మెట్రో పనులైనా, పోలవరం ప్రాజెక్ట్ పనులైనా డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదలయ్యాయన్న వాస్తవం ఎట్లా మరచిపోతారు? రాజకీయ పార్టీలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక కల సాకారమైన సమయంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది మా గొప్పే అనుకుంటే ఎట్లా? మరింత ఆలస్యం జరగకుండా ఆ మిగిలిన పనులు సత్వరం పూర్తి అయ్యేటట్టు చూసి మెట్రోను పరుగులు పెట్టిస్తే కార్పొరేషన్‌లో గెలిపించినందుకు వారి రుణం తీర్చుకున్నట్టయినా ఉంటుంది.
ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సభలు (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్–జీఈఎస్) ముగిశాయి. హైదరాబాద్ సౌందర్యానికీ, తెలంగాణ ప్రభుత్వ ఆతిథ్యానికీ విదేశీ ప్రతినిధులంతా మురిసిపోయారు. ఆ జ్ఞాపకాలను మూటగట్టుకుని తిరిగివెళ్లారు. ఏ మహా నగరానికైనా కొంచెం మరమ్మతు కావాలనుకుంటే అప్పుడప్పుడు ఇటువంటి ప్రపంచ స్థాయి సంబ రాలు అవసరమే.
ఇప్పుడు జరిగింది పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన సదస్సు కాదు. దీని కారణంగా నూతన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు వచ్చిపడవు కూడా. ఆయా దేశాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుని, తాము లాభం పొందేందుకు అవకాశం కలిగించే వేదికగా ఈ సదస్సును నిర్దేశించారు. ఏదయితే ఏమి, ఎనిమిదవ జీఈఎస్‌కు దక్షిణ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణ వాసులందరికీ సంతోషం కలిగించే విషయమే.
ఇది అమెరికన్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో కలసి ఏర్పాటు చేసిన సదస్సు. ఈ మూడురోజుల సదస్సు ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించవలసి రావడం అనివార్యం. అందునా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ముఖ్య అతిథిగా హాజరైన సభలకు మనం హైదరాబాద్‌ను వీలయినంత అందంగా తయారు చెయ్యడం అవసరమే. ఇవాంక పర్యటించే అవకాశం ఉన్న ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసింది. బిచ్చగాళ్లందరినీ ఆ మూడురోజులూ ఎవరికంటా, ముఖ్యంగా ఇవాంక తదితర విదేశీ అతిథుల కంట పడకుండా దాచెయ్యగలిగాం. నగరాన్ని సుందరంగా అలంకరించాం. ఈ సభలు ఆశించిన ఫలితాలు సాధిం చాయా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుందేమో కానీ తక్షణ ఫలితం, అందునా తెలంగాణ రాష్ట్రానికి ఒనగూడింది మాత్రం మన రాష్ట్ర యువ మంత్రి కేటీ రామారావుకు అమెరికా సందర్శన కోసం స్వయంగా ఇవాంక నుంచి ఆహ్వానం అందడం. సదస్సులో ఒక గోష్టికి ఆయన సంధానకర్తగా వ్యవహరించి అందరి చేతా శభాష్ అనిపించుకోవడం. ఐటీ అంటేనే ఇవాంకా ట్రంప్ అని మన యువ ఐటీ మంత్రిగారు కొత్త నిర్వచనం చెప్పిన తరువాత అమెరికా సందర్శనకు ఆయనకు ఆ మాత్రం ఆహ్వానం రాకుండా ఎట్లా ఉంటుంది? ఈ సదస్సు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇంతకు మించి ఏమైనా లాభం జరిగి ఉంటే ప్రభుత్వం వారో, ఈ రంగంలో నైపుణ్యం కలవారో చెప్తే అర్థం చేసుకుని రాష్ట్ర ప్రజలు కూడా ఆనందిస్తారు.
చాలాకాలం బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉన్నందుకేనేమో మనలో ఇంకా బానిస మనస్తత్వం అంతరించలేదు. అతిథి మర్యాదలకు లోటు చెయ్యని సంస్కారం, సంప్రదాయం మన సొంతమైనా ఆ అతి«థి మర్యాదలు అతిగా మారి మన బానిసత్వ లక్షణాలను బయట పెడుతుంటాయి. మొన్న ముగి సిన ఈ అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడి కూతురికి మనం చేసిన మర్యాదలు ఆ కోవలోకే వస్తాయి.
పేదరికాన్ని దాచగలిగామా!
సరే, సభలు ముగిశాయి. మన పేదరికాన్ని దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా మాయమైన బిచ్చగాళ్లు ఎక్కడున్నారో వెతుక్కోవాలి ఇప్పుడు. బహుశా ఇప్పటికే మళ్లీ రోడ్ల మీదకు వచ్చేసి ఉంటారు. విదేశీ అతి థుల ముందు మన పేదరికాన్ని తాత్కాలికంగా దాచిపెట్టుకునే ప్రయత్నానికి బదులు దాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తే ఎవరైనా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. అది జరగదు. మన ప్రయత్నాలు బిచ్చగాళ్లను నిర్మూలిం చడం కాకుండా, భిక్షాటనను నిర్మూలించే దిశగా సాగాలి. చివరి మనిషి కూడా పేదరికం నుంచి బయటపడ్డ నాడు బంగారు తెలంగాణ సాధించామని చెబితే ఆ ప్రభుత్వాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. హైదరాబాద్ నగరంలో భిక్షాటన ఒక వ్యాపారంగా మారిందని, దిక్కూ మొక్కూ లేనివాళ్లను, ఎందరో పసివాళ్లను తెచ్చి రోజంతా రోడ్ల మీద అడుక్కునేటట్టు చేసి, వాళ్లు సంపాదించినదంతా దోచుకుపోతున్న ఒక మాఫియా పని చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదంటే ఆశ్చర్యమే. అద్భుతంగా పని చేసిందని అమెరికా పోలీసుల ప్రశంసలు అందుకున్న హైదరాబాద్ పోలీసుల దృష్టి ఇటువంటి నేర సామ్రాజ్యాల మీద పడకపోవడాన్ని ఎట్లా చూడాలి?
పోలీసులు అత్యుత్సాహం
కొలువుల కొట్లాట కోసం కలిసి మాట్లాడుకుంటామని కోర్టుల అనుమతి కూడా పొందిన వారిని సభలకు పోకుండా అడ్డుకోవడానికి అరెస్టులు చెయ్యడం, తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆవేదన చెందుతున్న యువకులను ఉస్మానియా హాస్టల్ గదుల తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లి చావగొట్టి అరెస్టులు చెయ్యడం, కవరేజీకి పోయిన విలేకరులను అరెస్ట్ చేసి ఠాణాలో గంటల తరబడి కూర్చోబెట్టడం వంటి పనుల్లో తీరిక లేకుండా ఉన్న మన పోలీసులకు రోడ్ల మీద అడుక్కునే వాళ్ల వెనుక ఉన్న మాఫియాను పసిగట్టే సమయం ఎక్కడుంది? ఇవాంక పర్యటన తరువాత అయినా మన ప్రభుత్వం, పోలీసు పెద్దలూ ఈ మాఫియాను ఛేదించి, ఆ పేదలకు విముక్తి కలి గించి పునరావాసం కల్పించే ఆలోచన చేస్తే బాగుంటుంది. పేదరికాన్ని పారదోలుతాం, రాష్ట్రాన్ని బంగారం చేస్తామని పదే పదే ప్రకటించుకునే పాలకులు ఈ వైపు ఆలోచించాలి. అదెట్లా కుదురుతుంది? భిక్షాటన నిర్మూలిం చడం అయ్యే పనేనా అని ఎవరయినా అంటే మన ప్రభుత్వంలోనే ప్రస్తుతం కార్యదర్శి స్థాయిలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం సలహా తీసుకోవచ్చు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతల సహాయం తీసుకుని ఎక్కడికక్కడ షెల్టర్‌లు ఏర్పాటు చేసి రోడ్ల మీద బిచ్చగాళ్లు కనిపించకుండా చేశారు. అన్ని జిల్లాల్లో ఇటువంటి ప్రయత్నం జరగాలి. జిల్లాల అధికారులకు వదిలేయకుండా ప్రభుత్వమే తన పాలనలో భాగంగా గట్టి నిర్ణయాలు చేస్తే తప్ప ఇటువంటివి సాధ్యం కావు. ఒక్క మనిషి ఆకలితో అలమటిస్తున్నా, ఒక్క మనిషికి శరీరం నిండా కప్పుకోడానికి బట్టలు లేకపోయినా అది సంక్షేమ రాజ్యం అనిపించుకోదు. ఈ నెలలోనే భాషను ఉద్ధరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా చాలామంది విదేశీ ప్రతినిధులు వస్తున్నట్టున్నారు. మన ప్రతిష్ట నిలుపుకోడానికి మళ్లీ మన వీధుల్లో బిచ్చగాళ్లు మాయమవుతారేమో!అంతర్జాతీయ స్థాయిలో మనకు ప్రతిష్ట తెచ్చే సభలు, మన భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సమావేశాలు ప్రభుత్వాలు పూనుకుని నిర్వహించడం తప్పుకాదు. మానవీయ కోణం లోపించిన ఇటువంటి కార్యక్రమాలన్నీ సువాసన లేని ప్లాస్టిక్ పువ్వుల వంటివే.
ఇంతకీ మెట్రో ఘనత ఎవరిది?
జీఈఎస్ సభల పుణ్యమా అని హైదరాబాద్ మెట్రో రైల్ 30 కిలోమీటర్ల పరుగుకూడా ప్రారంభం అయింది. అంతర్జాతీయ సభలకు హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను ఉపయోగించుకుని తెలంగాణ ప్రభుత్వం మియాపూర్ నుంచి నాగోల్ దాకా మొదటి దశ మెట్రో రైల్ సౌకర్యాన్ని ఆయన చేత ప్రారంభింప చేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంలో తీవ్రమైన జాప్యానికీ, వేల కోట్ల అదనపు వ్యయానికీ కారణమైన తెలంగాణ రాష్ట్ర సమితి, దాని నాయకుడు చంద్రశేఖరరావు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కారణంగా ఆ ఘనత తమదేనని చెప్పుకోవడం హాస్యాస్పదం. మెట్రో రైల్ మార్గం శాసనసభ ముందు నుంచి పోతే ఆ భవన సముదాయం అందం పోతుందన్న ఉద్యమకారుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మెట్రో రైల్ కల సాకారం చేసిన ఘనత తనకే దక్కాలంటున్నారు. సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో వెళితే రక్తాలు పారుతాయన్న ఉద్యమకారుడు కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చినందునే అది సాధ్యపడిందని అంటున్నారు. ఇక్కడ మెట్రో పనులైనా, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్ట్ పనులైనా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదలయ్యాయన్న వాస్తవం ఎవరైనా ఎట్లా మరచిపోతారు? రాజకీయ పార్టీలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక కల సాకారమైన సమయంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది మా గొప్పే అనుకుంటే ఎట్లా? మరింత ఆలస్యం జరగకుండా ఆ మిగిలిన మార్గాల్లో కూడా పనులు సత్వరం పూర్తి అయ్యేటట్టు చూసి మెట్రోను పరుగులు పెట్టిస్తే హైదరాబాద్ నగరవాసులు కార్పొరేషన్‌లో 99 సీట్లలో గెలిపించినందుకు వారి రుణం తీర్చుకున్నట్టయినా ఉంటుంది.
కొంచెం రాజకీయ సందడి
ఈ సందడిలో కొంచెం రాజకీయం కూడా నడిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో భారతీయ జనతా పార్టీశ్రేణులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. అక్కడ ఆయన హైదరాబాద్‌ను విముక్తం చేసినందుకు సర్దార్ పటేల్‌ను, తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను జ్ఞాపకం చేసుకున్నారు. ఉద్యమ కాలం నుంచి, మొన్నటికి మొన్న శాసనసభ వేదిక మీద మాట్లాడే వరకూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిజాం రాజును కీర్తిస్తున్న తీరుకు జవాబుగా మోదీ అన్న మాటలు చాలా మందికి అర్థమయ్యాయి. ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలను ప్రధానమంత్రి తన వెంట తీసుకుపోయిన తీరు కూడా చర్చనీయాంశమైంది. కార్యకర్తల సమావేశంలో మోదీ మాటలు తెలుగు రాష్ట్రాల్లో సమీప భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చే ఆశలను వదులుకున్నట్టు స్పష్టం చేశాయి.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
Comments
Please login to add a commentAdd a comment