బినామీలుగా మారితే సమస్యలే!
• ఎవరి ఆస్తులకు, డబ్బులకు వారే లెక్కచెప్పాల్సుంటుంది
• ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్ ఓంకారేశ్వర్
సాక్షి, కరీంనగర్: ఎవరి ఆస్తులు, డబ్బులు వాళ్ల ఖాతాలోనే వేసుకోవాలని, ఇతరుల ఆస్తులకు, లావాదేవీలకు బినామీగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్.ఓంకారేశ్వర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో రూ. 500, 1000 నోట్ల రద్దు గురించి మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. నల్లడబ్బు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మనదేశంలో కరెన్సీ మొత్తం రూ.17 లక్షల కోట్లు ఉండగా, ఇందులో రూ. 14.5 లక్షల కోట్లు 500, 1000 రూపాయల నోట్ల రూపంలో ఉన్నాయన్నారు.
ఇప్పటివరకు రూ. 6 లక్షల కోట్లు డిపాజిట్ కాగా రూ. 1.5 లక్షల కోట్లు మళ్లీ విత్‌డ్రా రూపంలో ప్రజలకు చేరుకున్నాయన్నారు. ఇంకా 9.5 లక్షల కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డిపాజిట్ అరుున డబ్బులకు వారే లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన అన్ని లావాదేవీలు జరిపినట్లు రుజువుచేసుకోవాలని వాటి ద్వారా వచ్చే లాభాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విదేశాల్లో ఉన్న బ్లాక్‌మనీ నిల్వలున్న వారు వారంతట వారే రూ. 7 వేల కోట్లు చెల్లించారని, సెప్టెంబర్, 2016 వరకు ఇన్‌కం డిక్లరేషన్ స్కీం ద్వారా 70 వేల కోట్లు వచ్చిందని తెలిపారు. 25 లక్షల కోట్ల జనధన్ అకౌంట్లుండగా వాటిలో రూ. 21 వేల కోట్లు వచ్చి పడ్డాయన్నారు. జనధన్ ఖాతాల ద్వారా రూ. 50 వేలు మాత్రమే వేసుకోవచ్చని అంతకు మించి డబ్బులుంటే వాటికి లెక్కచూపించాలన్నారు.