మీ దరికి గోదావరి
సిద్దిపేట రూరల్ : స్థానికంగా నిర్మిస్తున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌కు గోదావరి నీళ్లు తీసుకొచ్చి.. ఇక్కడి ఆడ బిడ్డల కాళ్లు కడుగుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. శనివారం సిద్దిపేట, నంగునూరు మండలాల్లో హరితహారం కార్యక్రమాన్ని మంత్రులు జోగు రామన్న, హరీశ్‌రావులతో కలిసి ప్రారంభించారు. ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో నాడు చేపట్టిన తెలంగాణ దీక్ష శిబిరం వద్ద పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకతో పాటు ఐదు నియోజకవర్గాలకు సాగు నీరు అందనున్నట్లు తెలిపారు.
త్వరలో సిద్దిపేట జిల్లా కేంద్రం కానుందని, చుట్టు పక్కల ఉన్న మండలాలను కలుపుకుని సిద్దిపేట జిల్లాగా ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటి వరకు మెదక్‌ను జిల్లా అని పిలిచాం తప్పా... అసలు అక్కడ జిల్లా కేంద్రం లేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే మెదక్‌లో అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా రైల్వే లైన్ కోసం ఎదురు చూస్తున్న సిద్దిపేట ప్రజలకు తీపి కబురు అందనుందని, పనులు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లిన ఘనత సిద్దిపేటకు దక్కిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1500 రోజులకుపైగా దీక్షలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన ఘనత ఈ గడ్డకే దక్కిందన్నారు. వారి పోరాటాలను భావితరాలకు గుర్తు చేయాలనే సంకల్పంతో దీక్ష చేపట్టిన స్థలంలోనే వారిని కీర్తిస్తూ పైలాన్ ఆవిష్కరించామన్నారు.
హరితహారంలో ఆదర్శంగా నిలవండి...
హరితహారం కార్యక్రమంలో 100 శాతం మొక్కలను సంరక్షించి రాష్ర్టంలోనే సిద్దిపేటను ఆదర్శంగా నిలపాలని సీఎం పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో గ్రామానికి 40వేల మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టామని, మూడేళ్లలో 1.60లక్షల మొక్కలను ఒక గ్రామంలో నాటనున్నట్లు తెలిపారు. దీనిలో యువతతో పాటు గ్రామాల్లో సర్పంచ్‌లు కంకణబద్దులై మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేసిన నియోజకవర్గానికి రూ. 5కోట్ల నజరానా అందిస్తామని చెప్పారు. అది సిద్దిపేటకే దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
కనురెప్పపాటు కరెంట్ పోదు...
రాష్ట్రంలో కరెంట్ తిప్పలైతదని అందరూ అనుకున్నారని.. అసలు కనురెప్పపాటు కరెంట్ పోకుండా ఉండేందుకు మరో రెండేళ్లు పడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడేవారని 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వబోతున్నామన్నారు.
ఎక్కడికి పోయినా... ఈ ప్రేమ దొరకదు...
ఢిల్లీకి రాజైనా... తల్లికి కొడుకే అంటూ... సిద్దిపేటలో పుట్టి పెరిగిన గడ్డను విడిచి ఎక్కడికి పోయినా... ఈ ప్రేమ దొరకదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇక్కడి మట్టిలో పుట్టి, రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిని అయ్యాయనని, ఈ ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుందన్నారు. సిద్దిపేట మట్టిలో బలముందని ఏదైన అనుకుంటే సాధించే వరకు వదిలి పెట్టరని వర్ణించారు. ఇక్కడ మంచి నాయకుడు (హరీశ్‌రావును ఉద్దేశించి) ఉన్నాడని అద్భుతమైన పాలన అందిస్తాడని పొగిడారు.
కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, బాబూమోహన్, ఐజీ నవీన్‌చంద్, జెడ్పీచైర్‌పర్సన్ రాజమణి, వైస్ చైర్మన్ సారయ్య, కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఎస్పీ సుమతి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూక్‌హుస్సేన్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, ఫిలిం చాంబార్ చైర్మన్ రామకృష్ణాగౌడ్, సిద్దిపేట నాయకులు రాజనర్సు, చిన్నా, మల్లికార్జున్, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.