సాక్షి, హైదరాబాద్
రోజురోజుకూ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో దాడులు చోటు చేసుకున్నాయి. గత వారం గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే రెండు నెలల శిశువు చనిపోయిందని ఆగ్రహానికి గురైన బంధువులు ఓ డాక్టర్‌పై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రధానంగా బోధనాస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లపై ఇటువంటి దాడులు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం. దాడులకు నిరసనగా జూనియర్ డాక్టర్లు (జూడా)రెండ్రోజులపాటు గాంధీ, నీలోఫర్ ఆసుపత్రుల్లో వివిధ రకాల వైద్య సేవలను బంద్ చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత జూడాలతో సమావేశమై చర్యలు తీసుకుంటానని హామీయిచ్చారు. దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, డాక్టర్లకు భద్రత కల్పిస్తామన్నారు.
ఎందుకీ పరిస్థితి...?
నిలోఫర్ ఆసుపత్రిలో రోగి బంధువు వార్డుల్లోకి వెళ్లాలంటే అటెండర్‌కు పది రూపాయలు ఇవ్వాలి. నాలుగు ఫోర్లకు వెళ్లాలంటే రూ. 40 ఇవ్వాలి. ప్రభుత్వాసుపత్రుల్లో కొరత కారణంగా డాక్టర్లు మందులు రాసిస్తారు. వాటిని కొనేందుకు రోగి బయటకు వెళ్లాలి. తిరిగి వచ్చేప్పుడు మళ్లీ అదే తంతు. ఏదైనా పరీక్ష చేయించాలంటే ఆసుపత్రిలో అందుబాటులో ఉండవు. బయటకు వెళ్లి చేయించాలి. రోగిని బంధువే వీల్‌చైర్‌లో కానీ, మోసుకొని కానీ తీసుకెళ్లాలి.
ఒకవేళ రోగికి సీరియస్ అయితే వైద్యుల కొరత కారణంగా సకాలంలో వైద్యం చేసే పరిస్థితి ఉండదు. ఇవే ఇప్పుడు జూనియర్ డాక్టర్లపై దాడులకు కారణంగా నిలుస్తున్నాయని జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ అభిప్రాయపడుతున్నారు. వైద్యం విషయంలో రోగులకు అనేక హక్కులున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల 17 రకాల హక్కులపై ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని అమలు చేయకపోవడం వల్లే రోగులకు, డాక్టర్లకు మధ్య వివాదంగా మారి ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది.
రోగుల హక్కులేంటి?
►జబ్బుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు రోగికి ఉంది. రోగికి వచ్చిన జబ్బు ఏంటో వైద్యులు తెలియజేయాలి. జబ్బు తీవ్రతను రోగికి అర్థమైన సులువైన భాషలో చెప్పాలి. డాక్టర్ అర్హతను తెలుసుకునే హక్కు రోగికి ఉంది.
►అత్యవసర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగికి తక్షణమే వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులది. అత్యవసర వైద్యం పొందే హక్కు ప్రతి రోగికీ ఉంది. ముందస్తు ఫీజు చెల్లించకున్నా వైద్యం చేయాలి.
►మహిళారోగులకు పురుష వైద్యుడు చికిత్స చేసే పరిస్థితి వస్తే, తప్పనిసరిగా ఆ మహిళా రోగికి తోడుగా మరో మహిళ ఉండేలా చూడాలి.
►ఫీజులు, ధరల విషయంలో పారదర్శకత ఉండాలి. చికిత్సలకు వసూలు చేసే ధరలను ఆసుపత్రులు రోగులకు బ్రోచర్ల రూపంలో ఇవ్వాలి. ఇంగ్లిషులోనూ, స్థానిక భాషలోనూ అవి ముద్రించి ఇవ్వాలి.
►ఫీజుల విషయం సహా ఇతరత్రా వివాదాలు నెలకొంటే ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యే హక్కు రోగికి ఉంది. శవాన్ని తీసుకెళ్లేందుకు బంధువులకు హక్కుంది. ఒకవేళ సంబంధిత బంధువులు ఫీజు చెల్లించకపోయినా శవాన్ని తీసుకెళ్లకుండా ఆపకూడదు.
►రోగుల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి.
డాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ప్రతి రోగిని పట్టించుకునే పరిస్థితి ఉండటంలేదు. ఇది రోగికి, డాక్టర్‌కు మధ్య అగాధాన్ని పెంచుతోంది. దాన్ని అర్థం చేసుకోవాలే కానీ డాక్టర్లపై రోగులు దాడి చేయడం సమంజసం కాదు.
డాక్టర్ కరుణాకర్‌రెడ్డి,
వీసీ, ఆరోగ్య విశ్వవిద్యాలయం
సమయం ఇవ్వకపోవడం వల్లే అసహనం
వైద్యులపై ఒత్తిడి పెరుగుతున్నమాట వాస్తవం. వైద్యులు రోగులకు సమయం కేటాయిస్తే వారి మధ్య అగాథం పెరగదు. ఈ విషయాన్ని మేం జూనియర్ డాక్టర్లకు చెబుతున్నాం. రోగులు ఇలా వైద్యులపై దాడులు చేయడం సమంజసం కాదు.
డాక్టర్ గంగాధర్,
నెఫ్రాలజిస్ట్, నిమ్స్
Comments
Please login to add a commentAdd a comment