yadavas
-
ఓ లింగా... ఆ“.. భక్తా!
‘పిలిస్తే పలుకుతడు.. కోరిక తీర్చమని మొక్కుకుంటే రెండేళ్లలోపే ఆ కోరిక తీరుతది.. ప్రతిఫలంగా మొక్కులు చెల్లించు కొనుడు.. లింగమ్మ, లింగయ్య, లింగేశ్వర్ అని పేర్లు పెట్టుకొనుడు..’ ఇదీ పెద్దగట్టు లింగమంతుల స్వామి మహత్యమని యాదవుల నమ్మకం. యాదవుల ఆరాధ్యదైవం లింగమంతుల స్వామి. అందుకే రెండురాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆయన పేర్లు వేలాదిమందికి ఉంటాయి. రెండేళ్లకోమారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో పెద్దగట్టు (గొల్లగట్టు)పై వెలసిన లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతి పెద్దది లింగమంతుల స్వామి జాతర. యాదవులు, ఇతర కులస్తులతో సూర్యాపేట నుంచి కోదాడ మీదుగా వెళ్లే జాతీయ రహదారి, ఖమ్మం, నల్లగొండ, చౌటుప్పల్ వరకు రహదారుల్లో వేలాది వాహనాలతో జాతర నిండిపోతుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే లింగమంతల స్వామి జాతరకు పెద్దగట్టు ముస్తాబయింది. ఇలా వెలిశాడని.. క్రీ.పూ 500 ఎళ్ల క్రితం చోళ చాళుక్యులు (యాదవరాజులు), కాకతీయులు ఉండ్రుగొండ రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఆ కాలంలో ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనరసింహస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయ దేవాలయాలు కట్టించారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఏటా మాఘమాసంలో లింగమంతులు, చౌడమ్మతల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేవారట. జాతర సమయంలో ఓ నిండు గర్భిణి లింగమంతులస్వామి మొక్కు చెల్లించుకునేందుకు బోనం కుండ, పూజసామాగ్రితో గంపను ఎత్తుకుని పెద్దగట్టు ఎక్కుతుండగా కాలు జారి కిందపడి మృతి చెందిందని.. దీనికి చలించిన లింగమంతులస్వామి భక్తుల సౌకర్యార్థం పార్ల శేరయ్య(గొల్లగట్టు) పై వెలిశాడని అదే గొల్లగట్టు జాతరగా జరుపుతున్నామని యాదవులు పేర్కొంటున్నారు. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కేసారం గ్రామానికి చెందిన యాదవులు, రెడ్లు గొర్రెలు, ఆవులను మేపుకుంటూ పెద్దగట్టు వద్దకు వెళ్తారు. కరువు కాటకాలతో ఉన్న ఈ ప్రాంతంలో నీరు లేక వారు ఇబ్బందులు పడతారు. గొర్రెల కాపరికి చద్దిమూట తెచ్చిన భార్యను ఆవేశించి లింగమంతుల స్వామి జీవాలు, గొర్రెల దాహం తీర్చాలంటే తాను చూపించిన చోట బావి తవ్వాలని చెప్పడంతో ఆమె మాట ప్రకారం బావి తవ్వారట. అందులో లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, శివలింగాలు బయట పడ్డాయని.. వీటినే గొల్లగట్టుపై ప్రతిష్టించి పూజలు చేస్తూ.. కాలక్రమేణా ఇది జాతరగా మారిందని యాదవుల నమ్మకం. ఇలా పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బస్సులు, లారీల్లో భక్తులు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా తరలి వస్తారు. తొలి మూడు రోజులు జాతీయ రహదారి భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తి పారవశ్యంతో ఓ లింగనాదం.. ఓ లింగ.. ఓ లింగ నినాదాలు.. భేరీ చప్పుళ్లు.. కటార్లతో సాము.. తాళాలు, గజ్జల లాగులు, చండ్రకోళలు.. ఎటుచూసినా భక్తజన సంద్రంతో పెద్దగట్టు కనిపిస్తుంటుంది. ఈనెల 10న దేవుడికి దిష్టిపూజతో జాతర పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన జాతర ఈనెల 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతర వస్తుందంటేనే యాదవుల ఇళ్లల్లో పండుగ వాతావరణమే. జాతరకు వెళ్లే యాదవులు ఇంటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. భేరీకి మరమ్మతులు చేయిస్తారు. కటార్లు, తాళాలు, భేరీలను ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. మొక్కులు చెల్లించుకునే భక్తులు జాతరకు ఇళ్లనుంచే ఓ లింగా .. ఓ లింగా అనుకుంటూ బయలుదేరుతారు. పెద్దగట్టు వద్దకు చేరుకున్న తర్వాత లింగమంతుల స్వామికి నైవేద్యబోనం వండుకొని దేవాలయం చుట్టూ మూడుసార్లు తిరుగుతారు. ఇలా ఓ లింగ నినాదాలతో పెద్దగట్టు మార్మోగుతుంది. యాదవులే కాకుండా ఇతర కులస్తులు కూడా జాతరకు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఐదు రోజుల పాటు జరగనున్న జాతరలో భాగంగా మొదటి రోజు గంపల ప్రదక్షిణ, రెండోరోజు చౌడమ్మకు బోనాలసమర్పణ, మూడవ రోజు చంద్రపట్నం, నాలుగవ రోజు నెలవారం, ఐదవరోజు ముగింపు కార్యక్రమం చేపడతారు. – బొల్లం శ్రీనివాస్, సాక్షి, సూర్యాపేట ఫొటోలు: అనమాల యాకయ్య, సాక్షి -
అసామాన్య సామాన్యుడు
‘హేమాడ్ పంత్!’ అని తనని సాయి సంబోధించడమేమిటి? ఇంతకీ ఆయనెవరు? అని ఒక్కక్షణం అన్నా సాహెబు ఆలోచించాడు. ‘యదు’ అనే పేరుగల వంశం ఒకటుంది. ఆ వంశంలో పుట్టిన అందర్నీ ‘యాదవులు’ అని పిలుస్తారు. అలాంటి యాదవ వంశాల్లో ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారైతే వాళ్లని ఆ ప్రాంతానికి చెందిన యాదవులు సుమా! అని గుర్తించేందుకు వీలుగా ఆ ప్రాంతపు పేరుని ఈ యాదవ వంశానికి ముందు తగిలించేవారు. అలా ఏర్పడినదే దేవగిరి ప్రాంతానికి చెందిన యాదవుల వంశం – దేవగిరి యాదవ వంశం. ఆ రాజులు తమకు చక్కని ఆలోచననీయగల కొందరు మేధావుల్ని మంత్రులుగా నియమించుకున్నారు. అలా నియమించుకున్న మంత్రులందరికీ పైవాణ్ని ముఖ్యమంత్రి అని వ్యవహరిస్తుండేవారు. అలా దేవగిరి యాదవ వంశీయులకి రాజుగా ఉండేవానికి ముఖ్యమంత్రి హోదాలో నియమింపబడ్డ మహనీయుడు హేమాడ్ పంత్. ఈ మాటకి సరైన మాట – హేమాద్రి పంతు. పంతు అనే పదం బ్రాహ్మణుల పేర్లకి చివర ఉండటంగాని, లేదా ఆయన పేరు ఏదైనప్పటికీ ‘పూజ్యుడైన బ్రాహ్మణుడా!’ అనే అర్థంతో సంబోధిస్తూ పంత్జీ అనేవారు. ఈయన బ్రాహ్మణ జాతికి చెందినవాడు కాబట్టి ఏదో కులగౌరవం కోసం పంతు అని పిలవబడ్డ పిలుపు కాదిది. నిజంగా బ్రాహ్మణ ధర్మాన్ని చక్కగా ఆచరించిన వాడూ, గొప్ప పండితుడు హేమాద్రి పంత్. పైగా ఆయన తన పాండిత్యానికి గుర్తుగానూ, ఎవరికీ ఏవిధంగానూ తన పాండిత్యం అర్థం కాకపోయినా ఫరవాలేదు గాని, ఉత్తమ గ్రంథాన్ని లోకానికందించాలనే ఉత్తమ స్ఫూర్తితోనూ ‘చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి’ అనే గ్రంథాన్ని రచించి జాతికి సమర్పించాడు కూడా. ‘ఇంతటి గొప్పవాడూ, ఇంకా ఇప్పటికీ తెలియని ఎన్నెన్నో గొప్పదనాలు కలవాడూ అయిన హేమాద్రి పంతుతో తనని సమానం చేస్తూ సాయి తనని హేమాద్రి పంతు అని పిలవడమేమిటి?’.. అని ఆలోచించిన అన్నా సాహెబు ఓ దృఢ నిర్ణయానికొచ్చాడు. సహజంగా ఎవరైనా ఓ చేయరాని పని చేసినా, మాట్లాడరాని తీరులో మాట్లాడినా అలాంటివారిని ఎగతాళి చేస్తూ ‘అతనికేం! అతను అపర కాళిదాసు’ అంటూంటారు. అయితే తనని అలా ఎగతాళి చేస్తూ ‘హేమాద్రి పంతు’ అనలేదు సాయి. దానిక్కారణం సాయి స్వభావం. ఎదుటివారిని తక్కువ చేస్తూ, వేళాకోళం చేస్తూ మాట్లాడే తీరు కాదు. పోనీ! తనని ప్రశంసిస్తూ ‘హేమాద్రి పంతు’ అని సంబోధించాడనుకుందామా? అంటే అంత గొప్పదనాన్ని సాయిని దర్శించినంత ఇంత తక్కువ కాలంలో తానేమీ చూపించలేదు. పైగా తోటి మిత్రులెవరూ కూడా తన పనుల్లో ఏదో గొప్పదనమున్నట్లుగా ఏనాడూ తనతో అన్నదీ లేదు. తనని ‘హేమాద్రి పంతు!’ అని సంబోధించిన కారణంగా తాను ఆ హేమాద్రి పంతు ఎవరా? అని భావించి, ఆయన గురించిన మొత్తం సమాచారాన్ని తీసుకుంటాడు గదా అన్నా సాహెబు అనే ఆలోచనతో సాయి తనని అలా సంబోధించి ఉండవచ్చు. నిజాన్ని నిజంగా ఆలోచించినా హేమాద్రి పంతుని ఇంతకుముందు తెలుసుకోవాలనుకున్నదీ లేదు – తెలిసి ఉన్నదీ లేదు. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం, గొప్పదనం, గాంభీర్యం – అన్నింటికీ మించి – సాయి అంతటివాని చేత ప్రశంసించబడిన హేమాద్రి పంతు కావడం వల్ల.. అన్నా సాహెబుకి గట్టి ఆలోచన వచ్చింది – తాను హేమాద్రి పంత్‌ను గనుక మార్గదర్శకునిగా తీసుకుంటే సాయికి మరింత దగ్గర కాగలడని. అన్నా సాహెబు తన ప్రవర్తన ఎలా ఉండి ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. షిరిడీకి బయలుదేరేముందు మిత్రుని పుత్రుడు మరణిస్తే – ప్రాణాన్ని రక్షించలేని గురువు ఓ గురువా? – అనుకుని ప్రయాణాన్ని మానేసుకున్నాడు. ఆ సందర్భంలో మళ్లీ మరో మిత్రుడు తనకి చివాట్లు పెట్టి సాయి గొప్పదనాన్ని చెప్పి మళ్లీ బయలుదేరదీశాడు. ఏదో జరిగిన సంఘటనని గురువుకి ముడిపెట్టి దాని ఆధారంగా గురువుని తక్కువ చేయడం లేదా విశ్వసించకపోవడం, తన ఆలోచనే గొప్పదనుకోవడం సరికాదన్నమాట. ఈ విషయాన్ని గ్రహించుకున్నాడు. అంటే ఏమన్నమాట? షిరిడీకి వెళ్లడం మానుకున్న తనని మళ్లీ మిత్రుని రూపంలో చివాట్లు పెట్టి బయలు దేరదీసింది సాయేనన్న మాట! దీన్ని అర్థం చేసుకున్నాడు. తాను బయలుదేరి ఎక్కడ రైలు ఆగదో ఆ బండిలోకి ఎక్కి కూచున్నవేళ అజ్ఞాతవ్యక్తిలా వచ్చి వివరాలడిగి షిరిడీకి వెళ్లే మార్గాన్ని చెప్పి సహకరించినవాడూ ఆ సాయేనన్నమాట. దీన్ని తెలుసుకున్నాడు. తనని ప్రతిక్షణంలోనూ ప్రతి కదలికలోనూ ప్రతి మాటలోనూ సాయి పరిశీలిస్తూ ఉన్నాడని. పెరుగుని నీటితో కలిపి చిలికితే ఎలా వెన్న పైకి వస్తుందో అలా ఈ గత అనుభవాలను పరిశీలించుకుంటే అర్థమైంది తనకి – తనని సాయి దగ్గరికి తీసుకుంటున్నాడని. అందుకే ‘హేమాద్రి పంతులా ఉండవలసింది సుమా!’ అని సూచిస్తూ, అలా ఉన్న పక్షంలో మరింత సాయికి చేరువ కాగలనని తెలుపుతూ ఉన్నట్లు అవగతమైంది. అందుకే సాయి చరిత్రను రాసి లోకానికి అందించాలనే భావన, తపన తనకి దృఢమయింది. ఏ విషయాన్నైనా మొక్కుబడిలా రాసేయడానికీ, రాసిన ప్రతి అక్షరంలోనూ తన భక్తి శ్రద్ధలని నింపి రాయడంలోనూ తేడా లేదా? ఒక పాటని ఏదోలా పాడేస్తే అక్షరాలన్నీ నోటినుండి బయటికొచ్చేస్తాయి తప్ప వాటిలో మాధుర్యం ఆర్ద్రతా ఉంటుందా? అలానే సాయి స్వయంగా తనని దగ్గరికి తీసుకుంటున్న ఈ దశలో తాను సాయి చరిత్రను రాస్తే ఆ చరిత్రలోని ప్రతి అక్షరంలోనూ – ఆ చరిత్రను చదివే ప్రతి భక్తునికీ సాయి దర్శనమవుతుందని అర్థం చేసుకోగలిగాడు అన్నా సాహెబు. ఈ స్థితి వ్యక్తికి కలగాలంటే కావలసినవి ‘శ్రద్ధ – సబూరి’ – చలించని నమ్మకం, చెప్పలేనంత ఓపిక. ఇప్పుడీ చరిత్రని చదువుతున్న వారికైనా, సాయి తమకి దగ్గర కావాలంటే షిరిడీకి వెళ్లి సాయిని దగ్గరగా చూడటం వల్ల దగ్గరితనం రాదు. పైననుకున్న శ్రద్ధ సబూరి అనే రెండూ గాని కలిసి ఉన్నట్లైతే దగ్గరతనం దానంటతదే సిద్ధించేస్తుంది. అందుకే ఒకసారి షిరిడీకి వెళ్లినవారికి అదే చివరి ప్రయాణం కాదు. కాబోదు. సాయి అలా కానివ్వడు కూడా! మారాకనే మహాత్ములయ్యారు! ఒక్కసారి ప్రాచీన మహాత్ముల చరిత్రలను పరిశీలిస్తే ఒకప్పుడు మరో తీరు ప్రవర్తనలో ఉన్నవాళ్లే, ఏదో ఒక సంఘటన కారణంగా అకస్మాత్తుగా మారి మహాత్ములయ్యారు. కేవలం దారిదోపిడీలు చేస్తూ మార్గంలో ప్రయాణించేవారిని భయపెట్టి వస్తువుల్నీ, ధనాన్నీ దోచుకుంటూండే ఋక్షుడనే వ్యక్తిని నారదుడు సప్తమహర్షులతో కలిసి చెట్టుకి కట్టేశాడు. నారదుడు అడిగాడు – ‘మా ధనాన్నీ, వస్తువుల్నీ దోచుకుంటూ జీవితాన్ని వెళ్లదీసుకుంటున్నావు కదా! ఇది పాపమని నీకూ తెలుసుకదా! దీనిలో నీ భార్యాపుత్రులకి భాగస్వామ్యం ఉందా? కనుక్కురా!’. ఎక్కడైనా దొంగని ప్రశ్నిస్తే.. పైగా ఇలాంటి ప్రశ్న వేస్తే కనుక్కొస్తాడా? జీవితంలో మార్పు రాబోతోంది. వెళ్లి కనుక్కున్నాడు. భార్య చెప్పింది – భర్త పుణ్యంలో సగం తనది తప్ప పాపంలో ఏమాత్రం భాగస్వామ్యం ఉండదని. అంతే! నారదుని దగ్గర మంత్రోపదేశం పొందడం, తపస్సుకి కూర్చోవడం, ఒంటినిండుగా వల్మీకం (పుట్ట) పెరిగేంత కాలం తపస్సు చేయడం, నారదుడే ‘వాల్మీకి’ అని పిలుచుకోవడం, ఆ బిరుదు పేరుతోనే శాశ్వతుడు అయిపోవడం జరిగింది కదా! ఇక్కడ కూడా అన్నా సాహెబుకి జీవితంలో మార్పు కలిగి ‘హేమాద్రి పంతు’ అనే బిరుదు పేరే ఏర్పడింది. మరాఠీ భాషలో హేమాడ్ పంత్. ఇదే తీరుగా భారతంలో పరాశరుడనే మహర్షి ఉన్నాడు. ఆయన గంగానదిని నావమీద దాటుతూ ఆ నావని నడుపుతూన్న సత్యవతి అనే ఆమెను అడిగాడు – నీ నుండి ఉత్తమ పుత్రుణ్ని పొందదలిచాను తప్పశ్శక్తితో – అని. ఆమె అంగీకరించింది. దానిక్కారణం తపశ్శక్తితో సద్యోగర్భాన్ని (చూస్తుండగా గర్భం రావడం, తొమ్మిది నెలలు మోయడం.. వంటివేమీ లేకుండా సంతానాన్ని కనడం,) ఇస్తున్నప్పుడూ, కన్యత్వం చెడనప్పుడూ సంతానాన్ని – అందునా మహర్షి నుండి పొందడం మంచిదీ, గౌరవకారణమూ కదా! అని. జాలరి అయిన తనకు మహర్షి అనుగ్రహం ఆయనంతట ఆయన ద్వారా కలగడం ఎంత గొప్ప! అని భావించి అంగీకరించింది. గంగకి అవతలి ఒడ్డుకి చేరాక ద్వీపంలో కనడం కారణంగానూ, ప్రపంచాన్ని చీకటి చేసి (కృష్ణం) పుత్రుణ్ని పొందిన కారణంగానూ ఆ సంతానం ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని పిలువబడ్డాడు. ఇది ఆయన అసలు పేరు. ఇందాక శ్రీమద్రామాయణ కథలో బిరుదు పేరైన వాల్మీకికి ముందు పేరు ఋక్షుడు అయినట్లుగా, ఇక్కడ కూడా ఈ కృష్ణ ద్వైపాయనుడు – వేదాలను విభజించిన కారణంగా వేద వ్యాసుడు అనే బిరుదు పేరుని పొందాడు. పరిశీలిస్తే చరిత్రలన్నీ ఒకలానే ఉంటాయి. ఋక్షుడు – వాల్మీకి, కృష్ణ ద్వైపాయనుడు – వ్యాసుడు లాగానే అన్నా సాహెబు – హేమాడ్ పంత్‌గా అయ్యాయి. బాబాని ఎందుకు నమ్మాలి? కోట్ల మంది భక్తులకి బాబా ఆరాధ్య దైవం. బాబా సమాధి కాకముందు చూసినవారెవరూ వారు సమాధి అయ్యేంతవరకూ ఒక్కసారి మాత్రమే చూసి మరల రాకుండా ఉన్నవారు లేరు. అదేదో వింత ఆకర్షణ ఆయనలో ఉండటమే కారణం. జీవితంలో పెద్ద దీర్ఘ సమస్య వచ్చిన సందర్భంలో ఆయన సమాధి దగ్గరకు పోయి నిశ్శబ్దంగా మనసులోనే రోదిస్తూ నిలబడితే, మౌనంగా ఆ సమాధి నుండి సమస్యకి సమాధానం వినిపిస్తుంది. ఆ సమాధానం పట్ల ఎదురుచూపు ప్రారంభమవుతుంది. మొత్తానికి అలాగే ఆ సమస్యా పరిష్కారం జరగడమనేది ఎందరికో అనుభవంతో కనిపించే యథార్థం. తనకున్న ఖ్యాతి, కీర్తి, భక్త జన సంరక్షకుడనే జనుల నమ్మకం కారణంగా బంగారపు మేడలలో నివసించవచ్చు. చిటికె వేస్తే చాలు ఖరీదైన భవనాల పరంపర తన వద్దకి వచ్చి చేరతాయి. అయితే ఆయన ఓ మసీదు గోడకి మాత్రమే ఒరిగి కూర్చుంటారు. ఎవరో ఆయన గురించి బాధపడి ఒక దిండుని అందిస్తే దాన్ని పెట్టుకుని కనిపిస్తారు రేయింబవళ్లూ. ఎందరెందరి జీవితాలకో వడ్డించిన విస్తళ్లని ఏర్పాటు చేయగల శక్తి ఉన్నా, ఆయన మాత్రం నేలమీద ఓ ముతక గోనె సంచిని పరిచి దానిమీద తిరుగలిని ఉంచి, పక్కన చేటలో ఉన్న గోధుమల్ని అప్పుడప్పుడు కొంత కొంత చొప్పున పోస్తూ, తిరుగలిని తిప్పుతూ పిండిని విసురుతూ అప్పుడప్పుడు కనిపిస్తారు. ఒంటరివాడైన బాబాకి ఆ చేటెడు గోధుమలు కావాలా? పైగా పిండిని తానే విసురుకోవాలా? ఎవరిని ఆర్ద్ర దృష్టితో చూసినా ఎన్ని కాలిన రొట్టెలని తెచ్చి సమర్పించుకోరు గనుక! ఓ ఎండ అని లేదు – వాన అనేది లేదు – చలి అనేదాన్ని పట్టించుకునే ధోరణే లేదు. ఏదో ప్రకృతికి అతీతునిగా అక్కడే ఆ వేపచెట్టు మూలంలో కూర్చోవడం ఆశ్చర్యం కాదూ? పరమ రామ భక్తులయినవారు దర్శిస్తే వారికి రామచంద్రమూర్తిగాను, అత్యంత శివభక్తిపరులు దర్శిస్తే సాక్షాత్తూ పరమశివునిలానూ కనిపించి ఉన్న కారణంగానూ, కృష్ణ పరమాత్ముని లాగా అనేక లీలలని చూపి ఉన్న కారణంగా ఆయన్నే కృష్ణుడిగా అందరూ దర్శించారు. అందుకే ఆయన నివసించే మసీదుకి ద్వారక అనే పేరుని పెట్టారు. లోకంలో ద్వారకలు మూడు కాగా, ఒకటి సముద్రంలో మునిగిపోయింది కదా! రెండవది ద్వారకాపురి. ఇక మూడోది సప్త ద్వారక అదే షిరిడీ అని భక్తజనుల దృఢ విశ్వాసం. లక్షలకొలది భక్తులకు ఆహారాన్ని పెట్టగలిగి కూడా భిక్షాటన చేయడం, బంగారపు మందిరాల్లో ఉండగలిగిన శక్తి ఉండి కూడా మసీదు గోడకే ఆనుకుని కూర్చోవడం, భూత భవిష్యత్ వర్తమానాలని తెలియగలిగిన శక్తి ఉండి కూడా ఏమీ తెలియని పిచ్చివానివలె ఉండటం, ఖరీదైన వస్త్రాలను కోకొల్లలుగా రప్పించుకోగలిగి కూడా చిరిగిన వస్త్రాలనే ధరిస్తూ, చిరిగిన చోట సూదీ దారాలతో కుట్టుకున్న వస్త్రాలని వేసుకోవడం, తనకి నిజమైన భక్తుడని అనిపించిన వ్యక్తికి మాత్రమే ఊదీ (విభూతి) ప్రసాదాన్నిస్తూ ఉండటం, అత్యంత భక్తుడైన వానికి మాత్రమే అర్థమయ్యేలా నర్మగర్భంగా మాట్లాడటం... వంటివన్నీ నిజమైన ఫకీరు లక్షణాలు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనివానిలా ఉండటం, అన్నీ తెలిసి కూడా తెలియని వానిలా ఉండటం, అనేక సిద్ధ శక్తులున్నప్పటికీ (నీళ్లతో దీపాలను వెలిగించడం వంటివి) అతి సామాన్యునిలా వ్యవహరించడం, అంతటి గొప్పవాడైనప్పటికీ పిల్లలతో ఆటలాడుకుంటూ ఉండటం.. వంటివన్నీ ఆయన్ను లోకానికి అతీత పురుషునిగా తెలియజేస్తూ ఇహలోక భోగాలను అనుభవించగల శక్తి ఉండీ, వాటిని ఇష్టపడని తీరులో ఉన్న కారణంగా ఆయన్ని తప్పక నమ్మితీరాలని చెప్తాయి ఈ ఉదాహరణలన్నీ. ఇక రోహిల్లా కథకి వెళదాం. (సశేషం..) ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
యాదవుల ‘చలో అమరావతి’ని అడ్డుకున్న పోలీసులు
అమరావతి: యాదవుల చలో అమరావతి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని తాడేపల్లి వద్ద యాదవ ప్రతినిధులను అరెస్టు చేశారు. రూ.2 వేల కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, యాదవ జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించాలని, అమరావతిలో యాదవ సంక్షేమ భవన్‌కు పదెకరాలు కేటాయించాలని యాదవ సమితి అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. -
యాదవులకు రాజకీయ న్యాయం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాబోయే కాలంలో బీసీలకు రాజకీయ అవకాశాలు ఎక్కువగా వచ్చేలా చూస్తామని, అందులో యాదవులకు సముచిత న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. గొర్రెల కాపరులను ఆర్థికంగా పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన గొర్రెల పంçపిణీ కార్యక్రమం విజయవంతమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 7.60 లక్షల యాదవ కుటుంబాలన్నింటికీ గొర్రెల పంపిణీ చేస్తామని పునరుద్ఘాటించారు. గొల్ల– కురుమలకు హైదరాబాద్‌లో పదెకరాల స్థలంలో రూ. 10 కోట్ల వ్యయం తో యాదవ భవన్ నిర్మిస్తామన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రిని అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి యాదవ, కురమ సంఘాల ప్రతినిధులు మంగళవారం ప్రగతి భవన్ వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారినుద్దే శించి మాట్లాడారు. ‘‘గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కొంత మంది అవమానించారు. ఇప్పు డు ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పటికి లక్షన్నర కుటుంబాలకు 30 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. పంపిణీ చేసిన గొర్రెలకు 12 లక్షల పిల్లలు పుట్టాయి. తెలంగాణలో ఇప్పుడు 42 లక్షల అదనపు గొర్రెలున్నాయి. దీంతో యాద వ సోదరులు పెద్ద ఎత్తున బాగుపడటం ఎంతో సంతోషంగా ఉంది. తొలుత రాష్ట్రవ్యాప్తంగా 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తే సరిపోతుందనుకున్నాం. కానీ 7.60 లక్షల కుటుంబాలకు కోటిన్నరకుపైగా గొర్రెల పంపిణీ చేయాల్సి వస్తుంది. అందరికీ గొర్రెలు పంచుతాం. దేశంలో ధనవంతులైన యాదవులు ఎక్కుడున్నారంటే, ఎక్కువ మాంసం ఎగు మతి చేసే రాష్ట్రం ఏదంటే తెలంగాణ అనే సమాధానం రా వాలి. ఇదే నా లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో యాదవులు గొ ర్రెలు పెంచితే, పట్టణ ప్రాంతాల్లోని యాదవుల కోసం మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి. ఇందుకోసం ప్రభుత్వం సాయం చేస్తుంది. వచ్చే ఏడాది నుంచే పట్టణ ప్రాంతాల్లో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం’’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఏడాదిలోగా యాదవ భవన్... యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రేరణ ఇవ్వడానికి, అందుకు వేదిక కల్పించడానికి హైదరాబాద్‌లో యాదవ భవన్ నిర్మిస్తాం. ఏడాదిలోగానే దీని నిర్మాణం పూర్తి చేస్తాం. అందులో పేద యాదవుల పెళ్లిళ్లు జరగాలి. ఏ అండ లేని వారికి అండగా నిలవాలి. కొంత నిధి కూడా సమకూర్చుకుందాం. వాటి ద్వారా యాదవ కుటుంబాల్లో చదువుకునే వారికి, వైద్యం అవసరమైన వారికి అండగా ఉందాం’’అని సీఎం పిలుపునిచ్చారు. సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బాల్క సుమన్, మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గ మల్లేశం, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మెదక్ జడ్పీ చైర్పర్సన్ రాజమణి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత తెలిపేందుకు వచ్చే ఏడాది మార్చి 25న హైదరాబాద్‌లో భారీ ఎత్తున గొర్రెల పెంపకందారుల సమావేశం నిర్వహించనున్నట్లు తలసాని ప్రకటించారు. ఎగ్గ మల్లేశానికి ఎమ్మెల్సీ సీటు... ‘‘తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సి ఉంది. దీనికోసం చర్యలు తీసుకుంటున్నాం. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచే క్రమంలో యాదవులకు సముచిత స్థానం దక్కి తీరుతుంది. వచ్చే ఏడాది రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని యాదవులకే కేటాయిస్తాం. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కురమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గ మల్లేశానికి అవకాశం కల్పిస్తాం. డీలిమిటేషన్ వల్ల పెరిగే అసెంబ్లీ స్థానాల్లో కూడా యాదవులకు టికెట్లు ఇస్తాం’’అని కేసీఆర్ ప్రకటించారు. -
యాదవుల వినూత్న నిరసన
చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జీవాలతో జాతీయ రహదారి దిగ్బంధం తూప్రాన్: గొర్రె కాపరుల పట్ల టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం యాదవులు వినూత్న నిరసన తెలిపారు. టీడీపీ లేకుంటే కేసీఆర్ సిద్దిపేటలో గొర్రెలు కాసేవాడేనని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే. బాబు వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోహరాబాద్ వద్ద 44వ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. గొర్రెలు, మేకలతో తరలివచ్చిన యాదవులు రహదారిపై బైఠాయించారు. చంద్రబాబు గొర్రె కాపరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు గండి మల్లేశ్‌యాదవ్ డిమాండ్ చేశారు. -
యాదవులను కించపరిస్తే ఊరుకోం
- బేషరతుగా క్షమాపణ చెప్పాలి - టీడీపీ అధినేత చంద్రబాబును డిమాండ్ చేసిన యాదవులు - జాతీయ రహదారిపై గొర్రెలతో నిరసన తూప్రాన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొర్రె కాపరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదవులు మండిపడుతున్నారు. తూప్రాన్ మండలం మనోహరాబాద్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం యాదవులు గొర్రెలు, మేకలతో తరలివచ్చి రహదారిపై బైఠాయించారు. స్థానిక సర్పంచ్ సందా సంతోష సోముల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో యాదవ మహాసభ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు గండి మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఓట్లతో అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు తమ పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడడం దారుణమన్నారు. చంద్రబాబుకు మతిభ్రమించడం వల్లే యాదవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో బేషరుతుగా క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలోనే కాదు ఆంధ్రాలోనూ తమ కులస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, జిల్లా యువత అధ్యక్షుడు బురం గణేశ్ యాదవ్, సర్పంచ్‌లు శ్రీశైలం యాదవ్, మల్లేశ్ యాదవ్, నాయకుడు తుమ్మల రాజు తదితరులు పాల్గొన్నారు. వీరి ఆందోళనకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ సంఘీభావం తెలిపారు. -
బాబు యాదవులకు క్షమాపణ చెప్పాలి...
తుఫ్రాన్: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు యాదవుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు గంది మల్లేష్ యాదవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ సీఎం చంద్రబాబు యాదవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం జాతీయరహదారి-44పై జిల్లాలోని తుఫ్రాన్ మండలం మనోహరాబాద్ గ్రామ సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి
అఖిలభారత యాదవ సేవా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అజయ్‌కుమార్ యాదవ్ శంషాబాద్ రూరల్: రిజర్వేషన్ల సాధన కోసం యాదవులు ఉద్యమించాలని అఖిల భారత యాదవ సేవా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని నర్కూడలో యాదవ సేవా సంఘం మండల సమావేశాన్ని మండల అధ్యక్షుడు ఎన్.అంజయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కోటి జనాభా కలిగిన యాదవ్‌లు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. యాదవులు అభివృద్ధి చెందాలంటే పదిహేను శాతం రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదవులు పాడి పోషణ, జీవాల పెంపకంతో ఉపాధి పొందుతున్నారని, గొర్రెల కాపరులు వలస వెళ్లకుండా ప్రతి గ్రామంలో వంద ఎకరాల భూమిని కేటాయించి జీవాల గ్రాసానికి కొరత లేకుండా చూడాలన్నారు. ఆదర్శ పాఠశాలల్లో యాదవుల కుటుంబాల విద్యార్థులకు పదిహేను శాతం రిజర్వేషన్లు, షీప్ ఫెడరేషన్‌కు పూర్తి స్థాయిలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లను కేటాయించి వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలన్నారు. యాభై సంవత్సరాలు పైబడిన గొర్రెల కాపరులకు వెయ్యి రూపాయల పింఛన్ ఇవ్వాలని అన్నారు. హయత్‌నగర్‌లో ఈ నెల 18న జరగనున్న జిల్లా యాదవ చైతన్య సదస్సు పోస్టరును ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి.అనిల్ యాదవ్, జిల్లా నాయకులు జి. లక్ష్మయ్య యాదవ్, మండల నాయకులు క్రిష్ణయ్య యాదవ్, ప్రతాప్ యాదవ్, మహేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, చెన్నయ్య యాదవ్, నవీన్ యాదవ్ పాల్గొన్నారు.