‘గ్రీన్‌హౌస్’కు ఆర్థిక కష్టాలు
నయా పైసా విడుదల చేయని సర్కారు
♦ నిర్మాణాలు నిలిపివేసిన కంపెనీలు
♦ అప్పులు చేసి వాటా ఇచ్చిన రైతుల గగ్గోలు
సాక్షి, హైదరాబాద్ : గ్రీన్‌హౌస్ (పాలీహౌస్) పథకం పడకేసింది. నిధులు లేక నీరసించింది. రైతు చెల్లించిన వాటా మేరకే పనులు చేపట్టిన కంపెనీలు చేతులు దులుపుకున్నాయి. గంపెడాశతో ముందుకు వచ్చిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. లక్షల్లో అప్పులు చేసి ఆగమయ్యామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది గ్రీన్‌హౌస్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో దానికోసం రూ. 250 కోట్లు కేటాయించింది. 847 ఎకరాల్లో గ్రీన్‌హౌస్ సాగు ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద గ్రీన్‌హౌస్ నిర్మించుకునే రైతులకు 75 శాతం సొమ్ము ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన 25 శాతం సొమ్మును రైతు ముందుగా చెల్లించాలి.
రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని రైతులు 181.28 ఎకరాల్లో గ్రీన్‌హౌస్ సాగుకు ముందుకు వచ్చారు. అందుకోసం తమ వాటా 25 శాతం కింద సుమారు రూ.18 కోట్ల మేరకు చెల్లించారు. ఒక్కో ఎకరానికి సుమారు రూ. 10 లక్షల వరకు తమ వంతు వాటాగా ఖర్చు పెట్టారు. ఆ సొమ్మును గ్రీన్‌హౌస్ నిర్మాణం చేపట్టే కంపెనీలకు ప్రభుత్వం చెల్లించింది. దీంతో ఆయా కంపెనీలు 181 ఎకరాల్లో పనులు మొదలుపెట్టాయి.
పావు వంతు పనులు పూర్తిచేశాయి. మిగిలిన పనుల కోసం ప్రభుత్వం రూ. 53.51 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ మేరకు ఉద్యానశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి నయాపైసా విడుదల కాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు పనులను అర్ధాంతరంగా నిలిపివేసి అడ్రస్ లేకుండా పోయాయి. అప్పులు చేసి రంగంలోకి దిగితే ప్రభుత్వం తమను మధ్యలోనే ముంచేసిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.