సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొత్త రాష్ట్రం వచ్చింది. పాలకులు మారారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలవుతోంది. కానీ అవే సమస్యలు ఏళ్ల తరబడి జిల్లాను వెంటాడుతూనే ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు... తాగునీటి కటకట షరా మామూలే. గతంలో ఎన్నడూ లేనంతంగా ఈసారి భూగర్భ నీటిమట్టం దారుణంగా పడిపోయింది. ఏ నియోజకవర్గంలో చూసినా నీళ్ల కోసం బారులు తీరే జనాలే కన్పిస్తున్నారు. దీనికితోడు అన్నపూర్ణగా విలిసిల్లిన కరీంనగర్ జిల్లాను నేడు కరవు ఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్‌ను కరవు జిల్లాగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల సంగతి చెప్పనక్కర్లేదు. ఎల్లంపల్లి, మధ్యమానేరు, గౌరవెల్లి, తోటపల్లి వంటి ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఆయా ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు నేటికీ పూర్తిస్థాయిలో సహాయ, పునరావాస కార్యక్రమాలు జరగలేదు. కరీంనగర్ ను అద్దంలా మార్చి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్దిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు... ఇంకా ఆచరణలోకి రాలేదు.
జిల్లాలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని నిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుమన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాను సందర్శించినప్పుడు ఇచ్చిన పలు హామీలు ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో నేటినుంచి జరగబోతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కోరుతోంది.
గళమెత్తే వారెవరు?
జగిత్యాల శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి మినహా జిల్లాలో మిగిలిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వాళ్లే. అందులోనూ ఇద్దరు మంత్రులు ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా, వొడితెల సతీష్‌కుమార్ పార్లమెంటరీ కార్యదర్శిగా, రసమయి బాలకిషన్ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
శాసనసభలో అధికార పార్టీదే హవా కాబట్టి పాలక పార్టీ సభ్యులు జిల్లా సమస్యలపై ఏ విధంగా స్పందిస్తారు? అధిక నిధులు రాబడతారా? జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కార మార్గాలను అసెంబ్లీ వేదికగా చూపుతారా? లేదా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో అసెంబ్లీని వేదికగా చేసుకుని జిల్లా సమస్యలను పరిష్కరించడంలో ఎవరు ముందుంటారనేది వేచిచూడాలి. సీఎల్పీ ఉపనేతగా వ్యవహరిస్తున్న టి.జీవన్‌రెడ్డికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం శాసనసభ వేదికగా దక్కే అవకాశం ఉన్నందున జిల్లా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జనం కోరుతున్నారు.
ముందే మేల్కొన్నా... ఆచరణ ఏది?
జిల్లాలో భూగర్భ నీటిమట్టాలు పూర్తిగా పడిపోవడంతో ఈసారి వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం ముందుగానే గ్రహించింది. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జనవరిలోనే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎండాకాలంలో ఇకపై బిందెలు చేతపట్టుకుని రోడ్డుపైకి మహిళలు రాకూండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తగిన నిధులూ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాల్లేవు. జిల్లాలో ఎటు చూసినా మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కుతూనే ఉన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తూనే ఉన్నారు. జిల్లా అంతటా కరవు ఛాయలు అలుముకోవడంతో కరీంనగర్‌ను కరవు జిల్లాగా ప్రకటించాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన నిధులు కేటాయించాలని, జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని జిల్లా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
సా...గనిస్తారా? పూర్తి చేస్తారా?
ఇక జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయినా.. ఎత్తిపోతల పనులు పెండింగ్‌లో ఉండటంతో రాబోయే ఖరీఫ్ నాటికి నీరందించాలనే లక్ష్యం నెరవేరేలా లేదు. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పరిధిలో మిడ్‌మానేరు ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించినా పనుల్లో పురోగతి మాత్రం కన్పించడం లేదు.
2017 ఖరీఫ్ నీటి అందించి తీరుతామనే హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. సహాయ, పునరావాసం కోసం భూ నిర్వాసితులు నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టుల సంగతి చెప్పనక్కర్లేదు. నిధుల సమస్య వెంటాడుతోంది. పరిహారం చెల్లించలేదు. ఈ బడ్జెట్‌లోనైనా తగిన నిధులు కేటాయించేలా ఒత్తిడి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
సీఎం హామీలకు బడ్జెట్‌లో చోటు దక్కేనా?
కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో గత ఆగస్టు 8న జిల్లాలో పర్యటించిన సందర్భంగా అనేక హామీలు గుప్పించారు. కరీంనగర్ సిటీని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణం చుట్టూ రింగురోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ప్రధానాసుపత్రిని నిమ్స్ స్థాయిలో తీర్దిదిద్దుతామన్నారు. పెద్దపల్లి, మంథనిలో వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కొండగట్టును తిరుపతి స్థాయిలో తీర్చిదిద్దుతానని, వేములవాడ రాజన్న దేవాలయ అభివృద్ధికి వంద కోట్లు ఖర్చు చేస్తామని, జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తానని... ఇలా దాదాపు 40 హామీలు ఇచ్చారు. వాటికి సంబంధించిన నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
అదరగొడతారా!
Published Sat, Mar 7 2015 2:40 AM | Last Updated on Wed, Oct 17 2018 5:04 PM
Advertisement
Advertisement