- సొంత శిక్షణా కేంద్రం ఏర్పాటుపై లక్ష్మణ్ వ్యాఖ్య
- మంచి ఫలితాలు సాధిస్తామన్న మాజీ క్రికెటర్
సాక్షి, హైదరాబాద్: అకాడమీ ఏర్పాటు చేసి భవిష్యత్తు క్రీడాకారులను తయారు చేయాలన్న తన కోరికకు బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ ప్రేరణగా నిలిచాడని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. అతనిలాగే తాను అంకిత భావంతో పని చేసి ఫలితాలు సాధిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘గతంలో ఎంతో మంది ఆటగాళ్లు అకాడమీలు ఏర్పాటుచేసి సరైన ఫలితాలు రాబట్టడంతో విఫలమయ్యారు. కానీ పుల్లెల గోపీచంద్ మాత్రం ఎంతో పట్టుదలతో, అంకితభావంతో పని చేసి ఈ రంగంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. అదే నాకు స్ఫూర్తినిచ్చింది.
బ్యాడ్మింటన్‌లో అతని అకాడమీ ద్వారా ఎంత మంది స్టార్లు వెలుగులోకి వచ్చారో అదే తరహాలో నా క్రికెట్ అకాడమీ నుంచి విజయాలు దక్కాలని ఆశిస్తున్నా’ అని లక్ష్మణ్ అన్నాడు. ఏప్రిల్ 4న వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించనున్న నేపథ్యంలో లక్ష్మణ్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. తాను అకాడమీ ఏర్పాటు కోసం ఎలాంటి మౌలిక సౌకర్యాల గురించి ఆలోచించానో, అవన్నీ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌లో సిద్ధంగా ఉండటంతో వెంటనే ప్రారంభిస్తున్నట్లు ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు. నగరంలో శిక్షకులుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న అశోక్ సింగ్, విన్సెంట్ వినయ్ కుమార్, రమేశ్ ఈ అకాడమీలో ప్రధాన కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించనుండగా మరికొందరు యువ కోచ్‌లు సహకరిస్తారు. ఏప్రిల్ 4 నుంచి మే 31 వరకు రెండు నెలల పాటు ఇక్కడ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఉదయం ఒక సెషన్, సాయంత్రం మరో సెషన్ నిర్వహిస్తుండగా.. ఒక్కో సెషన్‌లో వంద మంది వరకు శిక్షణకు అవకాశం ఉంది. ఇందు కోసం రూ.10 వేల చొప్పున ఫీజు నిర్ధారించారు.
అత్యుత్తమ సౌకర్యాలతో...
దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీనిధి స్కూల్ మైదానంలో 3 టర్ఫ్ వికెట్లు, 2 ఆస్ట్రోటర్ఫ్ వికెట్లు, 2 మ్యాటింగ్ వికెట్లు, 2 సిమెంట్ వికెట్లు ఉన్నాయి. లక్ష్మణ్‌తో అకాడమీ ఏర్పాటు గురించి నాలుగేళ్ల క్రితమే చర్చించామని, ఇప్పుడు అది సాకారం అయిందని ఈ సందర్భంగా శ్రీనిధి చైర్మన్ డాక్టర్ మహి చెప్పారు. ఆర్థికంగా లాభదాయకం కాకపోయినా క్రికెట్‌పై ఉన్న అభిమానంతోనే వీవీఎస్ దీనిని ప్రారంభిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతోపాటు పలువురు మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు.
గోపీచంద్ అకాడమీనే స్ఫూర్తి!
Published Thu, Mar 12 2015 12:04 AM | Last Updated on Wed, Oct 3 2018 7:14 PM
Advertisement
Advertisement