
పాముతో బెదిరించి.. యువతిని వివస్త్రను చేసి
- పాముతో బెదిరించి.. యువతిని వివస్త్రను చేసి..
- ఆపై సెల్‌లో చిత్రీకరించిన దుండగులు
- పహాడీషరీఫ్‌లో ప్రేమజంటపై కీచకుల దాడి
- గొలుసు, నగదుతో ఉడాయింపు
పహాడీషరీఫ్: నగరంలో దారుణం జరిగింది. ఏడుగురు యువకులు కీచక పర్వాన్ని కొనసాగించారు. సరదా కోసం ఫాం హౌస్‌కు వెళ్లిన ప్రేమజంటపై దాడి చేశారు. పాముతో, కత్తులతో బెదిరించి యువతిని వివస్త్రను చేశారు. ఆపై సెల్‌ఫోన్లలో ఫొటోలు తీశారు. ఆమె వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, ప్రేమికుడి వద్ద గల రూ.6 వేల నగదు తీసుకొని ఉడాయించారు.
గత నెల 31న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ సంఘటన వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన ఓ ప్రేమ జంట (మరో నెల రోజుల్లో పెళ్లి చేసుకోనున్నారు) గత నెల 31న సరదాగా గడిపేందుకు పహాడీషరీఫ్ షాయిన్‌నగర్‌లోని ఓ ఫాం హౌస్‌కు చేరుకున్నారు.
వారు అక్కడ ఫొటోలు దిగుతుండగా ఎర్రకుంటకు చెందిన ఫైసల్ దయానీ(28), ఉస్మాన్‌నగర్‌కు చెందిన ఖాదర్ బారక్‌బా(29), అన్వర్, ఖాజా, బండ్లగూడకు చెందిన తయ్యబ్ బాసలామా(20), షాయిన్‌నగర్‌కు చెందిన మహ్మద్ పర్వేజ్ (25), మహ్మద్ ఇబ్రహీం(19) గమనించారు. వెంటనే అక్కడి వాచ్‌మన్‌ను కత్తులతో బెదిరించి గోడ దూకి ఫాం హౌస్‌లోకి ప్రవేశించారు. యువతితో ఉన్న యువకుడిపై కత్తులతో దాడి చేశారు.
అనంతరం యువతిని కూడా పాముతో, కత్తులతో బెదిరించి వస్త్రాలు విప్పేయాలన్నారు. నగ్నంగా మారిన యువతిని వారు సెల్‌ఫోన్లలో బంధించి పైశాచికానందాన్ని పొందారు. చాలా సేపటి వరకు ఆ జంటను ఇబ్బంది పెట్టారు. అనంతరం యువతి మెడలోని రెండు తులాల బంగారు గొలుసు, యువకుడి వద్ద ఉన్న రూ.6 వేల నగదును లాక్కొని పారిపోయారు. బాధిత యువకుడు అదేరోజు రాత్రి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు తయ్యబ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్, మహ్మద్ ఇబ్రహీంలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీని.. ఘటన అనంతరం అతను శ్రీశైలం వెళ్లేందుకు సహకరించిన సాలం హమిది అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.