అతడో రౌడీషీటర్.. హత్యలతో పాటు మొత్తం పది కేసుల్లో నిందితుడు.. కొద్ది రోజుల నుంచి అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు.. ఇంతటి ఘరానా నేరస్తుడిని బయటకు తీసుకెళాల్సిన సందర్భంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఎస్కార్ట్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా సదరు నిందితుడు చేతులకు బేడీలతోనే కోర్టు గోడ దూకి ఏంచక్కా పారిపోయాడు.
కోల్‌సిటీ : గోదావరిఖని ఐబీ కాలనీకి చెందిన నీలపు వంశీకృష్ణ(23)ను గంజాయి రవాణా కేసులో ఈనెల 15న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా జిల్లా జైలుకు తరలించారు. 2010 నవంబర్ 7న ఐబీ కాలనీలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట పిడుగు సతీష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటనలో వంశీకృష్ణ ప్రధాన నిందితుడు.
ఈ కేసు విచారణ నిమిత్తం వంశీకృష్ణను కరీంనగర్ జైలు నుంచి గోదావరిఖని కోర్టుకు గురువారం ఉదయం ఎస్కార్ట్ సిబ్బంది మధుసూధన్‌రావు, సుభాష్ తీసుకొచ్చారు. సుభాష్ కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టులో సమర్పించడానికి సుభాష్ వెళ్లగా, మధుసూధన్‌రావు ఎస్కార్ట్‌గా ఉన్నారు. ఇంతలో మూత్రవిసర్జన కోసమంటూ కోర్టు గోడ ప్రహరీవైపు వెళ్లిన వంశీకృష్ణ చేతులకున్న బేడీలతోనే గోడదూకి పరారయ్యాడు.
ఎస్కార్ట్ సిబ్బంది తేరుకునే లోగానే గోడ అవతలివైపు రోడ్డుపై అప్పటికే బైక్‌తో సిద్ధంగా యువకుడితో కలిసి పారిపోయాడు. ఈ ఘటనపై మధుసూధన్‌రావు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రామగుండం సీఐ నారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎస్కార్ట్ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పథకం ప్రకారమే పరారీ..
వంశీకృష్ణ పక్కా పథకం ప్రకారమే పరారైనట్టు తెలుస్తోంది. కోర్టు ఆవరణలో ఎస్కార్ట్ పోలీసు ల ఆధీనంలో ఉన్న వంశీకృష్ణను కుటుంబసభ్యులతో పాటు కొంతమంది యువకులు కలిసి మాట్లాడి వెళ్లినట్టు సమాచారం. ఇదే క్రమంలో నిలువెత్తు ఉన్న గోడ దూకి, అవతల రోడ్డుపై సిద్ధంగా ఉన్న బైక్‌పై పారిపోయేందుకు వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది.
గాంధీనగర్‌కు చెందిన నాగరాజు అనే యువకుడు వంశీకృష్ణను బైక్‌పై తీసుకెళ్లినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చినట్టు సమాచారం. పోలీసులు పెట్రోల్‌బంక్‌ల్లోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల వైపు రహదార్లలో గాలింపు చేపడుతున్నారు.
పది కేసుల్లో నిందితుడు..
వంశీకృష్ణపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో పది కేసులుండగా, ఇందులో పలు హత్యకేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. 2010లో కరీంనగర్ కిసాన్‌నగర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి తండ్రీకొడుకును దారుణంగా హత్య చేసిన కేసుతో పాటు అదే సంవత్సరం నవంబర్ 7న గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట రౌడీషీటర్ పిడుగు సతీష్‌ను కత్తులతో పొడిచి చంపిన కేసులో కూడా ఇతడు నిందితుడు.
ఇదే కేసులో వంశీకృష్ణ సోదరుడు రవిబాబు, అతడి మిత్రులు కట్టెకోల సుధీర్, దనాల శేఖర్, దాసరి ప్రేమ్‌కుమార్, కండె నరేందర్, తొర్రికొండ శ్రీనివాస్‌పై కేసు నమోదయింది. తర్వాత తొర్రికొండ శ్రీనివాస్ పోలీసులకు చిక్కకుండా పారిపోగా, కట్టెకోల సుధీర్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అప్పటినుంచి ఈ సంఘటనపై కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. తర్వాత వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వంశీకృష్ణపై రౌడీషీట్ తెరిచారు.
బేడీలతోనే గోడదూకి..
Published Fri, Nov 28 2014 4:11 AM | Last Updated on Tue, Oct 9 2018 2:23 PM
Advertisement