రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి
ఖమ్మం: బ్యాంకు రుణాలు అందజేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీపై జాప్యం చేయడం సరికాదన్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా బ్యాంకుల్లో పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు తీసుకోకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి పాత రుణాలను రద్దు చేయాలని, కొత్త రుణాలు అందజేయాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తమై ఏజెన్సీ ప్రాంతంలో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
వరదలతో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులను ముందుగానే పసిగట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందించాలని కోరారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, మొండికుంట ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలన్నారు. నాగార్జునసాగర్ కెనాల్‌ను దుమ్ముగూడెం ప్రా జెక్టుకు అనుసంధానం చేసి నీటిఎద్దడిని నివారించాలని కోరారు. ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులవులు కావొస్తున్నా రైతులకు అధికారులు శుద్ధమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులను అందించలేదని విమర్శించారు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయకపోవడం వల్ల దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారని, దీంతో పంటల దిగుబడి తగ్గి అప్పుల పాలలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్లమెంటులో గళమిప్పుతా...
జిల్లా అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కోరతామని ఎంపీ అన్నారు. జిల్లాలో గిరిజన, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని కోరతామన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని, ఇందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని అన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో వైఎస్సార్‌సీపీ భాగస్వామ్యం అవుతుందన్నారు.
ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అలుపెరుగక పోరాడుతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తరతరాలుగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న గిరిజనులను ఆంధ్రలో కలిపితే సహించేది లేదన్నారు. ముంపు ప్రాతాలను కలుపుతున్నామనే సాకుతో ఇక్కడి ఖనిజ సంసద, ఇతర వనరులను దోచుకెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలోని ఒక్క గ్రామాన్ని కూడా వదులుకునేది లేదని, అందుకోసం వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. జిల్లాలో భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైను, ఇతర అండర్ బ్రిడ్జిలు, రైల్వే వంతెనలకు ప్రతిసారీ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నారే తప్ప పనులు వేగవంతం చేయడం లేదని అన్నారు. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద్‌గౌడ్‌ను కలిసి జిల్లా పరిస్థితులు వివరించానని చెప్పారు. వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. వరికి మద్దతు ధర రూ.50 మాత్రమే పెంచడంపై ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే బడ్జెట్లో జిల్లాలోని రైల్వే లైన్లకు అధిక నిధులు కేటాయించాలని, ప్రాజెక్టుల నిర్మాణం సత్వరమే చేపట్టాలని కోరారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మూడు జిల్లాల సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, ఎం.డి.ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.