
రూ.5 భోజనం.. 50 కేంద్రాల్లో...
* పథకం విస్తరణకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు
* త్వరలో ప్రతిపాదనలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం గ్రేటర్‌లోని ఎనిమిది కేంద్రాల్లో రూ. 5కే భోజనం అందిస్తున్న జీహెచ్‌ఎంసీ త్వరలోనే ఈ కార్యక్రమాన్ని 50 సెంటర్లలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు.. అర్హత కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించే (ఆర్ ఎఫ్‌పీ) పనుల్లో మునిగింది. ప్రయోగాత్మకంగా గత మార్చిలో ఒక కేంద్రంలో ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రస్తుతం 8 కేంద్రాల్లో అమలు చేస్తున్నారు. పేదల నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని కేంద్రాలకు విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ఈ పథకం అమలు బాధ్యతల్ని హరేకృష్ణ ఫౌండేషన్‌కు నామినేషన్‌పై ఇచ్చారు.
వాస్తవానికి ఒక్కో భోజనానికి రూ. 22.50 ఖర్చవుతుండగా, హరేకృష్ణ ఫౌండేషన్ తనవంతు విరాళంగా రూ. 2.50 అందజేస్తోంది. జీహెచ్‌ఎంసీ రూ.15 చెల్లిస్తోంది. మిగతా 5 రూపాయలు మాత్రం లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్నారు. నామినేషన్‌పై ఇవ్వడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని టెండరు ప్రక్రియలో తక్కువ ఖర్చుతో ముందుకొచ్చేవారికి అప్పగించాలని భావిస్తున్నారు. అందుకు నిబంధనలు రూపొందిస్తున్నారు. ఆహారం తగిన పరిమాణంలో, నాణ్యతతోపాటు శుచిగా ఉండాలనేది ప్రధాన నిబంధన. ఒక్కో కేంద్రం ద్వారా రోజుకు 300 మందికి ఈ పథకాన్ని వర్తింపచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 50 కేంద్రాల్లో వెరసి రోజుకు 15వేల మందికి భోజనం పెట్టాలి. ఇందుకు అవసరమైన వంట సామగ్రి, రవాణా సదుపాయాలు.. వేడిగా ఉండగానే ఆహారం వడ్డించడం తదితరమైన వాటితో టెక్నికల్ బిడ్‌లో అర్హత పొందిన వాటిని ఆర్థిక బిడ్‌లో పరిగణనలోకి తీసుకోనున్నారు.
పేదలు.. ప్రయాణికులుండే ప్రాంతాల్లో..
- ప్రస్తుతం నాంపల్లి, చార్మినార్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌లతో సహా 8 ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. మొత్తం 50 కేంద్రాల్లో అమలు చేయాలనేది లక్ష్యం. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ఆస్పత్రుల వద్ద, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సదుపాయంగా ఉండేందుకు బస్టాండ్ల వద్ద, కార్మికుల అడ్డాల వద్ద ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
- ఆహార భద్రత కింద సబ్సిడీ ధరలకే బియ్యం, గోధుమలు వంటివి పంపిణీ అవుతున్నప్పటికీ.. చాలామంది సరైన భోజనం చేయలేకపోతున్నారనే తలంపుతో జీహెచ్‌ఎంసీ దీన్ని చేపట్టింది.
- హరేకృష్ణ ఫౌండేషన్ ‘అక్షయపాత్ర’ పేరిట ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఇప్పటికే ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దాని స్ఫూర్తితోనే జీహెచ్‌ఎంసీ తక్కువ ధరకే భోజన కార్యక్రమానికి సిద్ధమైంది. అమలు బాధ్యతలు కూడా తొలుత దానికే అప్పగించింది.
- దీనికోసం జీహెచ్‌ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.18 కోట్లు కేటాయించింది.
- ఈ పథకంలో కప్పు అన్నం, కూర లేక పప్పు, సాంబార్, పచ్చడితో ఇంటి భోజనం అందజేస్తున్నారు. వారంలో ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ , స్వీట్ ఇస్తున్నారు. ఒకరోజు పులిహోర, అరటి పండు పెడుతున్నారు.