కరీంనగర్ : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నివారణలో తెలంగాణ సర్కారు విఫలమైందని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్వయానా ముఖ్యమంత్రే ఈ విషయాన్ని అంగీకరించాక.. ప్రజలకు ఎక్కడ ఆరోగ్య భద్రత ఉంటుందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పాలకులు విహంగం దిగి భూప్రదక్షిణలు చేస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించిన కేసీఆర్ ఇప్పుడు పథకాలన్నింటికి కత్తెర్లు పెడుతూ.. సెన్సార్ పాలన నడుపుతున్నారని పొంగులేటి విమర్శించారు. గురువారం కరీంనగర్ వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు అమలుకు నోచుకోకున్నా.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే ఆకర్ష్ పథకం మాత్రం సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, దళితులకు భూపంపిణీ, ఫాస్ట్, బీడీకార్మికులకు జీవనభృతి, చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యల నివారణపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులను ఆశపెట్టి నేడు టీపీఎస్సీ సిలబస్ మారుస్తున్నారన్నారు. ఎంసెట్ ఎవరు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నాగార్జునసాగర్ నీటి వాటా కోసం వెళ్లిన తెలంగాణ ఇంజనీర్లపై ఏపీలో భౌతిక దాడులు చేయడం సరికాదన్నారు. టీడీపీ నాయకులు రేవంత్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి అవాకులు చెవాకులు మాని చంద్రబాబును నిలదీయాలని సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడలేని బీజేపీ ప్రజల కోపతాపాలకు గురికాక తప్పదన్నారు.
'స్వైన్‌ఫ్లూ నివారణలో సర్కారు విఫలం'
Published Thu, Jan 22 2015 8:41 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement