భద్రాచలం : పోలవరం ముంపు మండలాలకు ప్రమాదం పొంచి ఉంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం భద్రాచలం వద్ద 22 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, ఇది బుధవారం నాటికి 30 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు భావిస్తున్నారు. గోదావరి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వాజేడు మండలంలోని చీకుపల్లి వాగుకు నీరు పోటెత్తి రహదారి పైకి చేరింది.
దీంతో అవతల ఉన్న 25 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి పేరూరు వరకు వెళ్లే ఆర్టీసీ బస్సులను వాజేడు వరకే తిప్పుతున్నారు. గోదావరి నీటి ప్రవాహం తగ్గితేనే అవతలి గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉంది. అయితే పేరూరు వద్ద మంగళవారం సాయంత్రం 10 మీటర్ల నీటిమట్టం నమోదు కాగా, ఎగువన ఉన్న కాళేశ్వరం, ఇంద్రావతి, దిగువున్న ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి నీటికి కిందకు వదులుతుండటంతో గోదావరి నదిలో నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతోందని అధికారులు చెపుతున్నారు.
గోదావరిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఇసుక తిన్నెల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న జాలర్ల గుడిసెలు కొట్టుకుపోయాయి. ఊహించని రీతిలో నీటి ప్రవాహం రావటంతో అప్రమత్తంగా లేని జాలర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద వాగు పొంగటంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా మండల అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహం తగ్గేంత వరకూ వాగు దాటవద్దంటూ ప్రచారం చేశారు.
‘ముంపు’లో పొంచివున్న ముప్పు
Published Wed, Jul 23 2014 2:22 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement