హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న మనస్విని
పాలకుర్తి టౌన్: ముచ్చటైన జంట కడుపున ఇద్దరు కవల పిల్లలు పురుడుపోసుకున్నారు. వారి ఎదుగుదలను చూస్తూ ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. బుడిబుడినడకలు, ముద్దు మాటలతో ఆ లేత మొగ్గలు కన్నవారికి కనులపండుగ చేశారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 15 నెలల ప్రాయంలో చిన్న కూతురు హృదయ సంబంధిత వ్యాధి బారిన పడి కన్నుమూసింది. ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. కన్నీళ్లను దిగమింగి పెద్ద కూతురు ఆలనా పాలనా చూస్తూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో పెను ఉప్పెనలా మరో విపత్తు వచ్చి పడింది. పెద్ద కూతురు మనస్విని కేన్సర్ బారిన పడింది. ప్రాణాలకు భరోసా లేదని, ఖరీదైన వైద్యం చేస్తే తప్ప పాపను బతికించడం కష్టమని వైద్యులు తేల్చిచెప్పారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై హైదరాబాద్‌లో చిరుద్యోగంలో కుదురుకున్న మధ్యతరగతి తండ్రి ఈ పిడుగులాంటి వార్తతో కుదేలయ్యాడు. ఉన్న ఒక్క బిడ్డను బతికించుకోవాలని ఆ తండ్రి పడుతున్న తపన వర్ణనాతీతం. కేన్సర్ బారిన పడి బతుకు పోరాటం చేస్తున్న ఆ బిడ్డకు దాతలు ఆపన్నహస్తం అందిస్తే ప్రాణం నిలబడుతుంది. సమాజంలో మానవత్వం పరిఢవిల్లుతుంది.
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు..
ప్రమాదకరమైన వ్యాధి బారినపడి బతుకు పోరాటం చేస్తున్న బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు నానా పాట్లు పడుతున్నారు. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం వైద్యానికి ఖర్చు చేశారు. రోజుకు రూ.వేలల్లో వైద్య ఖర్చులకు చెల్లించాల్సి రావడం వారికి భారంగా మారింది. చాలీచాలని వేతనంతో బతుకుబండి లాగుతున్న మధ్య తరగతి వేతన జీవికి వైద్య ఖర్చులు భరించే స్థితి లేదు. పాపను కాపాడుకునే దారి లేక చేతిలో చిల్లిగవ్వ లేక ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. దాతలు సాయమందించి తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని దీనంగా వేడుకుంటున్నారు.
ఖరీదైన వైద్యం.. భరించలేని దైన్యం..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన భారత మల్లేష్ – భాగ్యలక్ష్మి దంపతులకు కవల పిల్లలు. మల్లేష్ హైదరాబాద్‌లోని జీవీకే కంపెనీలో చిరుద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుటుంబం సాఫీగా సాగుతున్న క్రమంలో కనురెప్పలపై కాలం కన్నెర్రజేసింది. చిన్న కూతురు మనస్విత 15 నెలల వయస్సులో ‘రెస్ట్రిక్టవ్ కార్డియోపతి’ వ్యాధి బారిన పడి రెండేళ్ల క్రితం తనువు చాలించింది. బోసినవ్వుల బిడ్డ అర్ధాంతరంగా లోకాన్ని విడిచిపెట్టడంతో కుటుంబం షాక్‌కు గురైంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పెద్ద కూతురు మనస్విని అల్లారుమద్దుగా పెంచుకున్నారు. మూడేళ్ల వరకు ఆ బిడ్డకు ఎలాంటి నలత లేదు. ఆ తర్వాత తరుచూ అనారోగ్యం బారిన పడటం మొదలైంది. ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తే ‘అక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా’ అనే కేన్సర్ సోకిందని వైద్యులు తేల్చారు. వైద్య ఖర్చులు రూ.20 లక్షల వరకు అవుతాయని, అంతకంటే ఎక్కువైనా భరిస్తే తప్ప పాప ప్రాణం నిలబడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంత డబ్బు లేకున్నా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాత్కాలికంగా వైద్యం అందిస్తున్నారు.
సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన నంబర్లు
భారత మల్లేష్, ఎస్‌బీఐ ఖాతా నంబర్ 3159 04824 88, పాలకుర్తి
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : SBIN0014240
ఫోన్ పే / గూగల్ పే నంబర్ : 97042 23003
Comments
Please login to add a commentAdd a comment