సీహెచ్‌సీగా రూపాంతరం చెందనున్న పీహెచ్‌సీ భవనం
సాక్షి, అయిజ: జనాభాపరంగా, వ్యాపారపరంగా దినదినాభివృద్ధి చెందుతున్న అయిజ మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గత సంవత్సరం జనవరిలో సివిల్ హాస్పిటల్‌గా మార్చేందుకు అనుమతులు లభించాయి. తొలిత 30 పడకల ఆస్పత్రిని నిర్వహించి కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ (సీహెచ్‌సీ)గా మార్చేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. సీహెచ్‌సీ భవనాన్ని నిర్మించేందుకు సుమారు. రూ.5 కోట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి సివిల్ హాస్పిటల్‌ను నిర్వహించేందుకు రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి.
ఎన్నికల అనంతరం టెండర్‌వర్క్ నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. అయిజ పీహెచ్‌సీని సివిల్ హాస్పిటల్‌గా మార్చి 30 పడుకల ఆస్పత్రిని నిర్వహించనున్నారు. అనంతరం సీహెచ్‌సీ భవనం నిర్మించి వైద్యసేవలందించే ఆలోచనలో ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ఇప్పటివరకు గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ ఉంది. అయిజలో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ ఏర్పాటుచేస్తే నియోజకర్గంలోనే రెండు సీహెచ్‌సీలు ఉంటాయి.
వందల సంఖ్యలో రోగులు
అయిజ మండలంలోని ప్రజలతో పాటు గట్టు, వడ్డేపల్లి మండలాల ప్రజలు అయిజ పీహెచ్‌సీకి వస్తుండటంతో ఇప్పుడున్న 6 పడకల ఆస్పత్రి చాలడంలేదు. ప్రతిరోజూ 150కు పైగా అవుట్ పేషెంట్లు వస్తుంటారు. నెలకు 100కు పైగా ప్రసవాలు జరుగతుంటాయి. గతంలో అయిజ పీహెచ్‌సీలో అత్యధికంగా 547 కాన్పులు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం గద్వాల జిల్లా కేంద్రంలో ఏరియా హాస్పెటల్ ఉంది. అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాత్రమే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది.
ఈ రెండింటికి మధ్యనున్న గ్రామాలకు అయిజ పీహెచ్‌సీ ఉంది. అయితే అలంపూర్ లేదా గద్వాలకు చేరుకోవాలంటే కొన్ని గ్రామాలకు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. వ్యయప్రయాసాలకు గురై అలంపూర్, గద్వాలకు చేరుకోవడానికి ఇష్టపడని ప్రజలు అయిజ పీహెచ్‌సీకి వస్తుంటారు. ప్రసవం కష్టతరమైతే వారు అలంపూర్ లేదా గద్వాలకు వెళ్లాల్సి ఉంటుంది.అయిజ సీహెచ్‌సీ అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. అయిజలో 30 పడకల ఆస్పత్రి నిర్వహిస్తే ప్రసవాల సంఖ్య పెరుగుతుంది.
గద్వాలకు పోవాల్సిన అవసరం ఉండదు
అయిజలో చిన్న ఆస్పత్రిని పెద్ద ఆస్పత్రిగా మార్చితే అయిజ పట్టణం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు పొరుగు మండలాల ప్రజలకు మేలు కలుగుతుంది. ఎన్నికలు ముగిసిన తరువాత పెద్ద ఆస్పత్రిని కడుతామని అధికారులు అంటున్నారు. పెద్ద ఆస్పత్రి కడితే వ్యవ్రయాసాలకు గురై గద్వాలకు పోవాల్సిన అవసరం ఉండదు.
– సుగుణమ్మ, అయిజ
సీహెచ్‌సీలో నాణ్యమైన వైద్యసేవలు..
సీహెచ్‌సీ ఏర్పాటైతే స్త్రీవ్యాధి నిపుణురాలు, చిన్న పిల్లల వైద్యులు, పంటిడాక్టర్, శస్త్రచికిత్స వైదులు, ఫార్మాసిస్టులు, రేడియోగ్రాఫర్, ఎక్స్‌రే ల్యాబ్ అటెండర్, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండర్, వార్డుబాయ్‌లు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆయ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, హెడ్‌నర్సర్ ఉద్యోగాల నియామకాలు చేపడుతారు. అదేవిధంగా డార్క్‌రూం అసిస్టెంట్, వాటర్‌మెన్, వాచ్‌మెన్‌ల ఉద్యోగాలు ఏర్పాటు చేయడంతో రోగులకు సంపూర్ణ వైద్యం అందించేందుకు వీలవుతుంది. అందుకోసం సుమారు రెండకరాల విస్తీర్ణంలో నూతనంగా సీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం పీహెచ్‌సీ ఆవరణలో శిథిలమైన పాతభవనాలు కూల్చివేసి వాటి స్థానంలో సీహెచ్‌సీకి కావాల్సిన భవనం ఏర్పాటు చేస్తారు.
– రామలింగారెడ్డి, మెడికల్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment