టార్గెట్ ‘గ్రేటర్’
- ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నిరసన గళం
- త్వరలో గ్రేటర్ పార్టీకి కొత్త నాయకత్వం
- జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యరంగంలోకి దిగింది. తెలంగాణ పార్టీ ముఖ్య నేతలే ఆయా నియోకవర్గాల సమన్వయకర్తల బాధ్యతలను తీసుకుని కార్యకర్తల్లో మనోధైర్యం నింపే కసరత్తును ప్రారంభించారు. ఆదివారం ఖైరతాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, కుత్బుల్లాపూర్, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో నిర్వహించిన సమావేశాలకు ఓ మోస్తరుగానే కార్యకర్తలు హాజరయ్యారు. మిగిలిన నియోజకవర్గాల్లో సోమ, మంగళ వారాల్లో సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉంటే గత సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న నగరం తదనంతర పరిణామాలతో పూర్తిగా డీలా పడిపోయింది. ఈ ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేసే దిశగా పీసీసీ, సీఎల్పీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, డీకే ఆరుణ, గీతారెడ్డి, సీనియర్ నాయకులు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఆదివారం నగరంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కుత్బుల్లాపూర్, సనత్‌నగర్‌లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కార్యకర్తల హాజరు పలుచగానే కనిపించింది. ఉప్పల్‌లో ఎంపీ సర్వే వర్గీయులు గైర్హాజరయ్యారు.
త్వరలో గ్రేటర్ కమిటీకి కొత్త రూపు
ఇటీవలి ఎన్నికల్లో నగరంలో పూర్తిగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో కొత్త రూపు ఇచ్చే కసరత్తు ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏడాది వైఫల్యాలను నిలదీసే నిమిత్తం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల అనంతరం, డివిజన్ వారిగా ఆందోళనలు నిర్వహించే యోచనలో పీసీసీ ఉన్నట్లు సమాచారం. రెండవ దశ కార్యక్రమాల అనంతరం పార్టీలో అన్ని వర్గాల నాయకులతో సంప్రదించి గ్రేటర్ కాంగ్రెస్ కమిటీకి కొత్త నాయకున్ని నియమించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ కమిటీ బాధ్యతలు చూస్తున్న నాయకులకు పీసీసీలో స్థానం కల్పించి కొత్తవారికి నగర బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.