విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
త్వరలో వైద్య పోస్టుల భర్తీకి చర్యలు
వైద్య,ఆరోగ్య శాఖ కమిషనర్ వీణా కుమారి
సిద్దిపేటలో ఆకస్మిక తనిఖీలు
సిద్దిపేట జోన్ : ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై పూర్తిస్థాయిలో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ వీణా కుమారి అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంక్షేమ కేంద్రం, హైరిస్క్ సెంటర్, కంగారు మెథడ్ యునిట్, నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఏరియా ఆస్పత్రిని సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు అందుబాటులో ఉండాలని లేని పక్షంలో శాఖాపర చర్యలుంటాయని హెచ్చరించారు.
మరోవైపు ఓపీ సమస్య రాకుండా చూడాలని తనకు ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని సూపరింటెండెంట్ శివరాంను హెచ్చరించారు. అనంతరం బ్లడ్ బ్యాంక్, ఎక్స్‌రే, ఈసీజీ విభాగాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హైరిస్క్ కేంద్రానికి వచ్చిన కమిషనర్ కేంద్రంలో రోగుల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో మంచాలు ఖాళీగా ఉండడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామాల్లో హైరిస్క్ సేవలపై వైద్యులు క్షేత్రస్థాయిలో చైతన్యం చేయాలని సూచించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీచేసి వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఎస్‌ఎన్‌సీయూ కేంద్రం సేవలను వినియోగంలోకి తేవాలన్నారు.
రిఫర్ చేయొద్దు
సిద్దిపేటలో ఆధునిక వసతులతో కూడిన వైద్యం అందుతున్నప్పటికీ కొందరు వైద్యులు చిన్నపిల్లలను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయడం తగదని కమిషనర్ వీణాకుమారి అన్నారు. ఇక్కడ వైద్యం సరిపోకపోతే హైదరాబాద్‌లోని నీలోఫర్‌కు చిన్నపిల్లలను రిఫర్ చేయాలి కానీ, ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయవద్దని సూచించారు. సిద్దిపేటలో పిల్లల వైద్యుల పనితీరు మారాలని, త్వరలో వైద్యుల నియామకం చేపడతామన్నారు.
అనంతరం కంగారు మెథడ్ యూనిట్, ఎంసీహెచ్‌లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక మండలం గంభీర్‌పూర్‌కు చెందిన సౌందర్య ప్రసవ అనంతరం ఇంటివద్ద తల్లి,బిడ్డలను దించడానికి 102 ఆంబులెన్స్ డ్రైవర్ 200 డిమాండ్ చేయడం, ఆస్పత్రిలో ధోబీ, నర్సులు డబ్బులు అడిగినట్లు బాధితుడు వెంకటాచారి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ వెంటనే డబ్బులను తిరిగి బాధితునికి ఇప్పించాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పోగొట్టొద్దని హెచ్చరించారు.
సిద్దిపేటకు ప్లేట్‌లెట్ల కేంద్రం
ప్రస్తుతం హైదరాబాద్‌కు పరిమితం అయిన ప్లేట్‌లెట్లు (రక్తఫలకలు) త్వరలో సిద్దిపేటలో కూడా అందుబాటులో ఉంటాయని కమిషనర్ వీణా కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇతరత్రా కారణాలతో ప్లేట్‌లెట్స్ తగ్గి ప్రమాదకర స్థితిలోకి చేరుకునే ఈ ప్రాంత రోగుల కోసం ప్రత్యేక వసతిని కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డెంగీని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 12 ప్లేట్‌లెట్ల కేంద్రాలను మంజూరు చేసిందన్నారు.
అందులో భాగంగానే జిల్లాలో సిద్దిపేటతో పాటు సంగారెడ్డిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. సిద్దిపేట ఆస్పత్రుల్లో వైద్యుల సమస్యను పరిష్కరించే క్రమంలో పీజీ వైద్య విద్యార్థులను నియమించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట మండలంలో ఇప్పటివరకు రెండు డెంగీ కేసులను అధికారులు రిఫర్ చేశారని ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కమిషనర్ వెంట వైద్యులు రామస్వామి, అరుణ, లక్ష్మి తదితరులు ఉన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
సిద్దిపేట రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేలా వైద్య సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని కమిషనర్ వీణాకుమారి సిబ్బందికి సూచించారు. శుక్రవారం సీతారాంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల సిద్దిపేట నుంచి 72మంది రక్త నమూనాలు సేకరించగా, 13మంది పాజిటీవ్ వచ్చిందని గుర్తు చేశారు. వైద్య సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి సీజనల్ వ్యాధులపైఅవగాహన కల్పించాలని సూచించారు.
సర్కార్ వైద్యంపై నమ్మకం కలిగించండి
Published Sat, Aug 15 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement