
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానుండటంతో నిమజ్జన ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి సారించారు. పండగ మూడోరోజు నుంచి చిన్న విగ్రహాల నిమజ్జనాలు జరిగే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో, రహదారుల మార్గాల్లో అవసరమైన పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. నిమజ్జనాలు జరిగే చెరువులకు దారి తీసే మార్గాల్లో, చెరువుల వద్ద సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించారు. నిమజ్జన శోభాయాత్ర నాటికి దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో అవసరమైన సదుపాయాలు కల్పించనున్నారు. ఈనిధులతో గ్రేటర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగే దాదాపు 50 చెరువుల వద్ద, హుస్సేన్‌సాగర్ వద్ద అవసరమైన ఏర్పాట్లతోపాటు ఆయా మార్గాల్లో గుంతల పూడ్చివేత , దెబ్బతిన్నరోడ్ల మరమ్మతులు తదితర పనులు చేయనున్నారు.
ఈపనుల్లో 98 పనులు తాత్కాలిక ఏర్పాట్లకు సంబంధించినవి కాగా, మిగతా 72 పనుల్లో బీటీ, సీసీ రోడ్ల మరమ్మతులు, రీకార్పెటింగ్, క్యాచ్‌పిట్ మరమ్మతులు తదితరమైన వాటికి సంబంధించినవి. శోభాయాత్ర మార్గం పొడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు శోభాయాత్రకు మూడు రోజుల మందు పూర్తిస్థాయిలో పనులు చేపట్టనున్నట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. ఇవి కాక తాత్కాలిక విద్యుత్ దీపాల ఏర్పాటు, గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం 107 మొబైల్ క్రేన్లు, 81 స్టాటిక్‌క్రేన్లు తదితరమైనవి వినియోగంలోకి తేనున్నారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా మెడికల్‌క్యాంపులు, మొబైల్ టాయ్‌లెట్లు తదితర సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు.
పండగొచ్చినా.. పూర్తికాని గుంతల పూడ్చివేత..
నిమజ్జన పనులతో సంబంధం లేకుండా వినాయక చవితి నాటికి రోడ్లపై గుంతలన్నింటినీ పూడ్చివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించడంతో అందుకు కార్యాచరణ రూపొందించిన అధికారులు పనులు మాత్రం పూర్తిచేయలేకపోయారు. సోమవారం వర్షం కురవడంతో పనులు నిలిచిపోయాయని, వర్షం వల్ల కొత్త గుంతలు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని పూడ్చివేసేందుకు మరికొన్ని రోజులు పట్టనుంది. ఈలోగా మళీ వర్షాలు వస్తే గుంతలు పెరగనున్నాయి.
రూ. 3 కోట్లతో మొహర్రం పనులు
ఓవైపు గణేశ్ నిమజ్జనం పనులతోపాటు మరోవైపు మొహర్రం సందర్భంగా అవసరమైన సదుపాయాల కల్పనకు కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. దాదాపు రూ. 3 కోట్లతో ఈ పనులు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ ఆరు సర్కిళ్ల పరిధిలో దాదాపు 50 పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.
జోన్ల వారీగా నిమజ్జన ఏర్పాట్లకుసంబంధించిన పనులు ..మంజూరైన నిధులు
జోన్ పనులు నిధులు (రూ. లక్షల్లో)
ఎల్‌బీనగర్ 22 187.40
చార్మినార్ 82 432.28
ఖైరతాబాద్ 22 135.51
శేరిలింగంపల్లి 16 83.96
కూకట్‌పల్లి 15 74.86
సికింద్రాబాద్ 13 84.61
మొత్తం 170 998.62
Comments
Please login to add a commentAdd a comment