రైలులో జిల్లాకు చేరిన యూరియాను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారి గోవింద్
సాక్షి, నిజామాబాద్: అన్నదాతల ఇక్కట్లు తొలగి పోనున్నాయి. యూరియా కష్టాలు తీరనున్నాయి.. జిల్లాలో కొద్ది రోజులుగా యూరియాకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎరువు కోసం రైతులు సొసైటీల వద్ద బారులు తీరి నానా తిప్పలు పడ్డారు. అయితే, యూరియా కొరత తీర్చేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. తాజాగా ఆదివారం జిల్లాకు 2,551 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. రైలు వ్యాగన్లలో వచ్చిన ఎరువు బస్తాలను గ్రామాలకు పంపిస్తున్నారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకుని అన్ని సొసైటీలకు లారీల్లో సరఫరా చేశారు. జిల్లాలో ని 90 సొసైటీలకు ఇప్పటికే ఎరువు బస్తాలు చేరుకున్నాయి. సోమవారం నుంచి రైతులకు ఎరువు బస్తాలు అందజేయనున్నారు.
ఆందోళన వద్దు..
యూరియాకు ఎక్కడా కొరత రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ అధికారులకు సూచించారు. రైలులో వచ్చిన స్టాక్‌ను సొసైటీలకు తరలించే ప్రక్రియను ఆయన ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ.. యూరియా సరఫరా పూర్తి కాకముందే అవసరం మేరకు ఇండెంట్ పెట్టాలని అధికారులకు సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో మరోసారి జిల్లాకు యూరియా స్టాక్ వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల మేర ఎరువులు జిల్లాకు వస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని డీఏవో వివరించారు. రైతులకు సరిపడా ఎరువును సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రవాణాలో జాప్యం జరగడం వల్ల కొంత సమస్య ఏర్పడిందని చెప్పారు. ఇక మీదట ఆ సమస్య ఉండబోదని, రైతులకు సరిపడా ఎరువులను సొసైటీలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment