
బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే!
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో గత గురువారం బోరుబావిలో పడిన చిట్టితల్లీ మీనాను ప్రాణాలతో కాపడలేకపోయారు. దాదాపు 60 గంటల పాటు పలువురు సిబ్బంది ఎంతో శ్రమించినా మీనా కథ విషాదంగానే ముగిసింది. పాప మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చూడాల్సి రావడంతో తల్లిదండ్రులతో పాటు చూపరులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు. అసలే ఏం జరగిందంటే.. గురువారం సాయంత్రం తోటి చిన్నారులతో మీనా ఆడుకుంటూ ఉంది. తెరచిఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయిన చిన్నారిని అత్యాధునిక పరికరాలతో బయటకు తీయాలని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సైతం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి బోరు బావి నుంచి దుర్వాసర వస్తుండటంతో మంత్రి మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో చివరి ప్రయత్నంగా ఫ్లషింగ్ విధానాన్ని అనుసరించారు. దీంతో మొదట పాప దుస్తులు వచ్చాయి. అనంతరం పాప శరీర భాగాలను బయటకు తీసి చేవెళ్ల ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
రెస్క్యూ ఆపరేషన్ ఇలా సాగింది..
- జూన్ 22న (గురువారం) ఆడుకుంటూ సాయంత్రం 6:45 గంటలకు బోరుబావిలో పడిపోయిన చిన్నారి మీనా
- సాయంత్రం 6:50 గంటలకు స్థానికులకు సమాచారం
- అదే రోజు రాత్రి 7:15 గంటలకు బోరుబావి వద్దకు చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది. మరో ఐదు నిమిషాలకు ఘటనస్ధలంలో మంత్రి మహేందర్ రెడ్డి
- రాత్రి 7:45 గంటలకు జేసీబీల రాక. రాత్రి 11 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
- రాత్రి 11:30 గంటలకు ఘటనాస్థలానికి వచ్చి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రఘునందన్
- గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అత్యాధునిక పరికరాలతో వచ్చిన మంగళగిరి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
- జూన్ 22 అర్థరాత్రి నుంచి జూన్ 23 ఉదయం వరకు బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు
- శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బోరు బావి నుంచి మోటార్ వెలికితీత
- మధ్యాహ్నం నుంచి మళ్లీ కొనసాగిన తవ్వకాలు. పాప 40 అడుగుల నుంచి 100 అడుగులకు లోతుకు
- జూన్ 24 (శనివారం) ఉదయం ప్రత్యేక లేజర్ కెమెరాలు తెప్పించి.. 110 అడుగుల లోతు వరకు పంపి పరిశీలించినా కనిపంచని పాప ఆనవాళ్లు
- మధ్యాహ్నం అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించిన కనిపించని పాప జాడ
- సాయంత్రం కొక్కెం లాంటి పరికరాలతో పాపను బయటకు తీసేందుకు సిబ్బంది యత్నం
- శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత పాప చనిపోయి ఉండొచ్చునని అనుమానాలు
- ఆదివారం వేకువజాములోగా కేఎల్‌ఆర్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పించారు. బోరుబావిలోకి ఫ్లషర్ పెట్టి చిన్నారి దేహాన్ని బయటకు తీయాలని యత్నాలు
- దాదాపు 6 గంటల ప్రాంతంలో బోరుబావి నుంచి దుర్వాసన. అనంతరం పాప దుస్తులు, అవశేషాలు వెలికితీత
- చిన్నారి మీనా మృతిచెందినట్లు ఉదయం 6:25 గంటలకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటన. అనంతరం పాప అవశేషాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలింపు
సంబంధిత కథనాలు