- టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ షురూ
- 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
- 5 నుంచి 16 వరకు బదిలీలు, పదోన్నతులు
- 249 మందికి పదోన్నతి
- జిల్లాలో 350 వరకు మిగులు పోస్టులు
ఆదిలాబాద్ టౌన్ : మూడేళ్లుగా బదిలీలు, పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎట్టకేలకు పదోన్నతులు లభించనున్నాయి. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బదిలీలకు సంబంధించిన ఖాళీలను సోమవారం ప్రకటించాల్సి ఉండగా.. సాయంత్రం వరకు అధికారులు ఖాళీలు ప్రకటించలేదు. ఇందుకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు, ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఖాళీలకు సంబంధించిన తుది జాబితాను ఈ నెల 26న ప్రకటించనున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28, 29వ తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, 30న సీనియార్టీ జాబితా విడుదల చేయాల్సింది. జూలై 1న అభ్యంతరాల స్వీకరణ, 2, 3వ తేదీల్లో అభ్యంతరాలపై విచారణ చేపడుతారు. జూలై 4న చివరి సారిగా ఖాళీల ప్రకటన చేయనున్నారు. 5న ప్రధానోపాధ్యాయుల బదిలీ ప్రక్రియ, 7 నుంచి 9 వరకు స్కూల్ అసిస్టెంట్, ఎల్‌ఎఫ్‌ఎం హెచ్‌ఎంల బదిలీలు, 12 నుంచి 16 వరకు ఎస్జీటీల బదిలీలు నిర్వహించనున్నారు. కాగా, బదిలీ కొరుకునే ఉపాధ్యాయులకు కనీస అర్హత రెండేళ్లుగా నిర్ణయించారు. ప్రధానోపాధ్యాయులకు గరిష్ట కాలం ఐదేళ్లు, ఇతర కేటగిరీల ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లుగా నిర్ణయించారు. జిల్లాలో దాదాపు 2 వేల మందికి స్థాన చలనం జరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
249 మంది టీచర్లకు పదోన్నతులు..
జిల్లాలో 249 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి లభించన్నుట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. జూలై 6న స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభించనుంది. ఎస్జీటీ కేటగిరీలో ఉపాధ్యాయులకు 10, 11వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ప్రక్రియ చేపట్టనున్నారు.
మిగులు పోస్టులు..
ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ జీవో ప్రకారం జిల్లాలో 350 వరకు ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా ఉన్నాయి. 0 నుంచి 30 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయున్ని మాత్రమే ఉంచి మిగిత పోస్టులను విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలకు బదిలీ చేయనున్నారు. 50 మంది విద్యార్థుల సంఖ్య కన్న తక్కువ ఉన్న పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. దీంతో ప్రాథమిక పాఠశాల పరిస్థితి అధ్వానంగా మారనుంది. పేద విద్యార్థులకు అన్యాయం జరగనుంది.