
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ఘనంగా ముగిసింది. ప్రధాని మోదీ, అమెరికా సలహాదారు ఇవాంక, దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, అతిరథ మహారథులు పాల్గొన్న సద స్సు మూడ్రోజులపాటు కన్నుల పండువగా జరిగింది. గురువారం సదస్సు ముగింపు సందర్భంగా అమెరికా ప్రభుత్వం గచ్చిబౌలిలోని నోవాటెల్ హోటల్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. సదస్సు మొదటి రోజు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్రం విందు ఏర్పాటు చేయగా, రెండోరోజు తెలంగాణ రుచులతో గోల్కొండ కోటలో రాష్ట్ర సర్కారు విందు ఇచ్చింది.
మూడోరోజు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో వివిధ దేశాలకు చెందిన వంటకాలు, వెరైటీ రుచులు అతిథుల నోరూరించాయి. 150 దేశాలకు చెందిన 1,500 మందికిపైగా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ విందును అమెరికాకు చెందిన ఈవెంట్ మేనేజర్లే నిర్వహించారు. పిజ్జా, బర్గర్‌లతోపాటు చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్, కరీబియన్ వంటి వందలాది రకాల వంటకాలు వడ్డించారు. చికెన్, మటన్‌లో రకరకాల వెరైటీలు చేశారు.
బ్రెడ్‌లో బట్టర్, నాన్ బట్టర్ తదితర పలు రకాలను రుచి చూపించారు. చికెన్ ఫ్రెంచ్, చికెన్ ఫ్రైడ్ బేకన్, చికెన్ ఫ్రైడ్ స్టీక్స్, క్లేమ్ కేక్, క్రాజ్ కేక్, ఎగ్ బెనెడిక్ట్, ఫ్రైడ్ ఫిష్, మకరాని సలాడ్, మెక్సికన్ గ్రిల్డ్ కార్న్, ఆవోకాడో మెలాన్, పాస్తా సలాడ్, పిజ్జా స్టిప్స్, రోల్డ్ ఓయిస్టర్, శాండ్‌విచ్ బ్రెడ్, వంటివి అతిథులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ బిరియానీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మొఘలాయి, నిజాం రుచులు ఘుమఘుమలాడగా, రెండో రోజు గోల్కొండ కోటలో తెలంగాణ రుచులు నోరూరించాయి. చివరిరోజు విదేశీ రుచులు అతిథులను మైమరిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment