తీరనున్న తండ్లాట
పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వ నిర్ణయం
* ఎంపీడీఓల ఆధ్వర్యంలో వివరాల సేకరణ పూర్తి
* 500పైన జనాభా కలిగినవి 163...నెరవేరనున్న గిరిజనుల కల
గ్రామాలకు సుదూరంగా అడవుల్లో, గుట్టల్లో, గుడ్డి దీపాలతో కాలం వెళ్లదీస్తున్న గిరిజన బతుకుల్లో వెలుగులు రానున్నాయి. అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన వారి జీవితాలకు బంగారు బాటలు పడనున్నాయి. తండాలను పంచాయతీలుగా మార్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి కల సాకారమయ్యే రోజులు మరింత దగ్గరలోనే ఉన్నాయి.
చిలుకూరు : జిల్లాలోని గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. తండాలను పంచాయతీలుగా మార్చాలని ఏళ్ల తరబడి గిరిజనులు వినిపిస్తున్న డిమాండ్ త్వరలో నెరవేరనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అధిక జనాభా కలిగిన తండాల వివరాలు సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లాలకు ఉత్తర్వులు పంపించారు. ఈ మేరకు ఎంపీడీఓలు తమకు అప్పగించిన పనిని పూర్తిచేసి ఉన్నతస్థాయి అధికారులకు అందజేశారు.
500 జనాభా ఉన్న తండాలు 163
జిల్లా వ్యాప్తంగా 905 తండాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 500, ఆపై జనాభా కలిగిన తండాలు 163 ఉన్నట్లు గుర్తించారు. పంచాయతీలుగా మార్చేందుకు గుర్తించిన తండాలను కొన్ని షరతుల మేరకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీకి, కొత్తగా పంచాయతీగా మార్చేందుకు గుర్తించబడిన తండాలకు మధ్య ఉన్న దూరం, ఆదాయం తదితర అంశాల ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
గిరిజనులు అధికంగా ఉన్న మండలాలివే...
మఠంపల్లి, దామరచర్ల, నేరేడుచర్ల, మేళ్లచెర్వు, చివ్వెంల, చందంపేట, పెదవూరు, పీఏపల్లి, కోదాడ మండలాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా మండలాల్లో ఉన్న తండాలు ఇప్పటి వరకు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. వీటిని పంచాయతీలుగా గుర్తిస్తేనే అభివృద్ధికి బాటలు పడే అవకాశం ఉంది.
పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాం : కృష్ణమూర్తి, డీపీఓ
ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంపీడీఓల సహకారంతో జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న తండాలకు సంబంధించిన సమాచారం సేకరించాం. ప్రభుత్వం ఏ క్షణంలో సమాచారం అడిగినా వెంటనే ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నూతన గ్రామ పంచాయతీలను గుర్తిస్తాం.