సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం మొదలుకానున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, హెడ్ రెగ్యులేటర్ల పరిధిలోని గేట్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణను ప్రాధాన్యతగా తీసుకుంది. ప్రాజెక్టుల గేట్లు వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో అత్యం త శ్రద్ధ చూపాలని, గోదావరి, కృష్ణా నదులకు వరద పుంజుకునే సమయానికి నిర్వహణ అంశాలన్నింటినీ చక్కబెట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి 12 గంటల వరకు జరిగిన సమీక్షలో ప్రధానంగా ప్రాజెక్టుల గేట్లు, తూములు, కాల్వలు, హెడ్ రెగ్యులేటరీల నిర్వహణ అంశాలపై కాళేశ్వరం, ఎస్సారెస్పీ, కడెం, పాలమూరు–రంగా రెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, జూరాలకు చీఫ్ ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భం గా వరదల నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతూ ఈ నెల ‘సాక్షి’ప్రచురించిన కథనాల్లోని అంశాలను సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. గతేడాది కడెం ప్రాజెక్టు గేట్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులను మరోమారు గుర్తు చేసినట్లు నీటిపారుదల వర్గాలు తెలిపాయి.దీంతోపాటే చాలా ప్రాజెక్టుల పరిధిలో వరదలు వచ్చే సమయాల్లో వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు, గేటు ఆపరేటర్లు, హెల్పర్లు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, లష్కర్ ల పాత్ర కీలకంగా ఉన్నా అవసరానికి తగ్గట్లుగా వారు లేరన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారి నియామకాల విషయంలో జాప్యం చేయరాదని ఇంజనీర్లకు సూచించారు. గేట్లకు గ్రీజింగ్ చేసుకోవాలని, రోప్‌వైర్లు సరిచూసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో లష్కర్‌ల నియామకాలను త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. కాళేశ్వరం నీటితో తొలి ఫలితం ఎస్సారెస్పీ ఆయకట్టుకే అందనున్న దృష్ట్యా దాని పరిధిలోని కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాల్వల ఆధునీకరణ, అవసరమైన మరమ్మతు పనులను 20 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
కొండపోచమ్మ నుంచే సింగూరుకు..
మల్లన్న సాగర్ నుంచే కాళేశ్వరం నీటిని సింగూరుకు తరలించాలంటూ రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికపై పత్రికల్లో వచ్చిన కథనంపైనా సీఎం తన సమీక్షలో ప్రస్తావించినట్లు తెలిసింది. మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపులో 18 కి.మీ. టన్నెల్ పనుల పూర్తి అంశం అడ్డంకిగా ఉందని, అన్నీ ఆలోచించే కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని సింగూరుకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎం ఇంజనీర్లతో వ్యాఖ్యా నించినట్లు తెలిసింది.
ఈ విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయాలకు తావులేదని, గతంలో నిర్ణయించిన మాదిరే సింగూరుకు నీటి తరలింపుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. పాలమూరు–రంగారెడ్డి పనులకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ.10 వేల కోట్ల మేర రుణం తీసుకుం టున్న దృష్ట్యా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తుమ్మిళ్ల రెండోదశ పనులు, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఆర్డీఎస్‌లో మిగిలిన పనుల పూర్తిని వేగిరం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment