- ఆర్థిక సంవత్సరం ముగియడంతో మురిగిపోయిన నిధులు
- చెల్లించిన వడ్డీలు రీయింబర్స్ కాక ఎస్‌హెచ్‌జీ మహిళల గగ్గోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులివ్వకుండా కేవలం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)తో మభ్యపెడుతోంది. ‘వడ్డీ లేని రుణాలు’పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయంసహాయక సంఘాల మహిళలకు రూ.1,245.35 కోట్లు ఇస్తున్నట్లుగా గత నెల 13న ప్రభుత్వం బీఆర్వో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. మార్చి 31 లోగా నిధులు విడుదల చేయకపోవడంతో గత బడ్జెట్లో కేటాయించిన నిధులు మురిగిపోయాయి.
ఫలితంగా బీఆర్వో చెల్లుబాటు కాని చిత్తు కాగితమైంది. వాస్తవానికి వడ్డీలేని రుణాల పథకం కింద 3.5 లక్షల స్వయంసహాయక సంఘాలకు చెందిన దాదాపు 24 లక్షల మంది మహిళలు పొందిన రుణాన్ని వడ్డీతో సహా చెల్లించారు. కానీ ఆ వడ్డీని రీయింబర్స్ చేయాల్సిన ప్రభుత్వం రెండేళ్లుగా పట్టించుకోవడం లేదు. దాదాపు రూ.1,110 కోట్ల వడ్డీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోతుండడంతో ఎస్‌హెచ్ జీ మహిళలు బెంబేలెత్తుతున్నారు.
సెర్ప్ ఉద్యోగుల వేతనాలకూ తిప్పలు
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 4,224 మంది ఉద్యోగుల వేతనాలకు రెండు నెలలుగా సర్కారు నిధులు విడుదల చేయలేదు. గతేడాది ఫిబ్రవరి వేతనాల బీఆర్వోను మార్చి 30న జారీ చేసింది. బీఆర్వోతో మార్చి31న ఆర్థిక శాఖ వద్దకు వెళ్లిన అధికారులు... క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో సదరు బీఆర్వో ఎందుకూ పనికి రాకుండా పోయింది.