జనవాహిణి | godavari pushkaralu 2015 | Sakshi
Sakshi News home page

జనవాహిణి

Published Sun, Jul 19 2015 2:18 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

godavari pushkaralu 2015

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి... ధర్మపురిలో జనం నిండిపోయారు. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలో ఉన్నారు. దయచేసి భక్తులంతా ఇతర పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లండి - కరీంనగర్ బస్‌స్టేషన్‌లో మైకు ద్వారా ఆర్టీసీ అధికారుల సూచనలివి.
 
 కాళేశ్వరంలో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీల దర్శనాన్ని రద్దు చేయడమైనది. భక్తులు సహకరించాల్సిందిగా మనవి - కాళేశ్వరంలో భక్తులు పోటెత్తడంతో ఆలయ అధికారులు చేసిన విజ్ఞప్తి ఇది.
 కోటిలింగాలకు ఈరోజు, రేపు వెళ్లడం కష్టమే. పది కిలోమీటర్ల దూరంలోనే వాహనాలన్నీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాయని వార్తలొస్తున్నాయి. వేరే చోటుకు వెళ్లి పుష్కరస్నానం చేసొద్దాం పదండి - కోటిలింగాలలో పరిస్థితిని తెలుసుకుని జిల్లాలోని ఇతర ఘాట్లకు వెళ్లే ముందు ఆర్‌టీసీ బస్టాండ్‌లో కుటుంబ సభ్యులకు చెబుతున్న ఓ భక్తుడి మాటలివి. కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లలో శనివారం భక్తుల తాకిడి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఇవి నిదర్శనం. ముందుగా ఊహించినట్లుగానే పుష్కరాలకు వెళ్లే దారులన్నీ జిల్లావైపే మళ్లాయి. పొరుగు జిల్లాల, రాష్ట్రాల భక్తుల్లో అధికంగా జిల్లాలోని పుష్కర ఘాట్లకే విచ్చేశారు. ఏకంగా లక్షల సంఖ్యలో భక్తుల తాకిడి పెరగడంతో ఘాటన్నీ జనసంద్రాన్ని తలపించాయి. ఎటుచూసినా ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపించారు. చీమల దండు మాదిరిగా ప్రధాన పుష్కర ఘాట్లన్నింటి వద్దకు వాహనాలు బారులు తీరాయి.
 
  రాజీవ్హ్రదారి టోల్‌గేట్ల వద్ద వాహనాల రుసుం వసూళ్లు ఆలస్యం కావడంతో దాదాపు 20 కిలోమీటర్ల కొద్దీ వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. టోల్‌గేట్ల వద్దనున్న ప్రజల బాధలు వర్ణణాతీతం. శనివారం ఒక్కరోజే ఏకంగా 26 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక్క ధర్మపురిలోనే సుమారు 10 లక్షల మంది పుష్కర స్నానం చేశారు. కాళేశ్వరంలోనూ 7 లక్షల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమం వద్ద తనివీ తీరా స్నానాలు ఆచరించారు.
 
  కోటిలింగాలలో 2 ల క్షలు, మంథనిలో 1.25 లక్షల మంది పుష్కర స్నానాల్లో మునిగితేలారు. వాహనాలు పార్కింగ్  చేయడానికి స్థలం లేకపోవడం..దారి పొడవునా వాహనాలు ఆగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి పోలీసులది. వాహనాలను నియంత్రించేందుకు గంటల తరబడి చెమటోడ్చాల్సి వచ్చింది. ధర్మపురి, కాళేశ్వరంలో భక్తుల క్యూలైన్లు కిలోమీటర్ల కొద్దీ సాగారుు. దైవదర్శనం కోసం ధర్మపురిలో 6 గంటలు, కాళేశ్వరంలో 4 గంటలకుపైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 ధర్మపురి జనసంద్రమైన వేళ
 ధర్మపురి పుష్కరానికి శనివారం ఒక్కరోజే దాదాపు 10 లక్షల మంది తరలిరావడంతో వాహనాల రాకపోకలు గంటల తరబడి స్తంభించిపోయాయి. ధర్మపురికి వచ్చే వాహనాలు దాదాపు 25-30 కిలోమీటర్ల వరకు నిలిచిపోవడంతో వాహనాల్లో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధర్మపురికి వచ్చే రోడ్లను మూసివేసి ఒకే రోడ్డు గుండా స్నానఘట్టానికి వెళేల్లా చేయడంతో భక్తులు ఒక్కరికొకరు తోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
  కొత్త ప్రదేశాల నుంచి వచ్చిన జనమే ఎక్కువగా ఉండటంతో స్నాన ఘట్టాలు తెలియక ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ నీతూప్రసాద్, డీఐజీ మల్లారెడ్డి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిరంతరం అక్కడే ఉంటూ పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్‌రావు  ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ దంపతులు ధర్మపురిలో పుష్కర స్నానమాచరించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, పంబ పీఠాధిపతి గోవిందనంద సరస్వతీశర్మ, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు ధర్మపురిలో పుణ్యస్నానం చేశారు.
 
 కిక్కిరిసిన కాళేశ్వరం..
 శుక్రవారం రాత్రే వేలాది మంది భక్తులు కాళేశ్వరంలో బసచేసి శనివారం తెల్లవారుజామునే గోదావరి నది బాట పట్టారు. సెలవు దినం కావడంతో  రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రైవేటు, ఆర్టీసీ పార్కింగ్ నుంచి గోదావరి నది ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్ వరకు ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు.
 
 మధ్యాహ్నం 3గంటల వరకు సుమారు 6.25 లక్షల మంది స్నానాలు చేయగా, రాత్రి 8 గంటల వరకు ఆ సంఖ్య 7ల క్షలు దాటినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గోదావరి నదీ వరకు ఆటోలను అనుమతించగా రద్దీ పెరగడంతో వాటిని నిలిపివేశారు. మూడు గంటల పాటు ఏకదాటిగా నదికి వరదలా భక్తులు తరలిరావడంతో స్వల్పతోపులాట జరిగింది. భక్తుల తాకిడిని ముందే పసిగట్టిన ఓఎస్టీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ పౌసమిబసు శాంతిభధ్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.
 
  ఒకేసారి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో కాటారం నుంచి కాళేశ్వరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు ఆరు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతారావు సైతం మూడు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. పుష్కర స్నానాల అనంతరం అనేక మంది భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి సుమారు కిలోమీటర్ మేర రెండు వరుసల క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
 
 సాధారణ ద ర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ దష్ట్యా వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దీ చేశారు. జాయింట్ కలెక్టర్ పౌసమిబసు స్వయంగా వీఐపీ, సాధారణ దర్శనాల వద్ద బైఠాయించి పరిస్థితిని చక్కదిద్దారు. మంథనిలో 1.25 లక్షల మంది భక్తులు పుష్కర స్నానం చేశారు. పంప పీఠాధిపతి గోవిందనాథ సరస్వతీస్వామి, సంగారెడ్డి జిల్లా జడ్జి శాంతకుమారి, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ భగవాన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్.రాజం పుష్కరస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
  కోటిలింగాలలో
 2 ల క్షలు
 కోటిలింగాల పుష్కర ఘాట్లన్నీ శనివారం ఇసుకేస్తే రాలనంతగా మారాయి. ఏకంగా 2లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. సెలవు దినాల్లో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశముందని గ్రహించిన అధికారులు రాత్రికి రాత్రే కొత్త ఘాట్‌ను ఏర్పాటు చేశారు. గోదావరిఖని బ్రిడ్జి వద్ద పుష్కరఘాట్‌లో శనివారం 50 వేల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు. సమీపంలోని ఇంటెక్‌వెల్ వద్ద గల మరో పుష్కరఘాట్ వద్ద 15 వేల మంది పుష్కరస్నానమాచరించారు. రామగుండం మండల పరిధిలోని గోలివాడ పుష్కరఘాట్ వద్ద సుమారు ఐదు వేల మంది పుణ్యస్నానాలు చేశారు. శనివారం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పిల్లాపాపలతో భక్తులు అధిక సంఖ్యలో పుష్కరఘాట్లకు తరలివచ్చారు. ఆదివారం కూడా మరింత ఎక్కువ సంఖ్యలోనే భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు పుష్కరఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు.
 
 టోల్‌గేట్లు ఎత్తేస్తారా.... ధ్వంసం చేయాలా?
 బీజేపీ జిల్లా అధ్యక్షుడు అర్జున్‌రావు హెచ్చరిక
 గోదావరి మహా పుష్కరాలకు వచ్చే భక్తులంతా టోల్‌గేట్ల వద్ద నరకం కన్పిస్తోంది. వృద్ధులు, మహిళలు, బాలింతలు శనివారం అల్లాడిపోయారు. భక్తుల రద్దీ దృష్ట్యా పుష్కరాలు పూర్తయ్యేంతవరకు టోల్‌గేట్లను తక్షణమే ఎత్తివేయాలి. లేనిపక్షంలో టోల్‌గేట్లను ధ్వంసం చేసేందుకూ వెనుకాడం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement