జిన్నారం(పటాన్‌చెరు): ప్రేమ పేరుతో పదో తరగతి బాలికను వేధించడమే కాకుండా ఓ ఉన్మాది ఆమెను కిరాతకంగా గొంతుకోసి చంపాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో గురువారం ఈ దారుణ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం .. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తాపేశ్వరరావు, భవానీ దంపతులు బొల్లారంలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటున్నారు.
తాపేశ్వరరావు స్థానికంగా ఉన్న పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె నిఖిత (15) బొల్లారంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నిఖిత ఇంటి ఎదురుగా మహారాష్ట్రకు చెందిన బీటెక్ విద్యార్థి అరవింద్ ఉంటున్నాడు. కాగా, రెండు నెలలుగా తనను ప్రేమించాలంటూ అరవింద్, నిఖిత వెంట పడుతున్నాడు. ఇందుకు బాలిక అంగీకరించకపోవడంతో వేధింపులకు దిగాడు.
గురువారం సాయంత్రం తాపేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. లోనికి వెళ్లాడు. ఆపై తనను ప్రేమించాలని నిఖితపై ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో అరవింద్, నిఖిత మెడను కోసేశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతుండగా.. చుట్టుపక్కల వారు గమనించి పారిపోయేందుకు ప్రయత్నించిన అరవింద్‌ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. రక్తపుమడుగులో ఉన్న నిఖితను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment