కరీంనగర్ సిటీ : ‘పాలనలో మా పాత్రేంటో చెప్పండి... విధులు, నిధులు ఇవ్వండి... ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వండి... కనీసం మమ్మల్ని గుర్తించండి’ అంటూ ఎంపీటీసీలు ఆక్రోశం వెల్లగక్కారు. మధ్యాహ్నం సదస్సు ప్రారంభమైన కొద్దిసేపటికే ఎంపీటీసీలు లేచినిలబడి నినాదాలు చేశారు. తమకు హక్కులు కావాలని, ముందు తమను గుర్తించాలని బిగ్గరగా అరిచారు. కొద్దిమంది వేదిక వద్దకు దూసుకువచ్చి, వేదిక ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చీఫ్‌విప్ కొప్పుల సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పటికి వారు వినలేదు. చివరకు మంత్రి ఈటల జోక్యం చేసుకొని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడినే తానని, సమస్యలుంటే చెప్పుకోవాలి తప్ప, గొడవ చేస్తే లాభం లేదని అన్నారు.
దీంతో పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాట్లాడుతూ.. తాము ఉత్సవ విగ్రహాలుగా మారామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీల ఫోరం జిల్లా క న్వీనర్ తులా బాలయ్య మాట్లాడుతూ పంచాయతీల్లో సర్పంచ్‌కు, వార్డుసభ్యులకు కుర్చీ ఉంది కాని తమకు లేదన్నారు. కనీసం పింఛన్ ఫారంపై కూడా సంతకం చేసే అధికారం లేదన్నారు. గ్రామజ్యోతిలో సర్పంచ్‌లతో సమానంగా ఎంపీటీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. పలువురు ఎంపీటీసీలు... మండల పరిషత్ నుంచి తాము చేసే పనులకు పంచాయతీ తీర్మానం కావాలనడంతో సర్పంచ్‌లు వేధిస్తున్నారని చెప్పారు. పంచాయతీ తీర్మానాలపై ఎంపీటీసీల సంతకం తప్పనిసరిచేయాలన్నారు. మండల పరిషత్ కార్యక్రమాల్లో జెడ్పీటీసీలను భాగస్వాములు చేయాలని జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి కోరారు. మంత్రి ఈటల స్పందిస్తూ ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు గౌరవం పెంచేందుకు ప్రయత్నిస్తామని బదులిచ్చారు.
మమ్మల్ని గుర్తించండి
Published Fri, Aug 14 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement
Advertisement