
సాక్షి, సిటీబ్యూరో: మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా...ఉంటే వాటిని రోడ్లపై, చెత్తకుప్పల్లో , నాలాల్లో వేయవద్దు. వీటిని మీ ఇంటి వద్దనుంచే జీహెచ్‌ఎంసీ సేకరించనున్నది. ఈ నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. నవంబర్ 3 నుంచి 12వ తేదీ వరకు పది రోజుల పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇళ్లలో వృథాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, మెత్తలు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇతర నిరుపయోగ వస్తువులను ఈ ప్రత్యేక డ్రైవ్‌లోసేకరించాలని నిర్ణయించారు. నగరంలోఈ పనికిరాని వస్తువులన్నింటినీ రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారు. తద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు జామ్ కావడంతో రోడ్లపై మురుగునీరు పొంగడం, నాలాల ద్వారా నీరు సక్రమంగా ప్రవహించకుండా రహదారులు జలమయం కావడం నగరంలో సాధారణంగా మారింది.
ఇటీవల నగరంలోని ఖాళీ స్థలాలు, పార్కులు, రహదారులవెంట ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్లాస్టిక్ డ్రైవ్ ద్వారా 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను జీహెచ్‌ఎంసీ సేకరించింది. తద్వారా ఇటీవలి కాలంలో వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల నాలాలు, డ్రెయిన్‌లు, మ్యాన్‌హోళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు తక్కువగా ఉండడంతో వరదనీరు సక్రమంగా పారేందుకు అవకాశం ఏర్పడింది. ఇదేమాదిరిగా ప్లాస్టిక్ ఏరివేత వల్ల వచ్చిన సత్ఫలితాల దృష్ట్యా ఇళ్లలోని వృథా వస్తువులను కూడా సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందించింది.
దాదాపు 10 రోజుల పాటు కొనసాగే ఈ డ్రైవ్‌లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయా లని నిర్ణయించింది. ఇందుకుగాను ఆర్‌డబ్య్లూఏలు, ఎన్‌జీఓలు, మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి నిరుపయోగ వస్తువులన్నింటిని జీహెచ్‌ఎంసికీ అందజేయాలని విజ్ఞప్తి చేయనుంది. కాగా ఈ నిరుపయోగవస్తువుల సేకరణకు ప్రతి డివిజన్‌లో ఒక స్థలాన్ని ఎంపిక చేసి ఆయా స్థలాలకు ఈ వస్తువులను తెచ్చి వేయవచ్చని కూడా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment