చాక్లెట్ బాక్సుల్లో గోల్డ్ స్మగ్లింగ్
ఫాయిల్స్ రూపంలోకి మార్చి తెచ్చిన స్మగ్లర్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు చాక్లెట్ బాక్సుల్లో ఫాయిల్స్ రూపంలో తెచ్చిన బంగారా న్ని గురువారం స్వాధీనం చేసు కున్నారు. అబుదాబి నుంచి వస్తున్న ఓ స్మగ్లర్ దాదాపు అర కేజీ బంగారాన్ని ఫాయిల్స్ రూపంలోకి మార్చి మూడు బాక్సుల్లో అమర్చి తీసుకువచ్చాడు. అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఈ తరహాలో స్మగ్లింగ్ ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు కేంద్రంగా ఎక్కువగా జరుగుతుందని, శంషాబాద్‌లో చిక్కడం అరుదని అధికారులు చెప్తున్నారు.
ఓ వ్యక్తి గురువారం ఉదయం జెట్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో (నం.9డబ్ల్యూ549) శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడనే అనుమానంతో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఏమీ లభిం చకపోవడంతో లగేజ్‌ను తనిఖీ చేయగా.. రెండు చాక్లెట్ బాక్సులు, మరో ఫేస్‌క్రీమ్ బాక్సు లభించాయి. వాటిని తెరిచి చూడగా సాధారణ వస్తువులే కనిపించాయి.
అయితే ఈ బాక్సుల అడుగు, గోడలు కాస్త మందంగా ఉండటంతో వాటిని పూర్తిగా ఖాళీ చేసి పరిశీలించారు. ఈ నేపథ్యంలో బంగారాన్ని ఫాయిల్స్ రూపంలోకి మార్చి, ఆ గోడలకు అమర్చడంతో పాటు దానిపై గమ్ పేపర్‌తో మరో పొర ఏర్పాటు చేశారని గుర్తించారు. మూడు బాక్సుల్లో ఉన్న ఫాయిల్స్ 423 గ్రాముల బరువు ఉన్నాయని, వీటి ధర రూ.12.09 లక్షలుగా అధికారులు నిర్థారించారు. స్మగ్లర్‌ను అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు దీని వెనుక ఏదైనా ముఠా ఉందా? సూత్రధారులు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.