
సాక్షి, మంచిర్యాల: సమాజంలో అంతరాలను తగ్గించేందుకు.. కులాంతర వివాహాలను ప్రో త్సహించేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచింది. కులాంతర వివాహాలు ఈ రోజుల్లో సాధారణ అంశంగా మారగా.. ప్రోత్సాహకాన్ని ఐదు రెట్లు పెంచడంతో యువత వీటివైపు మొగ్గు చూపనుంది. ప్రేమ వివాహాలతోపాటు పెద్దలూ కులాంతర వివాహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కానుకను పెద్ద మొత్తంలో పెంచినట్లు తెలుస్తోంది.
సమాజంలో కులాంతర వివాహాలపై అవగాహన పెరిగింది. ఈ వివాహాలు చేసుకున్న జంటలను ఆయా కుటుంబాలు తమలో కలుపుకుపోతున్నాయి. ప్రభుత్వం కూడా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది 2019–20 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 31 నాటికి మొత్తం 13 మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు.
వీరిలో ముగ్గురికి రూ.50 వేల చొప్పున రూ.1.50లక్షలను అందించారు. మిగిలిన వారికి బడ్జెట్ విడుదల కాగానే ఇవ్వనున్నారు. కేవలం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అంటే ఏడునెలల్లోనే 13మంది జిల్లాలో కులాంతర వివాహాలను చేసుకున్నట్లు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ఐదురెట్లు పెంచడంతో.. ఈనెల ఒకటోతేదీ నుంచి కులాంతర వివాహాలను చేసుకున్న వారికి పెంచిన ప్రోత్సాహకాలు వర్తింపనున్నాయి.
రూ.2.50 లక్షల ప్రోత్సాహకం
జిల్లాలో కులాంతర వివాహాలు సాధారణం అయ్యాయి. గతంలో ఒకే కులం అయితేనే పెళ్లి జరిపించేవారు. సంబంధాలు కలుపుకునేవారు. తమ కులానికి చెందిన వారినే పెళ్లి చేసుకోవాలనే పట్టింపులూ ఉండేవి. రానురాను ఆ పట్టింపులు తగ్గిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. ఆయా కులాలు ఏవైనా సరే వారి అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే పెద్దలను ఒప్పించి కులాంతర వివాహాలను చేసుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకుంటే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం కులాంతర వివాహాలను చేసుకునే వారికి గత అక్టోబర్ నెల వరకు కేవలం రూ.50వేలను మాత్రమే ప్రోత్సాహకంగా అందించింది.
కళ్యాణలక్ష్మి కంటే ఆ ప్రోత్సాహకం తక్కువగా ఉండడంతో కులాంతర వివాహం చేసుకున్న జంటలు కళ్యాణలక్ష్మి పథకం వైపు మొగ్గు చూపారు. కులాంతర వివాహాలను పెద్దలు కూడా ఒప్పుకుంటుండడంతో ఆ పథకం కింద దరఖాస్తు చేసుకుని నగదు అందుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోని జంటలు మాత్రం ప్రభుత్వం అందించే రూ. 50 వేలతోనే సరిపెట్టుకుంటున్నాయి.
ఆర్థికభారం పెరగడంతో ఆ జంటలు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. 2011లో ఈ మొత్తం రూ.10 వేలు ఉండగా.. 2012లో రూ.50 వేలకు పెంచగా.. ప్రస్తుతం రూ.2.50 లక్షలకు పెంచుతూ అక్టోబర్ 31న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ప్రోత్సాహకాలు అమల్లోకి వచ్చాయి.
ప్రోత్సాహకాలు ఇలా..
వేర్వేరు కులాలకు చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకుంటే వారి వివాహానికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వారి పెళ్లి ఆధారాలను బట్టి అధికారులు విచారణ చేసి ప్రోత్సాహకాలకు అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. తర్వాత ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది.
దరఖాస్తుకు అవసరమైనవి
వివాహం చేసుకున్న జంట ఫొటోలు మూడు
తహసీల్దార్ ధ్రువీకరించిన ఇద్దరి కులాల పత్రాలు
వయసు ధ్రువీకరణకు విద్యాసంస్థలు ఇచ్చిన టీసీ, మార్కుల మెమో
వివాహం చేయించిన అధికారి ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రం
గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన ఫస్ట్‌మ్యారేజ్ సర్టిఫికేట్
వివాహం చేసుకున్న జంట కలిపి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు
వివాహానికి సాక్షులుగా ఉన్న వారి వివరాలు
ఆదాయ ధ్రువీకరణ పత్రం
ఆధార్‌కార్డు
రేషన్ కార్డు
ఈ నెల నుంచే అమల్లోకి
కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను రూ.50 వేల నుంచి రూ. 2.50 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం గత నెల 31న ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల ఒకటి నుంచి కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఈ పెంపు వర్తిస్తుంది. దీనిపై యువతకు అవగాహన కల్పిస్తాం.
-రవీందర్ రెడ్డి, మంచిర్యాల జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment