
తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ గోవర్దన్ రెడ్డి తదితరులు
చిక్కడపల్లి: నగరవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేపట్టిన దాడులు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా అమీర్‌పేట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని పలు కోచింగ్ సెంటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. భద్రతా ప్రమాణాలు పాటించని, నిబంధనలకు విరుద్ధం గా కొనసాగుతున్న పలు సెంటర్లను సీజ్ చేశారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో..
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కోచింగ్ కేంద్రాలపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శ్రీకాంత్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. బహుళ అంతస్తులు, అగ్గి పెట్టెల్లాంటి గదుల్లో పుట్టగొడుగులను తలపించే ఈ కేంద్రాలపై దృష్టి సారించిన అధికారులు ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిచని పలు కేంద్రాలకు గతంలో నోటీసులు జారీ చేశారు. అయినా నిర్వాహకులు స్పందించకపోవడం వాటిని సీజ్ చేశారు. మే 24న సూరత్‌లో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అశోక్‌నగర్‌లోని డాక్టర్ పీవీ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, హెచ్‌కె.రాయిడు ఐఏఎస్ స్టడీ సర్కిల్, కెరీర్ ఐఏఎస్ అకాడమి, శైన్ ఇండియా ఐఏఎస్ అకాడమి, డాక్టర్ జగదీష్ అకాడమి, కేరీర్ అకాడమి, విజ్‌డమ్, త్రివేణి అకాడమి కోచింగ్ సెంటర్లతో సహా 32 కేంద్రాలను సీజ్ చేసిన్నట్లు ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. గతంలో ఫైర్‌సేఫ్టీ, ఎన్‌వోసీ తీసుకోవాలని నోటీసులు ఇచ్చినా వారు స్పందించకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించని కోచింగ్ కేంద్రాలను మూసి వేస్తామని హెచ్చరించారు. కాగా తమ కోచింగ్ సెంటర్లకు నోటీసులు ఇవ్వలేదని, ఇచ్చినా సమ యం ఇవ్వకపోవడం దారుణమని ఇలా ఉన్న ఫలంగా సీజ్ చేయడం తగదన్నారు. ఇప్పటికైనా కొంత సమయం ఇవ్వాలని కోచింగ్ సెంటర్ల యాజమానులు, ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
కూకట్‌పల్లిలో...
భాగ్యనగర్‌కాలనీ: కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, ఫైర్ సేఫ్టీ పాటించని కోచింగ్ సెంటర్లపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి పలు సెంటర్లను సీజ్ చేశారు. గతంలోనే అనేక సెంటర్లకు నోటీసులు ఇచ్చినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పాటు ఫైర్ నిబంధనలు ఇతర భద్రత చర్యలు పాటించని కోచింగ్ సెంటర్లను సీజ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ గోవర్దన్ రెడ్డి తెలిపారు. సర్కిల్ పరిధిలో 146 కోచింగ్ సెంటర్లు కొనసాగుతుండగా, 46 సెంటర్లకు నోటీసులు అందజేశామని, ఇప్పటివరకు 36 సెంటర్లను సీజ్ చేశామన్నారు. మరో 10 సెంటర్లను కూడా సీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. దాడుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఇంజినీర్ అనిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment