వైరా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం డార్మెటరీ భవనం
వైరా ఖమ్మంజిల్లా : బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో..వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ( పాఠశాల, కళాశాల)లో చేరిన విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక, భవనం కూలుతుందేమోనని జంకుతూ, కరెంట్ షాక్ కొడుతున్న గోడలతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇక్కడి పాఠశాల భవనం నిర్మించి 35 ఏళ్లు గడుస్తోంది. ప్రస్తుతం డార్మెటరీ బిల్డింగ్ కూలేందుకు సిద్ధంగా ఉంది.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు భవనం పెచ్చులు ఊడిపోయి కురుస్తోంది. మొత్తం 10 గదులున్నాయి. సమావేశ మందిరం, కారిడార్ అంతా కూడా పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారింది. రాత్రివేళల్లో చాలా భయపడుతున్నారు. ఇక్కడి పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 630 మంది విద్యార్థినులు తరగతులకు హాజరవుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలంలో డార్మెటరీ భవనం పెచ్చులు ఊడిపోయి విద్యార్థినుల మీద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కురుస్తున్న వర్షాలకు భవనం నాని..అంతా నీటి చెమ్మగా మారింది.
షాక్‌తో సెలవులు..
డార్మెటరీ భవనం వర్షాలకు నాని కురుస్తుండటంతో ఇటీవల ఓ విద్యార్థిని ఫ్యాన్ స్వీచ్ వేయగా ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ కావడంతో..అప్రమత్తమైన సిబ్బంది జిల్లా అధికారులకు తెలియజేసి ఈ నెల21నుంచి 27వరకు 5వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థినులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపారు. ఇంకా..ఈ సమస్యను పరిష్కరించలేదు. ఇక్కడి విద్యార్థినులు తరగతి గదుల్లోనే ఉంటున్నారు. రాత్రిళ్లు కూడా ఇక్కడే నిద్రిస్తున్నారు. సైన్స్‌ల్యాబులో కింద కూర్చొని, ఇరుకుగా ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం..రూ.3 కోట్ల నిధులతో చేపట్టిన జీప్లస్ వన్ భవన నిర్మాణం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా..అధికారులు, కాంట్రాక్టర్లల నిర్లక్ష్యం వల్ల ఇంకా..పునాదుల దశనే దాటలేదు.
స్లాబ్ కూలుద్దేమో..
డార్మెంటరీ భవనం స్లాబ్ ఎప్పుడు కూలుతుంతోనని భయమేస్తోంది. ప్రమాదకరంగా ఉన్నప్పటీకీ ప్రతిరోజూ అక్కడే నిద్రిస్తున్నాం. రాత్రివేళల్లో కరెంట్ పోతే ఇబ్బందిగా ఉంది. మాకు చాలా భయమేస్తోంది. – టి.ప్రణవి, 8వ తరగతి
ఎర్త్ కొడుతోంది..
డార్మెటరీ భవనం కురుస్తోంది. భవనం మొత్తం ఎర్త్‌కూడా వస్తోంది. అక్కడే నిద్రించాలంటే భయమేస్తోంది. కోతుల బెడద విపరీతంగా ఉంది. మా సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు.
– జి.ధృవిత, 8వ తరగతి
ఇబ్బందికరంగా ఉంది..
పాఠశాలలో స్లాబ్ కురుస్తోంది. ఎప్పుడు కూలుతుందోనని ఇబ్బంది పడుతున్నాం. పాఠశాల ప్రిన్సిపాల్ సమస్యను అధికారులకు తెలియజేశా రు. ఇంకా పరిష్కారం కాలేదు.
– ఐ.శిరీష, కేర్‌టేకర్, వైరా
సెక్రటరీకి తెలియజేశాం..
పాఠశాలలో డార్మెటరీ భవనం సమస్యగానే ఉంది. రెండునెలల క్రితమే రాష్ట్ర సెక్రటరీకి విన్నవించాం. విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాం. కొత్త భవన నిర్మాణం త్వరగా పూర్తయితే ఇబ్బంది ఉండదు.
– వి.మేరీ ఏసుపాదం, ప్రిన్సిపాల్, వైరా గురుకుల పాఠశాల
Comments
Please login to add a commentAdd a comment