెళ్లిళ్లు జరగాలి. ఏ అండ లేని వారికి అండగా నిలవాలి. కొంత నిధి కూడా సమకూర్చుకుందాం. వాటి ద్వారా యాదవ కుటుంబాల్లో చదువుకునే వారికి, వైద్యం అవసరమైన వారికి అండగా ఉందాం’’అని సీఎం పిలుపునిచ్చారు. సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బాల్క సుమన్, మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గ మల్లేశం, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మెదక్ జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత తెలిపేందుకు వచ్చే ఏడాది మార్చి 25న హైదరాబాద్‌లో భారీ ఎత్తున గొర్రెల పెంపకందారుల సమావేశం నిర్వహించనున్నట్లు తలసాని ప్రకటించారు.
ఎగ్గ మల్లేశానికి ఎమ్మెల్సీ సీటు...
‘‘తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సి ఉంది. దీనికోసం చర్యలు తీసుకుంటున్నాం. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచే క్రమంలో యాదవులకు సముచిత స్థానం దక్కి తీరుతుంది. వచ్చే ఏడాది రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని యాదవులకే కేటాయిస్తాం. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కురమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గ మల్లేశానికి అవకాశం కల్పిస్తాం. డీలిమిటేషన్ వల్ల పెరిగే అసెంబ్లీ స్థానాల్లో కూడా యాదవులకు టికెట్లు ఇస్తాం’’అని కేసీఆర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment