అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ శిరీష
వికారాబాద్ అర్బన్: పోలీసు ఉద్యోగాల కోసం ఇచ్చే ఉచిత శిక్షణకు మంచి స్పందన వస్తోందని వికారాబాద్ డీఎస్పీ శిరీష తెలిపారు. సోమవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన అభ్యర్థుల ఎంపికను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ సహకారంతో ఎస్పీ అన్నపూర్ణ ఆదేశంతో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
సోమవారం అన్ని ఠాణాల్లో శిక్షణ తీసుకునే అభ్యర్థుల పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తాము ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన అభ్యర్థుల నుంచి వస్తోందని చెప్పారు. సోమవారం వికారాబాద్ పీఎస్ పరిధిలో 295మంది యువకులు, 51మంది యువతులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 7వ తేదీ వరకు అవకాశం ఉండటంతో దరఖా స్తు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులకు అప్పటికప్పుడు ఎత్తు, సర్టిఫికెట్లను పరిశీలన చేశామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఎంపికైన అభ్యర్థులు 8న తమ తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి రావాలని చెప్పారు.
బషీరాబాద్(తాండూరు): కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోవడానికి నిరుద్యోగ యువకులు బారులు తీరారు. సోమవారం జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో యువకులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజు బషీరాబాద్ మండలంలో 30 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి మొదటగా పోలీసులు శరీర కొలతలు తీసుకున్నారు. అర్హులైన యువకుల పేర్లను ఎస్పీ కార్యాలయానికి పంపిస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది రాంచందర్, శ్రీనివాస్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి పీఎస్‌లో 110 దరఖాస్తులు
పరిగి: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల ఉచిత శిక్షణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పరిగి పోలీస్ స్టేషన్‌లో మొదటిరోజు సోమవారం 110 మంది యువకులు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు ముందస్తుగా ఛాతీ, ఎత్తు కొలతలు పరిశీలించిన తర్వాతే దరఖాస్తులు తీసుకున్నారు. ఎస్‌ఐ కృష్ణ ఆధ్వర్యంలో దరఖాస్తుల ప్రక్రియ రోజంతా కొనసాగింది. శిక్షణ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఐ తెలిపారు. శిక్షణ ఇచ్చిన తర్వాత శారీరక కొలతలు సరిపోకపోతో అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉండటంతో పాటు సమయం వృథా అవుతుందని, అందుకే ముందస్తుగానే కొలతలు పరిశీలించి దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment