
పరుగు.. పరుగున గోదారమ్మ
* దేవాదుల వద్ద 74 మీటర్లకు చేరిన నీటి మట్టం
* పంపింగ్‌కు మోటార్లు సిద్ధం
ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలం దేవాదుల వద్ద గోదావరి నీటి మట్టం గురువారం 74 మీటర్లకు చేరుకుంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు వస్తోంది. దేవాదుల వద్ద జె.చొక్కారావు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా నిర్మించిన ఇన్‌టేక్‌వెల్‌లోకి నీరు చేరుకుంటోంది. దేవాదుల ప్రాజెక్టులోని నాలుగు మోటార్లు రన్ కావడానికి 72 మీటర్ల నీటి మట్టం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం నీరు 74 మీటర్లు ఉన్నందున ఇరిగేషన్ అధికారులు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. నీరు విడుదలైతే తపాస్‌పల్లి, భీంఘన్‌పూర్, ధర్మసాగర్ రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటారుు. అయితే మోటార్లను రన్ చేయడానికి ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాసినట్టు డీఈఈ చిట్టిరావు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మోటార్లను రన్ చేస్తామన్నారు.