కాంగ్రెస్‌కు ప్రతాప్ గుడ్‌బై
- గులాబీవైపు చూపు
కాంగ్రెస్‌కు రాంరాం చెప్పిన ప్రతాప్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ గురువుగా భావించే డీఎస్ కూడా గులాబీ గూటికి చేరినందున తాను కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానానికి కూడా సంకేతాలు పంపిన ప్రతాప్.. చేరికకు ముహూర్తం ఖరారు చేసుకోవడంలో తలమునకలయ్యారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ సీనియర్ నేత, డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వ్యవహారశైలిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖను ఫాక్స్‌లో పంపారు. 2014 శాసనసభ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ టికెట్‌ను ఆశించి భంగపడిన ఆయన ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అదేసమయంలో డీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ హైకమాండ్ వ్యవహరించిన తీరుతో నొచ్చుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో విసుగుచెందిన ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా రెండుసార్లు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలకంగా వ్యవహరించానని ప్రతాప్ అన్నారు. రాజీనామా లేఖను పంపిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ప్రతాప్.. కాంగ్రెస్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చారని విమర్శించారు. గతేడాది తనకు టికెట్‌ను ఎందుకు నిరాకరించారో కారణం చెప్పాలని పలుమార్లు ఏఐసీసీకి లేఖ రాసినా స్పందించలేదన్నారు. కేవలం పైరవీకార్లకు, దళారీలకే కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపించారు.