స్టాంపు వెండర్లకు స్వస్తి ! | The Government Is Ending The Process Of Selling Registration Documents Through Stamp Vendors In Telangana | Sakshi
Sakshi News home page

స్టాంపు వెండర్లకు స్వస్తి !

Published Sun, Sep 1 2019 2:12 AM | Last Updated on Sun, Sep 1 2019 5:04 AM

The Government Is Ending The Process Of Selling Registration Documents Through Stamp Vendors In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రిజిస్ట్రేషన్‌ దస్తావేజులను స్టాంప్‌ వెండర్ల ద్వారా అమ్మే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. ప్రస్తుతం స్టాంప్‌ వెండర్ల ద్వారా అధికారికంగానే విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానంలో విక్రయం ద్వారా తలెత్తుతున్న ఇబ్బందులు, వెండర్లు కృత్రిమంగా సృష్టిస్తోన్న కొరతతో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. దీంతో ఈ కొరతకు శాశ్వతంగా చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల విక్రయ బాధ్యతల నుంచి తప్పుకోనుంది. ఈ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ అధీనంలోని స్టాక్‌ హోల్డింగ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌సీఎల్‌)కు అప్పగించే ప్రతిపాద నలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం వెళ్లాయి. అనుమతి రాగానే కొత్త విధానం అమల్లోకి రానుంది. ఆ వెంటనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంప్‌ వెండర్లకు లైసెన్స్‌లు నిలిపివేయనుంది.

ఇప్పుడేం జరుగుతోంది ?
వాస్తవానికి రాష్ట్రంలో 1,665 మంది స్టాంప్‌ వెండర్లు అధికారికంగా రిజిస్ట్రేషన్‌ దస్తావేజులతో పాటు ఇతర స్టాంపులను విక్రయిస్తున్నారు. రూ.1, 2, 20, 100 స్టాంపుల విక్రయం వీరి ద్వారా జరుగు తోంది. ఇందులో 20 రూపాయల స్టాంపు వరకు హైదరాబాద్‌లోనే తయారవు తుండగా, 100 రూపాయల స్టాంపులు మాత్రం మహారాష్ట్రలోని నాసిక్‌లో ముద్రిస్తారు. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసి స్టాంపుల డిపో ద్వారా> అవసరమైన డిమాండ్‌ మేరకు జిల్లా రిజిస్ట్రార్లకు పంపిస్తుంది. ఈ క్రమంలో అటు రిజిస్ట్రేషన్ల శాఖకు, స్టాంపు వెండర్లకు కొంత కమీషన్‌ లభిస్తుంది.

అయితే, స్టాంప్‌ వెండర్లు కాసుల కక్కుర్తితో చాలా సందర్భాల్లో స్టాంపుల కృత్రిమ కొరత సృష్టించడం, స్టాంపులు అందుబాటులో ఉన్నా లేవని చెప్పడంతో రిజిస్ట్రేషన్‌ లావాదేవీల కోసం వచ్చే వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చేది. దీంతో పాటు నాసిక్‌లో స్టాంపులు కొనుగోలు చేసి ఇక్కడి వెండర్లకు ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిధులు కూడా రూ.35 కోట్ల వరకు పేరుకుపోవడంతో అక్కడి నుంచి నోటీసులు అందుతున్నాయి. ఈ సమస్యల నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల విక్రయం నుంచి తప్పుకోవాలని నిర్ణయించిన ఆ శాఖ అధికారులు పలు రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను అధ్యయనం చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏం జరగనుంది ?
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదన ప్రకారం రూ.20, 100 స్టాంపు పేపర్లు ఇకపై భౌతికంగా లభ్యం కావు. ఈ స్టాంపు పేపర్లను విక్రయించే బాధ్యత ఎస్‌హెచ్‌సీఎల్‌కు అప్పగిస్తారు. ఆ సంస్థ ఆన్‌లైన్‌లోనే స్టాంపు పేపర్లను అందుబాటులో ఉంచుతుంది. తమ సాఫ్ట్‌వేర్‌ను బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా ఇతర ప్రైవేటు వ్యక్తులకు అనుసంధానం చేసి వారి ద్వారా స్టాంపు పేపర్లను విక్రయిస్తుంది. అప్పుడు రిజిస్ట్రేషన్‌ దస్తావేజు అవసరం అయిన వ్యక్తులు ఆయా చోట్లకు వెళ్లి నిర్ణీత రుసుము చెల్లిస్తే వెంటనే ఆన్‌లైన్‌లో ప్రింట్‌ తీసి స్టాంప్‌ పేపర్‌ ఇచ్చేస్తారు. అయితే, ప్రైవేటు వ్యక్తులకు కనుక ఎస్‌హెచ్‌సీఎల్‌ ఇచ్చేందుకు అంగీకరిస్తే ప్రస్తుతమున్న స్టాంపు వెండర్లే వాటిని దక్కించుకోవచ్చని, నిర్ణీత రుసుము చెల్లించి వాటిని అందుబాటులో ఉంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులంటున్నారు. మొత్తంమీద ఎస్‌హెచ్‌సీఎల్‌కు స్టాంపు పేపర్ల విక్రయ బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, ప్రజలు.. బ్యాంకులు, పోస్టాఫీసులు, లేదంటే ప్రైవేటు లైసెన్సీల దగ్గర వాటిని పొందవచ్చని అధికారులు చెపుతున్నారు.

మరి డాక్యుమెంట్లు రాసేదెవరు?
రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల విక్రయ బాధ్యతల నుంచి తప్పుకుని స్టాంప్‌ వెండర్‌ లైసెన్స్‌లు ఇవ్వడం నిలిపివేస్తే మరి డాక్యుమెంట్లు ఎవరు రాస్తారనే చర్చ జరుగుతోంది. అయితే, స్టాంప్‌వెండర్లే అనధికారంగా డాక్యుమెంట్‌ రైటర్ల అవతారమెత్తారే కానీ, తామెక్కడా అధికారికంగా డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను ఏర్పాటు చేయలేదని రిజిస్ట్రేషన్‌ అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం ఉన్న విధంగానే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల సమీపంలో ఉన్న కార్యాలయాల్లోనే డాక్యుమెంటేషన్‌ కూడా జరుగుతుందని, ఎస్‌హెచ్‌సీఎల్‌ లైసెన్స్‌లు వచ్చిన వ్యక్తులు లేదా సంస్థలు దీన్ని కొనసాగిస్తారని వారంటున్నారు.

రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో పారదర్శకతకు కూడా కొత్త విధానం ద్వారా మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుత వ్యవస్థ ద్వారా పాత తేదీలతో దస్తావేజులు రాసుకున్నట్లు చెప్పేందుకు వీలుంటుంది. ఇందుకోసం వెండర్లు పెద్దమొత్తంలో వసూలు చేస్తారు. ఎస్‌హెచ్‌సీఎల్‌ ద్వారా స్టాంపుపేపర్లను పక్కా ఆధారాలు తీసుకున్నాక.. ఎప్పటికప్పుడు తేదీలు వేసి మరీ విక్రయించడం ద్వారా ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్టవేసే అవకాశముండొచ్చని తెలుస్తోంది. మొత్తంమీద రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది? ఆస్తులు, భూముల అమ్మకాలు, కొనుగోలు లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది వేచి చూడాల్సిందే !

రిజిస్ట్రేషన్‌ల వివరాలు..
రాష్ట్రంలో ఏటా జరిగే రిజిస్ట్రేషన్లు : 17.50 లక్షలు..
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగినవి : 7.01 లక్షలు..
ఈ నెలలో జరిగినవి : 1.42 లక్షలు
ఈనెల 31న జరిగినవి :  4,421  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement