సిటీవాసులకు దోమలు, ఈగలతో జీవనం సర్వసాధారణమే. కానీ అగ్రదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు దోమలంటే మహా భయం. విష ప్రాణులు, క్రూర జంతువుల దాడిలో మరణించే వారికంటే ప్రపంచ వ్యాప్తంగా దోమకాటు మరణాలే ఎక్కువ. దీంతో వారు ఈ చిన్న ప్రాణి అంటే ఆయా దేశాలవారు వణికి పోతారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధులను దోమ కుట్టకుండా జీహెచ్‌ఎంసీ రేయింబళ్లు వేట సాగిస్తోంది. సదస్సు జరుగనున్న హెచ్‌ఐసీసీ, విందు ఇచ్చే గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ఫాగింగ్ చేస్తున్నారు. చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగిస్తున్నారు. దోమల ఉనికి లేకుండా పనులు చేస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: విదేశీ ప్రతినిధులకు 28వ తేదీ రాత్రి విందు జరుగనున్న ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో ఐఆర్‌ఎస్ స్ప్రే చేస్తున్నారు. స్రేయింగ్‌కు అల్ఫా సైపర్ మెథ్రిన్, ఫాగింగ్‌కు సిఫనోథ్రిన్‌తో పాటు ఆలౌట్ మాదిరిగా పనిచేసే పొగ రాకుండా ఏరియల్ స్ప్రే కోసం ఫైరిథ్రమ్‌ను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. గోల్కొండ కోట మొత్తం ఏసీఎం పౌడర్‌తో నాలుగు రోజులుగా ముమ్మరంగా దోమల వేట సాగిస్తున్నారు. శక్తివంతమైన నాలుగు భారీ స్ప్రేయర్లతో ఫైరిథ్రమ్‌ను చల్లుతున్నారు. కోట పరిసరాల్లోని శాతం తలాబ్, హుడా పార్కు పరిసరాల్లో భారీ సిబ్బందితో నాలుగు రోజులుగా గుర్రపుడెక్క తొలగిస్తున్నారు. ఫలక్‌నుమా, హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లోనూ గుర్రపు డెక్క తొలగింపుతో పాటు ఐదేసి భారీ వాహనాలు, 15 పోర్టబుల్ యంత్రాలతో నిరంతరం ఫాగింగ్ చేస్తున్నారు.
అతిథులు ఉండే మూడు రాత్రులు దోమల బెడద లేకుండా చేసేందుకు మహా యుద్ధం చేస్తున్నారు. గోల్కొండ కోట వద్ద 150 మంది, ఫలక్‌నుమా వద్ద 54 మంది, హెచ్‌ఐసీసీ వద్ద 36 మంది సిబ్బంది 24్ఠ7గా దోమల నిర్మూలనలో నిమగ్నమయ్యారు. వీరితోపాటు ఐదుగురు అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, 10 మంది సూపర్‌వైజర్లు ఇవే పనుల్లో ఉన్నారు. గత నాలుగైదు రోజుల్లో మూడెకరాల పరిధిలోని శాతం చెరువులో గుర్రపుడెక్క పనులు పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వెంకటేశ్ తెలిపారు. అతిథులు పర్యటించే ప్రాంతాల్లోని నాలాలు, చెరువుల్లోనూ గుర్రడపుడెక్క తొలగింపు పనులు ముమ్మరంగా చేస్తున్నారు.
నిలోఫర్‌లో 24 గంటల ఫార్మసీ
నాంపల్లి: నవ జాత శిశువుల సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆస్పత్రిలో 24 గంటల ఫార్మసీని ప్రారంభించాలని డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి ఆదేశించారు. దీనిని 27 నుంచి అందుబాటులోకి తేవాలని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణకు సూచించారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని ఆస్పత్రిని సందర్శించిన డాక్టర్ రమేష్‌రెడ్డి వైద్యాధికారులతో సమావేశమై పలు సమస్యలపై సమీక్షించారు. నర్సుల పోస్టుల భర్తీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లో 24 గంటల ఫార్మసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్‌ఎంఓ డాక్టర్ నరహరి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
రొటేషన్ పద్ధతిలో టెక్నిషియన్ల విధులు
నిలోఫర్ రేడియాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగాల్లో సుమారు 40 మంది టెక్నిషియన్లు పని చేస్తున్నారు. వీరంతా ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల 13 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. రొటేషన్ పద్ధతిలో టెక్నిషియన్లకు విధులు అప్పగించడం వల్ల వారి పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు సహా నాలుగో తరగతి ఉద్యోగులు రొటేషన్ పద్థతిలో పని చేస్తున్నారు. టెక్నిషియన్లను కూడా అలా పని చేయించడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment