అసామాన్య సామాన్యుడు | Funday Sai Path - Intermediate 4 | Sakshi
Sakshi News home page

అసామాన్య సామాన్యుడు

Published Sun, Jun 3 2018 12:33 AM | Last Updated on Sun, Jun 3 2018 12:33 AM

Funday Sai Path - Intermediate 4 - Sakshi

‘హేమాడ్‌ పంత్‌!’ అని తనని సాయి సంబోధించడమేమిటి? ఇంతకీ ఆయనెవరు? అని ఒక్కక్షణం అన్నా సాహెబు ఆలోచించాడు. ‘యదు’ అనే పేరుగల వంశం ఒకటుంది. ఆ వంశంలో పుట్టిన అందర్నీ ‘యాదవులు’ అని పిలుస్తారు. అలాంటి యాదవ వంశాల్లో ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారైతే వాళ్లని ఆ ప్రాంతానికి చెందిన యాదవులు సుమా! అని గుర్తించేందుకు వీలుగా ఆ ప్రాంతపు పేరుని ఈ యాదవ వంశానికి ముందు తగిలించేవారు. అలా ఏర్పడినదే దేవగిరి ప్రాంతానికి చెందిన యాదవుల వంశం – దేవగిరి యాదవ వంశం.  ఆ రాజులు తమకు చక్కని ఆలోచననీయగల కొందరు మేధావుల్ని మంత్రులుగా నియమించుకున్నారు. అలా నియమించుకున్న మంత్రులందరికీ పైవాణ్ని ముఖ్యమంత్రి అని వ్యవహరిస్తుండేవారు. అలా దేవగిరి యాదవ వంశీయులకి రాజుగా ఉండేవానికి ముఖ్యమంత్రి హోదాలో నియమింపబడ్డ మహనీయుడు హేమాడ్‌ పంత్‌. ఈ మాటకి సరైన మాట – హేమాద్రి పంతు.

పంతు అనే పదం బ్రాహ్మణుల పేర్లకి చివర ఉండటంగాని, లేదా ఆయన పేరు ఏదైనప్పటికీ ‘పూజ్యుడైన బ్రాహ్మణుడా!’ అనే అర్థంతో సంబోధిస్తూ పంత్‌జీ అనేవారు. ఈయన బ్రాహ్మణ జాతికి చెందినవాడు కాబట్టి ఏదో కులగౌరవం కోసం పంతు అని పిలవబడ్డ పిలుపు కాదిది. నిజంగా బ్రాహ్మణ ధర్మాన్ని చక్కగా ఆచరించిన వాడూ, గొప్ప పండితుడు హేమాద్రి పంత్‌. పైగా ఆయన తన పాండిత్యానికి గుర్తుగానూ, ఎవరికీ ఏవిధంగానూ తన పాండిత్యం అర్థం కాకపోయినా ఫరవాలేదు గాని, ఉత్తమ గ్రంథాన్ని లోకానికందించాలనే ఉత్తమ స్ఫూర్తితోనూ ‘చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి’ అనే గ్రంథాన్ని రచించి జాతికి సమర్పించాడు కూడా.  ‘ఇంతటి గొప్పవాడూ, ఇంకా ఇప్పటికీ తెలియని ఎన్నెన్నో గొప్పదనాలు కలవాడూ అయిన హేమాద్రి పంతుతో తనని సమానం చేస్తూ సాయి తనని హేమాద్రి పంతు అని పిలవడమేమిటి?’.. అని ఆలోచించిన అన్నా సాహెబు ఓ దృఢ నిర్ణయానికొచ్చాడు. 

సహజంగా ఎవరైనా ఓ చేయరాని పని చేసినా, మాట్లాడరాని తీరులో మాట్లాడినా అలాంటివారిని ఎగతాళి చేస్తూ ‘అతనికేం! అతను అపర కాళిదాసు’ అంటూంటారు. అయితే తనని అలా ఎగతాళి చేస్తూ ‘హేమాద్రి పంతు’ అనలేదు సాయి. దానిక్కారణం సాయి స్వభావం. ఎదుటివారిని తక్కువ చేస్తూ, వేళాకోళం చేస్తూ మాట్లాడే తీరు కాదు. పోనీ! తనని ప్రశంసిస్తూ ‘హేమాద్రి పంతు’ అని సంబోధించాడనుకుందామా? అంటే అంత గొప్పదనాన్ని సాయిని దర్శించినంత ఇంత తక్కువ కాలంలో తానేమీ చూపించలేదు. పైగా తోటి మిత్రులెవరూ కూడా తన పనుల్లో ఏదో గొప్పదనమున్నట్లుగా ఏనాడూ తనతో అన్నదీ లేదు. తనని ‘హేమాద్రి పంతు!’ అని సంబోధించిన కారణంగా తాను ఆ హేమాద్రి పంతు ఎవరా? అని భావించి, ఆయన గురించిన మొత్తం సమాచారాన్ని తీసుకుంటాడు గదా అన్నా సాహెబు అనే ఆలోచనతో సాయి తనని అలా సంబోధించి ఉండవచ్చు. నిజాన్ని నిజంగా ఆలోచించినా హేమాద్రి పంతుని ఇంతకుముందు తెలుసుకోవాలనుకున్నదీ లేదు – తెలిసి ఉన్నదీ లేదు. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం, గొప్పదనం, గాంభీర్యం – అన్నింటికీ మించి – సాయి అంతటివాని చేత ప్రశంసించబడిన హేమాద్రి పంతు కావడం వల్ల.. అన్నా సాహెబుకి గట్టి ఆలోచన వచ్చింది – తాను హేమాద్రి పంత్‌ను గనుక మార్గదర్శకునిగా తీసుకుంటే సాయికి మరింత దగ్గర కాగలడని. 

అన్నా సాహెబు తన ప్రవర్తన ఎలా ఉండి ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. షిరిడీకి బయలుదేరేముందు మిత్రుని పుత్రుడు మరణిస్తే – ప్రాణాన్ని రక్షించలేని గురువు ఓ గురువా? – అనుకుని ప్రయాణాన్ని మానేసుకున్నాడు. ఆ సందర్భంలో మళ్లీ మరో మిత్రుడు తనకి చివాట్లు పెట్టి సాయి గొప్పదనాన్ని చెప్పి మళ్లీ బయలుదేరదీశాడు. ఏదో జరిగిన సంఘటనని గురువుకి ముడిపెట్టి దాని ఆధారంగా గురువుని తక్కువ చేయడం లేదా విశ్వసించకపోవడం, తన ఆలోచనే గొప్పదనుకోవడం సరికాదన్నమాట. ఈ విషయాన్ని గ్రహించుకున్నాడు. అంటే ఏమన్నమాట? షిరిడీకి వెళ్లడం మానుకున్న తనని మళ్లీ మిత్రుని రూపంలో చివాట్లు పెట్టి బయలు దేరదీసింది సాయేనన్న మాట! దీన్ని అర్థం చేసుకున్నాడు. తాను బయలుదేరి ఎక్కడ రైలు ఆగదో ఆ బండిలోకి ఎక్కి కూచున్నవేళ అజ్ఞాతవ్యక్తిలా వచ్చి వివరాలడిగి షిరిడీకి వెళ్లే మార్గాన్ని చెప్పి సహకరించినవాడూ ఆ సాయేనన్నమాట. దీన్ని తెలుసుకున్నాడు. 

తనని ప్రతిక్షణంలోనూ ప్రతి కదలికలోనూ ప్రతి మాటలోనూ సాయి పరిశీలిస్తూ ఉన్నాడని. పెరుగుని నీటితో కలిపి చిలికితే ఎలా వెన్న పైకి వస్తుందో అలా ఈ గత అనుభవాలను పరిశీలించుకుంటే అర్థమైంది తనకి – తనని సాయి దగ్గరికి తీసుకుంటున్నాడని. అందుకే ‘హేమాద్రి పంతులా ఉండవలసింది సుమా!’ అని సూచిస్తూ, అలా ఉన్న పక్షంలో మరింత సాయికి చేరువ కాగలనని తెలుపుతూ ఉన్నట్లు అవగతమైంది. అందుకే సాయి చరిత్రను రాసి లోకానికి అందించాలనే భావన, తపన తనకి దృఢమయింది. ఏ విషయాన్నైనా మొక్కుబడిలా రాసేయడానికీ, రాసిన ప్రతి అక్షరంలోనూ తన భక్తి శ్రద్ధలని నింపి రాయడంలోనూ తేడా లేదా? ఒక పాటని ఏదోలా పాడేస్తే అక్షరాలన్నీ నోటినుండి బయటికొచ్చేస్తాయి తప్ప వాటిలో మాధుర్యం ఆర్ద్రతా ఉంటుందా? అలానే సాయి స్వయంగా తనని దగ్గరికి తీసుకుంటున్న ఈ దశలో తాను సాయి చరిత్రను రాస్తే ఆ చరిత్రలోని ప్రతి అక్షరంలోనూ – ఆ చరిత్రను చదివే ప్రతి భక్తునికీ సాయి దర్శనమవుతుందని అర్థం చేసుకోగలిగాడు అన్నా సాహెబు. ఈ స్థితి వ్యక్తికి కలగాలంటే కావలసినవి ‘శ్రద్ధ – సబూరి’ – చలించని నమ్మకం, చెప్పలేనంత ఓపిక. ఇప్పుడీ చరిత్రని చదువుతున్న వారికైనా, సాయి తమకి దగ్గర కావాలంటే షిరిడీకి వెళ్లి సాయిని దగ్గరగా చూడటం వల్ల దగ్గరితనం రాదు. పైననుకున్న శ్రద్ధ సబూరి అనే రెండూ గాని కలిసి ఉన్నట్లైతే దగ్గరతనం దానంటతదే సిద్ధించేస్తుంది. అందుకే ఒకసారి షిరిడీకి వెళ్లినవారికి అదే చివరి ప్రయాణం కాదు. కాబోదు. సాయి అలా కానివ్వడు కూడా! 

మారాకనే మహాత్ములయ్యారు! 
ఒక్కసారి ప్రాచీన మహాత్ముల చరిత్రలను పరిశీలిస్తే ఒకప్పుడు మరో తీరు ప్రవర్తనలో ఉన్నవాళ్లే, ఏదో ఒక సంఘటన కారణంగా అకస్మాత్తుగా మారి మహాత్ములయ్యారు. కేవలం దారిదోపిడీలు చేస్తూ మార్గంలో ప్రయాణించేవారిని భయపెట్టి వస్తువుల్నీ, ధనాన్నీ దోచుకుంటూండే ఋక్షుడనే వ్యక్తిని నారదుడు సప్తమహర్షులతో కలిసి చెట్టుకి కట్టేశాడు. నారదుడు అడిగాడు – ‘మా ధనాన్నీ, వస్తువుల్నీ దోచుకుంటూ జీవితాన్ని వెళ్లదీసుకుంటున్నావు కదా! ఇది పాపమని నీకూ తెలుసుకదా! దీనిలో నీ భార్యాపుత్రులకి భాగస్వామ్యం ఉందా? కనుక్కురా!’. ఎక్కడైనా దొంగని ప్రశ్నిస్తే.. పైగా ఇలాంటి ప్రశ్న వేస్తే కనుక్కొస్తాడా? జీవితంలో మార్పు రాబోతోంది. వెళ్లి కనుక్కున్నాడు. భార్య చెప్పింది – భర్త పుణ్యంలో సగం తనది తప్ప పాపంలో ఏమాత్రం భాగస్వామ్యం ఉండదని. అంతే! నారదుని దగ్గర మంత్రోపదేశం పొందడం, తపస్సుకి కూర్చోవడం, ఒంటినిండుగా వల్మీకం (పుట్ట) పెరిగేంత కాలం తపస్సు చేయడం, నారదుడే ‘వాల్మీకి’ అని పిలుచుకోవడం, ఆ బిరుదు పేరుతోనే శాశ్వతుడు అయిపోవడం జరిగింది కదా! ఇక్కడ కూడా అన్నా సాహెబుకి జీవితంలో మార్పు కలిగి ‘హేమాద్రి పంతు’ అనే బిరుదు పేరే ఏర్పడింది. మరాఠీ భాషలో హేమాడ్‌ పంత్‌. 

ఇదే తీరుగా భారతంలో పరాశరుడనే మహర్షి ఉన్నాడు. ఆయన గంగానదిని నావమీద దాటుతూ ఆ నావని నడుపుతూన్న సత్యవతి అనే ఆమెను అడిగాడు – నీ నుండి ఉత్తమ పుత్రుణ్ని పొందదలిచాను తప్పశ్శక్తితో – అని. ఆమె అంగీకరించింది. దానిక్కారణం తపశ్శక్తితో సద్యోగర్భాన్ని (చూస్తుండగా గర్భం రావడం, తొమ్మిది నెలలు మోయడం.. వంటివేమీ లేకుండా సంతానాన్ని కనడం,) ఇస్తున్నప్పుడూ, కన్యత్వం చెడనప్పుడూ సంతానాన్ని – అందునా మహర్షి నుండి పొందడం మంచిదీ, గౌరవకారణమూ కదా! అని. జాలరి అయిన తనకు మహర్షి అనుగ్రహం ఆయనంతట ఆయన ద్వారా కలగడం ఎంత గొప్ప! అని భావించి అంగీకరించింది. గంగకి అవతలి ఒడ్డుకి చేరాక ద్వీపంలో కనడం కారణంగానూ, ప్రపంచాన్ని చీకటి చేసి (కృష్ణం) పుత్రుణ్ని పొందిన కారణంగానూ ఆ సంతానం ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని పిలువబడ్డాడు. ఇది ఆయన అసలు పేరు. ఇందాక శ్రీమద్రామాయణ కథలో బిరుదు పేరైన వాల్మీకికి ముందు పేరు ఋక్షుడు అయినట్లుగా, ఇక్కడ కూడా ఈ కృష్ణ ద్వైపాయనుడు – వేదాలను విభజించిన కారణంగా వేద వ్యాసుడు అనే బిరుదు పేరుని పొందాడు. 

పరిశీలిస్తే చరిత్రలన్నీ ఒకలానే ఉంటాయి. ఋక్షుడు – వాల్మీకి, కృష్ణ ద్వైపాయనుడు – వ్యాసుడు లాగానే అన్నా సాహెబు – హేమాడ్‌ పంత్‌గా అయ్యాయి. బాబాని ఎందుకు నమ్మాలి? కోట్ల మంది భక్తులకి బాబా ఆరాధ్య దైవం. బాబా సమాధి కాకముందు చూసినవారెవరూ వారు సమాధి అయ్యేంతవరకూ ఒక్కసారి మాత్రమే చూసి మరల రాకుండా ఉన్నవారు లేరు. అదేదో వింత ఆకర్షణ ఆయనలో ఉండటమే కారణం. జీవితంలో పెద్ద దీర్ఘ సమస్య వచ్చిన సందర్భంలో ఆయన సమాధి దగ్గరకు పోయి నిశ్శబ్దంగా మనసులోనే రోదిస్తూ నిలబడితే, మౌనంగా ఆ సమాధి నుండి సమస్యకి సమాధానం వినిపిస్తుంది. ఆ సమాధానం పట్ల ఎదురుచూపు ప్రారంభమవుతుంది. మొత్తానికి అలాగే ఆ సమస్యా పరిష్కారం జరగడమనేది ఎందరికో అనుభవంతో కనిపించే యథార్థం. తనకున్న ఖ్యాతి, కీర్తి, భక్త జన సంరక్షకుడనే జనుల నమ్మకం కారణంగా బంగారపు మేడలలో నివసించవచ్చు. చిటికె వేస్తే చాలు ఖరీదైన భవనాల పరంపర తన వద్దకి వచ్చి చేరతాయి. అయితే ఆయన ఓ మసీదు గోడకి మాత్రమే ఒరిగి కూర్చుంటారు. ఎవరో ఆయన గురించి బాధపడి ఒక దిండుని అందిస్తే దాన్ని పెట్టుకుని కనిపిస్తారు రేయింబవళ్లూ. ఎందరెందరి జీవితాలకో వడ్డించిన విస్తళ్లని ఏర్పాటు చేయగల శక్తి ఉన్నా, ఆయన మాత్రం నేలమీద ఓ ముతక గోనె సంచిని పరిచి దానిమీద తిరుగలిని ఉంచి, పక్కన చేటలో ఉన్న గోధుమల్ని అప్పుడప్పుడు కొంత కొంత చొప్పున పోస్తూ, తిరుగలిని తిప్పుతూ పిండిని విసురుతూ అప్పుడప్పుడు కనిపిస్తారు. ఒంటరివాడైన బాబాకి ఆ చేటెడు గోధుమలు కావాలా? పైగా పిండిని తానే విసురుకోవాలా? ఎవరిని ఆర్ద్ర దృష్టితో చూసినా ఎన్ని కాలిన రొట్టెలని తెచ్చి సమర్పించుకోరు గనుక! ఓ ఎండ అని లేదు – వాన అనేది లేదు – చలి అనేదాన్ని పట్టించుకునే ధోరణే లేదు. ఏదో ప్రకృతికి అతీతునిగా అక్కడే ఆ వేపచెట్టు మూలంలో కూర్చోవడం ఆశ్చర్యం కాదూ? పరమ రామ భక్తులయినవారు దర్శిస్తే వారికి రామచంద్రమూర్తిగాను, అత్యంత శివభక్తిపరులు దర్శిస్తే సాక్షాత్తూ పరమశివునిలానూ కనిపించి ఉన్న కారణంగానూ, కృష్ణ పరమాత్ముని లాగా అనేక లీలలని చూపి ఉన్న కారణంగా ఆయన్నే కృష్ణుడిగా అందరూ దర్శించారు. అందుకే ఆయన నివసించే మసీదుకి ద్వారక అనే పేరుని పెట్టారు. లోకంలో ద్వారకలు మూడు కాగా, ఒకటి సముద్రంలో మునిగిపోయింది కదా! రెండవది ద్వారకాపురి. ఇక మూడోది సప్త ద్వారక అదే షిరిడీ అని భక్తజనుల దృఢ విశ్వాసం. లక్షలకొలది భక్తులకు ఆహారాన్ని పెట్టగలిగి కూడా భిక్షాటన చేయడం, బంగారపు మందిరాల్లో ఉండగలిగిన శక్తి ఉండి కూడా మసీదు గోడకే ఆనుకుని కూర్చోవడం, భూత భవిష్యత్‌ వర్తమానాలని తెలియగలిగిన శక్తి ఉండి కూడా ఏమీ తెలియని పిచ్చివానివలె ఉండటం, ఖరీదైన వస్త్రాలను కోకొల్లలుగా రప్పించుకోగలిగి కూడా చిరిగిన వస్త్రాలనే ధరిస్తూ, చిరిగిన చోట సూదీ దారాలతో కుట్టుకున్న వస్త్రాలని వేసుకోవడం, తనకి నిజమైన భక్తుడని అనిపించిన వ్యక్తికి మాత్రమే ఊదీ (విభూతి) ప్రసాదాన్నిస్తూ ఉండటం, అత్యంత భక్తుడైన వానికి మాత్రమే అర్థమయ్యేలా నర్మగర్భంగా మాట్లాడటం... వంటివన్నీ నిజమైన ఫకీరు లక్షణాలు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనివానిలా ఉండటం, అన్నీ తెలిసి కూడా తెలియని వానిలా ఉండటం, అనేక సిద్ధ శక్తులున్నప్పటికీ (నీళ్లతో దీపాలను వెలిగించడం వంటివి) అతి సామాన్యునిలా వ్యవహరించడం, అంతటి గొప్పవాడైనప్పటికీ పిల్లలతో ఆటలాడుకుంటూ ఉండటం.. వంటివన్నీ ఆయన్ను లోకానికి అతీత పురుషునిగా తెలియజేస్తూ ఇహలోక భోగాలను అనుభవించగల శక్తి ఉండీ, వాటిని ఇష్టపడని తీరులో ఉన్న కారణంగా ఆయన్ని తప్పక నమ్మితీరాలని చెప్తాయి ఈ ఉదాహరణలన్నీ. 
ఇక రోహిల్లా కథకి వెళదాం. (సశేషం..)              
∙డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement