‘విత్తన దీక్ష’పై కదిలిన సర్కారు
అధికారుల వైఫల్యంపై మంత్రి పోచారం ఆగ్రహం
సాక్షి, కామారెడ్డి: విత్తన కష్టాలపై ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో ఆదివారం ప్రచురితమైన ‘విత్తన దీక్ష’ కథనం సర్కారును కదిలించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పంపిణీలో వ్యవసాయ శాఖ అధికారుల వైఫల్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో విత్తనాల కోసం రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’ ఆదివారం కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.. మంత్రి ఆదేశాలతో జేడీఏతో పాటు ఇతర అధికారులు సోమవారం మద్నూర్, బిచ్కుందలకు వెళ్లి రైతులతో మాట్లాడారు. రైతులకు అవసరమైనన్ని విత్తనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. మద్నూర్‌లో అదనంగా ఐదు కౌంటర్లను ఏర్పాటు చేయించారు. దీంతో సోమవారం విత్తనాల పంపిణీ ప్రశాంతంగా సాగింది. (చదవండి : విత్తన దీక్ష)
రైతులకు సరిపడా విత్తనాలందిస్తాం..
రబీలో సాగుకు అవసరమైన విత్తనాలను అందించడానికి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు తలెత్తాయన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. విత్తనాల పంపిణీలో జరిగిన లోపాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.